మెల్కీసెదెకు

షాలేము రాజు మరియు యాజకుడు అయిన మెల్కీసెదెకు బైబిల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే కనిపిస్తాడు. మొదటగా, అతడు ఆదికాండము 14:18-20లోని చారిత్రక నేపథ్యంలో వస్తాడు. తరువాత కీర్తన 110:4లో అతని ప్రస్తావన ఉంది. మరియు హెబ్రీయులు 5-7 అధ్యాయాలలో మనం అతన్ని మళ్ళీ కనుగొంటాం.

ఆదికాండము 14:18-20, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి–ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.

అబ్రాము కనానుకు తిరిగి వచ్చినప్పుడు అతన్ని కలవడానికి ఇద్దరు రాజులు వచ్చారు. ఇద్దరిలో మొదటివాడు మెల్కీసెదెక్. ఈ భాగం అతని గురించి ప్రాముఖ్యమైన కొంత సమాచారాన్ని మనకు అందిస్తూ, ఇతడు జలప్రళయం నుండి అందించబడిన యెహోవా నిజమైన మతాన్ని ఆరాధించేవాడని, అతన్ని “షాలేము రాజు” (యెరూషలేము, (శాంతి) మరియు “సర్వోన్నతుడైన దేవుని యాజకుడు” అని వర్ణిస్తుంది. అతని గురించి అతని తల్లిదండ్రుల గురించి మనకేమి తెలియదు. అతడు రాజు మరియు యాజకుడు. దేవుని నియామకం ద్వారా అతడు యాజకుడయ్యాడని మాత్రమే మనకు తెలుసు. అతని పూర్వీకులు లేదా వారసులు ఎవరో మనకు తెలియదు. అతడు ప్రత్యేకమైనవాడు. ఈ యాజక రాజు యుద్ధంలో అలసిపోయిన అబ్రాముకు అతని సేవకులకు ఆహారాన్ని తీసుకువచ్చాడు. అబ్రామునకు విజయం ఇచ్చినందుకు ఇతడు దేవునికి బహిరంగంగా ఘనతను ఇచ్చాడు. యుద్ధ దోపిడిలో పదవ వంతును అందించడం ద్వారా అబ్రాము మెల్కీసెదెక్ ను సర్వోన్నతుడైన దేవుని యాజకునిగా గుర్తించాడు. అలా చేయడం ద్వారా, అబ్రాము తన ఆధ్యాత్మిక యాజకునిగా మెల్కీసెదెక్‌ను గుర్తించానని కూడా చూపించాడు.

కొత్త నిబంధన మెల్కీసెదెక్ పై ప్రసరింపజేసే ముఖ్యమైన వెలుగే లేకుంటే ఇది అబ్రాము జీవితంలో ఒక మనోహరమైన సంఘటన మాత్రమే అవుతుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మెల్కీసెదెకు అనేది యేసు యొక్క పాత నిబంధన చిత్రం. అతడు యాజకుడు మరియు రాజు అనే డబుల్ పదవిని కూడా కలిగి ఉన్నాడు.

హెబ్రీయులకు రాసిన పత్రిక మెల్కీసెదెకు గురించి క్రైస్తవ మతానికి ప్రాథమికమైన రెండవ సత్యాన్ని నొక్కి చెబుతుంది. పాత నిబంధన శతాబ్దాల అంతటా, దేవుడు తన ఇశ్రాయేలీయులను అబ్రహం మునిమనవడు లేవీ తెగకు చెందిన యాజకులు అని పిలువబడే మధ్యవర్తుల ద్వారా తనను సంప్రదించమని ఆదేశించాడు. ఈ లేవీయ యాజకులు ప్రతిరోజూ పాపం యొక్క తీవ్రతను సూచించే రక్త బలులను తీసుకువచ్చారు. అది పాపానికి దేవుని ఏకైక పరిష్కారాన్ని సూచించింది. కానీ తూర్పు రాజులతో యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు, లేవీ ముత్తాతయైన అబ్రాము మరొక వంశం నుండి వచ్చిన యాజకుడికి దశమ వంతును (భాగాన్ని) చెల్లించాడు. శతాబ్దాల రక్త బలులతో సహా – పాత నిబంధనలోని అన్ని మతపరమైన ఆచారాలు మరియు నిబంధనలు నిజంగా దోషియైన పాపిని దేవునితో సమాధానపరచలేవని ఇక్కడ మనకు హామీ ఉంది. పాపి అయిన లేవీయుడి కంటే మంచి యాజకుడు మరియు జంతు బాధితుడి కంటే మంచి బలి అవసరం. కాబట్టి యేసును “మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు” అని పిలుస్తారు (కీర్తన 110:4; హెబ్రీయులు 5:6; 7:11–17), పాపులను దేవునితో సమాధానపర్చగల ఏకైక యాజకుడు యేసు. మెల్కీసెదెకు షాలేము రాజు (శాంతి). తన సిలువ రక్తంతో శాంతి చేసిన యేసు, శాంతి రాజు. మెల్కీసెదెకు యాజకుడు. దేవుని సింహాసనం వద్ద క్రీస్తు శాశ్వతంగా యాజకుడిగా పనిచేస్తున్నాడు. మెల్కీసెదెకు లేవీయుల యాజకుల కంటే ఉన్నతుడిగా చూపబడ్డాడు.

లేవీ యాజకత్వం మరియు మోషే వ్యవస్థ యొక్క అసంపూర్ణత కూడా గమనించబడింది. కీర్తన 110:4, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ వచనం, మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడిని గురించి ప్రవచించింది. ఈ వచనం యొక్క గంభీరత మరియు నిశ్చయత అది ఒక ప్రమాణం అనే వాస్తవం ద్వారా నొక్కి చెప్పబడింది. ఈ వచనం ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ఇస్తుంది. దావీదు కుమారుడైన మెస్సీయ రాజు మాత్రమే కాదు; అతను యాజకుడు కూడా అవుతాడు. ఇతడు లేవీయుల నుండి రాడు. ఇది ఆశ్చర్యకరమైనది ఎందుకంటే పాత నిబంధనలో రాజ్యాధికారం మరియు యాజకత్వం ఖచ్చితంగా వేరు చేయబడ్డాయి. రాజులు యూదా గోత్రానికి చెందిన దావీదు కుటుంబం నుండి వచ్చారు. యాజకులు లేవీ గోత్రానికి చెందిన అహరోను కుటుంబం నుండి వచ్చారు. క్రీస్తు అసాధారణమైన పదవుల కలయిక ఆయన సాధారణ యాజకుడు కాదని సూచిస్తుంది. యేసు వంశపారంపర్యంగా యూదాకు చెందిన వాడు. ప్రభువు పరిపూర్ణమైన ప్రధాన యాజకున్ని ప్రమాణం చేశాడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. యేసు మెరుగైన నిబంధనకు పూచీదారునిగా నియమించబడ్డాడు. ఆయన మెల్కీసెదెకు క్రమంలో యాజకుడిగా ఉంటాడు.

హెబ్రీయులు 4 నుండి 10 అధ్యాయాలు క్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో యాజకుడు అంటే ఏమిటో చాలా వివరంగా వివరిస్తాయి. హెబ్రీయులు 7వ అధ్యాయం ఈ పోలిక యొక్క కీలకమైన అధ్యాయం.

మెల్కీసెదెకు లాగా, క్రీస్తు కూడా దేవుని ప్రత్యేక నియామకం ద్వారా తన యాజకత్వాన్ని పొందాడు. ఆయన యాజకుడిగా ఉండటానికి సరైన గోత్రం లేదా కుటుంబం నుండి వచ్చినవాడు కాదు. మెల్కీసెదెకు లాగా, క్రీస్తు స్వయంగా ఒక తరగతిలో ఉన్నాడు. పాత నిబంధన ప్రధాన యాజకులు అర్పించిన అన్ని అర్పణలు వారి స్వంత విలువ ఆధారంగా ఒక్క పాపిని కూడా అపరాధం నుండి విడిపించలేవు కాబట్టి దేవుడు క్రీస్తును మెల్కీసెదెకు లాగా ప్రత్యేకమైన యాజకుడిగా పంపవలసి వచ్చింది. వారు గొప్ప, మరింత పరిపూర్ణమైన అర్పణను సూచించినందున మాత్రమే వారు క్షమాపణ అందించారు. ఆ అర్పణను గొప్ప ప్రధాన యాజకుడైన క్రీస్తు అర్పించాడు.

హెబ్రీయులు 7:11–17, ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్యచేయ లేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా –నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.

క్రీస్తు ప్రధాన యాజకత్వం యొక్క శ్రేష్ఠతకు రచయిత క్రమంగా దారితీస్తున్నాడు. మెల్కీసెదెకు శ్రేష్ఠుడైతే, ఆయన సూచించిన ప్రధాన యాజకుడు కూడా శ్రేష్ఠుడై ఉండాలి. ఈ వాస్తవాన్ని చూపించడానికి, రచయిత యాజకత్వం యొక్క ఉద్దేశ్యాన్ని సూచిస్తున్నాడు. దాని విధి పాపిని దేవుని ముందు ఆమోద యోగ్యునిగా చెయ్యడం, దీనిని లేవీయ యాజకత్వం చెయ్యలేక పోయింది. ఈ యాజకత్వానికి మద్దతుగా దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటికీ, దాని ఆపరేషన్ గురించి నిబంధనల తర్వాత నిబంధనలను నిర్దేశించినప్పటికీ, లేవీయ యాజకత్వం అసంపూర్ణంగా ఉందనే వాస్తవం అలాగే ఉంది. అది దేవుని ముందు మనిషిని ఆమోదయోగ్యంగా చేయలేకపోయింది. దాని పదేపదే జంతు బలుల రక్తంతో అది చేయగలిగింది పాపులను శుద్దులుగా చేసే ఆ ఒక గొప్ప అర్పణను సూచించడమే.

ఈ అసమర్థత కారణంగా, లేవీయ యాజకత్వం భర్తీ చేయవలసి వచ్చింది. అది జరిగింది. లేవీయ యాజకత్వం అమలులో ఉన్న చాలా కాలం తర్వాత వ్రాయబడిన 110వ కీర్తనలో దావీదు భర్తీ గురించి ధైర్యంగా మాట్లాడాడు. అహరోను లాగా కాదు, మెల్కీసెదెక్ లాగా కొత్త ప్రధాన యాజకుడు ఉండాలి. మెల్కీసెదెక్ యాజకత్వం స్థానంలోకి వస్తే, దానికి మద్దతుగా ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రం సంగతి ఏమిటి? అది కూడా మార్చబడింది. 8వ అధ్యాయం చూపినట్లుగా, మోషే నిబంధన ఇక నిలబడదు. యాజకత్వాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మరియు మానవుడిని శాశ్వతంగా కలిపే ఉన్నతమైన ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి ఉన్నప్పుడు, ఆ యూదు క్రైస్తవులు అసంపూర్ణ యాజకత్వానికి మరియు పాత నిబంధనకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారా?

ఈ ప్రధాన యాజకుని వంశావళి కూడా ధర్మశాస్త్రం మార్చబడిందని చూపించింది. లేవీ గోత్రం వెలుపల ఉన్న ఎవరైనా యాజకుడిగా ఉండటానికి, ఆలయం వెలుపల ఉన్న గొప్ప బలిపీఠం వద్ద బలులు అర్పించడానికి ధర్మశాస్త్రం ఎక్కడా నిబంధన చేయలేదు. అయినప్పటికీ ఈ ప్రధాన యాజకుడు “యూదా నుండి వచ్చినవాడు” అని అందరికీ తెలుసు. మత్తయి 1 మరియు లూకా 3 అధ్యాయాలలో ఇవ్వబడిన వంశావళి పట్టికలు మరియు లూకా 2 అధ్యాయంలో ఆయన జనన వృత్తాంతం రెండూ యేసు యూదా నుండి వచ్చినవాడని చెప్తున్నాయి. మన ప్రభువు “యూదా నుండి వచ్చినవాడు” అని రచయిత చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మార్చబడింది; ఇకపై లేవీయులు యాజకులు కారు. యూదా నుండి ఒకరు ఇప్పుడు సేవ చేస్తారు మరియు చాలా ఉన్నతమైన రీతిలో సేవ చేస్తారు.

లేవీయ యాజకత్వం యొక్క అసంపూర్ణత, మోషే ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడం మరియు యూదా నుండి క్రీస్తు సంతతికి రావడం గురించి చెప్పబడినవన్నీ యేసును ఉన్నతమైన ప్రధాన యాజకుడిగా స్పష్టంగా గుర్తించాయి. మరొకటి దీనిని మరింత స్పష్టం చేస్తుంది. క్రీస్తు “తన పూర్వీకుల నియమావళి ఆధారంగా కాకుండా నాశనం చేయలేని జీవిత శక్తి ఆధారంగా యాజకుడయ్యాడు.” లేవీయ యాజకత్వం మర్త్యమైనది కాబట్టి, వారసత్వం గురించి ఆజ్ఞలు అవసరమయ్యాయి. లేవీ వారసులను ఆజ్ఞలు యాజకులుగా చేశాయి మరియు ప్రత్యామ్నాయాలు అవసరమైనప్పుడు ఆజ్ఞలు ఈ యాజకత్వాన్ని కొనసాగించాయి.

ఈ గొప్ప ప్రధాన యాజకుడితో, ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఏ ఆజ్ఞ ఆయన్ని యాజకుడిగా చేయలేదు. ఆయన వారసుల గురించి ఎటువంటి ఆజ్ఞలు అవసరం లేదు. ఆయన జీవితం “నాశనం చేయలేనిది.” ఆయన దైవ-మానవుడు. యోహాను 14:6లో చెప్పినట్లుగా, ఆయనే జీవం. ఆయన శాశ్వతమైన యాజకత్వం, అది వాస్తవానికి అంతం లేని జీవితాన్ని ఇవ్వగలదు మరియు ఆయన మరణం ఎప్పటికీ విడదీయలేని ప్రేమతో ఆయనను మనతో కలుపుతుంది. దేవుడే దావీదు రాజు ద్వారా ఇప్పటికే అలా చెప్పాడు. కీర్తన 110:4 లో, “మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువు” అని సాక్ష్యమిచ్చినప్పుడు, ఆయన తన నిత్య కుమారుడిని లేవీ మర్త్య వంశానికి ఉన్నతమైన ప్రత్యామ్నాయంగా గుర్తించాడు.

క్రీస్తు యాజకత్వం పరిపూర్ణమైనది మరియు ఎంతో గొప్పది. ఆయన (యేసు) తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారిని పూర్తిగా రక్షించగలడు, ఎందుకంటే ఆయన వారి కోసం మధ్యవర్తిత్వం చేయడానికి ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు (నిత్యుడు). ఈ ప్రధాన యాజకుడు పవిత్రుడు. ఆయన పాపి కాదు. ఆయన తన సొంత పాపాల కోసం బలి అర్పించడు, కాని ఆయన దానిని ఇతరుల పాపాల కోసం చేస్తాడు. ఆయన మెల్కీసెదెకు లాగా ఎప్పటికీ యాజకుడు. క్రీస్తు లేదా మెల్కీసెదెకు యాజకత్వాలకు ప్రారంభం లేదా ముగింపు నమోదు చేయబడలేదు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,          
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl