పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము మరియు అర్ధము

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.

పరిశుద్ధ ప్రభురాత్రి భోజన నియమము 

మొదటిది: పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము అనగానేమి?

ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరము మరియు రక్తము క్రింద రొట్టె ద్రాక్షారసమై యున్నది. దీనిని తిని త్రాగుటకు క్రైస్తవులమైన మన కొరకు ఇది క్రీస్తుచే నియమింపబడియున్నది.

ఇదెక్కడ వ్రాయబడియున్నది?

మత్తయి మార్కు లూకా యను పరిశుద్ధ సువార్తికులును, అపోస్తులుడైన పౌలు చెప్పిన వానిలో: మన ప్రభువైన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి యందు, రొట్టెను తీసుకొని, కృతజ్జ్యతాస్తుతులు చెల్లించి, ఆయన దానిని విరచి తన శిష్యులకిచ్చి, “మీరు తీసుకొని తినుడి, ఇది మీకొరకియ్యబడుచున్న నా శరీరమై యున్నది. నన్ను జ్జ్యపాకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని చెప్పెను.

ఆ ప్రకారమే వారు భోజనము చేసిన తరువాత ఆయన పాత్రను తీసుకొని కృతజ్జ్యతాస్తుతులు చెల్లించి, దానిని వారికిచ్చి, “దీనిలోనిది మీరు త్రాగుడి, యీ పాత్ర నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన; మీ పాపక్షమాపణ కొరకై చిందింపబడిన నా రక్తము, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్జ్యపాకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని చెప్పెను. (మత్తయి 26:26-28; మార్కు 14:22-24; లూకా 22:19-20)

పరిశుద్ధ ప్రభురాత్రి భోజనపు దీవెనలు

రెండవది: వీనిని తినుట వలనను, త్రాగుట వలనను మనము ఎటువంటి దీవెన పొందుదుము? “ఇయ్యబడుచున్నదనియు” మరియు “పాపక్షమాపణ నిమిత్తము మీ కొరకు చిందింపబడుచున్నదనియు” చెప్ప బడు మాటలు వీని ప్రయోజనమును మనకు చూపుచున్నవి.

ఈ మాటల ద్వారా ఈ సంస్కారములో మనకు పాప పరిహారమును, జీవమును, రక్షణను మనము పొందుదుము.

పాప పరిహారమెక్కడనో అక్కడనే జీవమును మరియు రక్షణను ఉండును.

పరిశుద్ధ రాత్రి భోజనము యొక్క శక్తి

మూడవది: తినుట వలనను, త్రాగుటవలను, ఇటువంటి ఘనమైన మేళ్లు ఏలాగు కలుగును?

వాస్తవముగా తినుట వలనను మరియు త్రాగుట వలనను ఇటువంటి మేళ్లు కలుగవు, గాని “మీ కొరకు ఇయ్య బడుచున్నదనియు” మరియు “పాపక్షమాపణ నిమిత్తమై మీకొరకు చిందింపబడుచున్నదనియు“, చెప్పబడు ఈ మాటల వలన ఇటువంటి మేళ్లు కలుగును.

తినుట త్రాగుట అను వాటితో కూడా ఈ మాటలు ఈ సంస్కారములో ప్రధానమైనవి.

ఈ మాటలు విశ్వసించు వానికి పాప పరిహారము కలుగుచున్నదని ఈ మాటలు స్పష్టముగా చెప్పుచున్నవి.

పరిశుద్ధ ప్రభురాత్రి భోజనమును పుచ్చుకొనుట

నాల్గవది: ఈ సంస్కారమును పొందుటకు తగిన విధముగా సిద్దపడిన వారెవరు?

ఉపవాసము మరియు శరీర సంబంధమైన ప్రయాసములు మంచి ఉదేశ్యమునకు ఉపకరించును, అయినను “పాపక్షమాపణ నిమిత్తమై మీ కొరకియ్యబడుచున్నదనియు” మరియు “చిందింపబడుచున్నదనియు” చెప్పబడు మాటలను విశ్వసించువాడే తగిన విధముగా సిద్దపడిన వాడు.

కాని ఈ మాటలు విశ్వసింపనివాడు లేక సందేహపడువాడు సిద్దపడని వాడై యున్నాడు, ఎందుకనిన “మీ కొరకు” అను మాటలను విశ్వసించు హృదయములు తప్ప అవసరమైనదేదియు లేదు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.