క్యాటికిజం (ప్రశ్నోత్తరి) అనేది ఒక ప్రాథమిక బోధనా పుస్తకం. మార్టిన్ లూథర్ తన క్యాటికిజం (ప్రశ్నోత్తరి) రాయడానికి ముందే చాలా విభిన్నమైన క్యాటికిజంలు (ప్రశ్నోత్తరిలు) ముద్రించబడ్డాయి. క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక సత్యాలను బోధించడానికి వాళ్ళు వాళ్ళ క్యాటికిజంలో (ప్రశ్నోత్తరిలో) పది ఆజ్ఞలు, అపొస్తలుల విశ్వాస ప్రమాణము మరియు ప్రభువు ప్రార్థనలను మాత్రమే ఉపయోగించేవాళ్ళు.

మార్టిన్ లూథర్ గారు 16వ శతాబ్దంలో జర్మనీలోని చర్చిలో నాయకుడు. అతడు తన ప్రాంతంలోని సంఘాలు ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళినప్పుడు విశ్వాసులలో ఎవరికి ప్రభువు ప్రార్థన లేదా ఆజ్ఞలు తెలియక పోవడం పట్ల అతను చాలా నిరాశ చెంది పాస్టర్లు సోమరులు అని చెప్తూ దేవుని ప్రజల కంటే వాళ్ళు పశువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అని చెప్పాడు.

మార్టిన్ లూథర్ గారు ఏక సమయంలో రెండు క్యాటికిజంలు (ప్రశ్నోత్తరిలు) రాశాడు. పాస్టర్లు తల్లిదండ్రులు పిల్లలకు ముఖ్యమైన బైబిలు సత్యాలను బోధించగలిగేలా స్మాల్ క్యాటికిజంని (ప్రశ్నోత్తరిని)  అందరికి అర్ధమయ్యేలా వ్రాసాడు.  ఇది అన్ని వయస్సులలో ఉన్న విశ్వాసులందరికి క్రైస్తవ విశ్వాసం యొక్క మంచి, సరళమైన ప్రకటన అని చెప్పొచ్చు. ఒక సంవత్సరం ఆదివారాల్లో లూథర్ బోధించిన ప్రసంగాల శ్రేణి ఆధారంగా లార్జ్ క్యాటికిజం (ప్రశ్నోత్తరి) రూపొందించ బడింది. పాస్టర్లు స్మాల్ క్యాటికిజంని (ప్రశ్నోత్తరిని) చక్కగా అర్ధం చేసుకొని ఇతరులకు దానిని భోదించగలిగేలా వారికి సహాయపడేందుకు ఇది వ్రాయబడింది.

లూధర్ ప్రశ్నోత్తరిలోని ప్రధానమైన ఆరు ముఖ్య భాగాలు

బైబిల్‌లో చాలా బోధలు ఉన్నప్పటికీ, దాదాపు అన్ని ముఖ్యమైన సత్యాలు ఈ ఆరు భాగాలలో కనిపిస్తాయి.

1. 10 ఆజ్ఞలు

2. అపొస్తలుల విశ్వాస ప్రమాణము

3. ప్రభువు ప్రార్థన

4. పరిశుద్ధ బాప్తిస్మము

5. పరలోకపు తాళపు చెవులు మరియు ఒప్పుకోలు

6. పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము

ధర్మశాస్త్రము మరియు సువార్త యొక్క సారాంశం

క్రైస్తవ విశ్వాసములొ ధర్మశాస్త్రము సువార్త ఎంతటి ప్రధానమో అందరికి అర్ధమయ్యేలా లూథర్ గారు  చూపించాలను కున్నాడు. రెండు బోధనలు భిన్నమైనవి, కాని అవి రెండూ చాలా ముఖ్యమైనవి.

• బైబిలులో మరియు క్యాటికిజంలో (ప్రశ్నోత్తరిలో) ధర్మశాస్త్రము 10 ఆజ్ఞల రూపములో సంక్షిప్తపర్చబడి యున్నది. దేవుడు మనం ఏం చెయ్యాలని కోరుకొంటున్నాడో ఏం చెయ్యకూడదని చెప్తూవున్నాడో ధర్మశాస్త్రం మనకు చెప్తూవుంది. మన అవిధేయతను బట్టి మనం నిత్య మరణ శిక్షకు అర్హులమని ఇది మనకు చెప్తూ వుంది. 

• క్యాటికిజంలో (ప్రశ్నోత్తరిలో), సువార్త అపొస్తలుల విశ్వాస ప్రమాణములో సంక్షిప్తపరచబడి వున్నది. దేవుడు మన రక్షణ కొరకు ప్రతిదీ చేసాడని సువార్త చెప్తూవుంది. విశ్వాస ప్రమాణము అనేది విశ్వాసం యొక్క ప్రకటన, విశ్వాసులు తాము నమ్మిన వాటిని చెప్పటానికి మరియు తప్పుడు బోధకులను గుర్తించడానికి ఆదిమ క్రైస్తవ సంఘముచే ఇవ్వబడింది.

• ఈ లోకములోని బాధల మధ్య విశ్వాసి విశ్వాసంతో దేవునికి మొరపెట్టే మార్గమే ప్రభువు ప్రార్థన అని లూథర్ గారు చెప్పాడు.

• పరిశుద్ధ బాప్తిస్మము మరియు పరిశుద్ధ ప్రభు రాత్రి భోజనం అనెడి సంస్కారములలో ఉన్నటువంటి సువార్త ఈ భాగాలలో మనకు  తెలియజేయబడుతువుంది. 

• బాప్తిస్మము అనేది గత పాపాల నుండి మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి చేసే పని కాదు. దేవుడు మనతో తనను తాను కలుపుకొని మరియు మన మధ్య శాశ్వతమైన సంబంధాన్ని నెలకొల్పి మన జీవితంలోని ప్రతి క్షణం మనం చేసెడి మన పాపములు క్షమింపబడుటకు స్థాపించిన మార్గమే ఇది. 

• పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము అనేది పాస్టర్ గారు దేవునికి సేవగా చేసే పని కాదు కాని దేవుడు మన పాప క్షమాపణ కొరకు తన కుమారుని శరీరం మరియు రక్తం ద్వారా మన కొరకు దేవుడు చేసే పని ఇది.

• క్యాటికిజంకు (ప్రశ్నోత్తరికి) మరో ముఖ్య భాగం జోడించబడింది: తాళపు చెవులు మరియు ఒప్పుకోలు. దేవుడు నా పాపములను క్షమించియున్నాడు అని ఒకడు దేవుని ప్రతినిధుల ద్వారా విన్నప్పుడు విశ్వాసి నిశ్చయతను కలిగి యుండగలడు.

• తరువాత, విధుల పట్టిక మరియు కొన్ని రోజువారీ ప్రార్థనలు వంటి ఇతర అంశాలు జోడించబడ్డాయి. మనం ఎవరైనప్పటికి, సమాజంలో మరియు కుటుంబంలో మన స్థానం ఏదైనప్పటికీ మనం దేవుణ్ణి ఎలా సేవించవచ్చో అవి మనకు చూపెడుతూవున్నాయి.

ఈ రోజు మనం లూథర్స్ స్మాల్ క్యాటికిజంను (ప్రశ్నోతరిని)  ఎలా ఉపయోగిధ్ధాం?

బైబిల్‌లోని అతి ముఖ్యమైన సత్యాలను సరళమైన రీతిలో బోధించడమే క్యాటికిజం (ప్రశ్నోతరి) యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పిల్లలకు బోధించడానికి పాస్టర్లు లేదా తల్లిదండ్రులు దీనిని ఉపయోగించవచ్చు, అట్లే క్రైస్తవ విశ్వాసానికి కొత్తగా చేర్చబడిన పెద్దలకు దీనిని ఉపయోగించవచ్చు. అన్ని వయస్సుల వాళ్ళు ఇందులోని ప్రశ్నలను మరియు జవాబులను కంఠస్థం చెయ్యడం ద్వారా దేవుని వాక్యం మన హృదయంలో మరియు మన నాలుకలపై ఉంటుంది. బైబిల్‌లోని అతి ముఖ్యమైన సత్యాలను సరళమైన రీతిలో బోధించడమే క్యాటికిజం (ప్రశ్నోతరి) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

క్యాటికిజం (ప్రశ్నోతరి) ఒక అద్భుతమైన ప్రార్థన పుస్తకం. క్రైస్తవ విశ్వాసులందరూ క్రమం తప్పకుండా క్యాటికిజం (ప్రశ్నోతరి) చదవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. 10 ఆజ్ఞలు మనం దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేశామో గుర్తు చేస్తూవున్నాయి మరియు పశ్చాత్తాపపడుటకు మనలను ప్రేరేపిస్తూ వున్నాయి. అపొస్తలుల విశ్వాస ప్రమాణములో, మన ప్రేమగల తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించడానికి చేసిన ప్రతి దానిని తెల్పుతూవుంది. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు, విమోచించాడు మరియు పరిశుద్ధ పరచుచువున్నాడు అనే వాటిని గురించి మనం చదివినప్పుడు, ప్రతిరోజూ మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పునట్లు ప్రేరేపింపబడుతూ వున్నాము.

బైబిల్ గురించి ప్రశ్నలు ఉన్న క్రైస్తవులకు క్యాటికిజం (ప్రశ్నోతరి)  ఒక మంచి రిఫరెన్స్ పుస్తకం. ఇది మనకు అత్యంత ప్రాముఖ్యమైన బోధనల గురించి గుర్తు చేస్తూవుంది మరియు మనం లేఖనాల్లో చదివిన వాటిని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తూ ఉండటమే కాకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండే తప్పుడు బోధలను గుర్తించడంలో క్యాటికిజం (ప్రశ్నోతరి) మనకు సహాయపడుతూవుంది.

1. మార్టిన్ లూథర్ ఎవరు?

మార్టిన్ లూథర్ 16వ శతాబ్దంలో జర్మనీలోని చర్చిలో నాయకుడు. అతను చర్చిలో సంస్కరణ అవసరాన్ని గుర్తించాడు మరియు దేవుని వాక్యంపై దృఢంగా నిలిచాడు. అతను చిన్న మరియు పెద్ద క్యాటికిజం (ప్రశ్నోతరి)  రాశాడు.

2. లూథర్ కాలములో సంఘములో సంస్కరణ అవసరం ఎందుకు ఉంది?

ఆ సమయంలో చర్చి మనం ఎలా రక్షించబడ్డామో అనే సత్యాన్ని బోధించలేదు. వారు ధర్మశాస్త్రానికి లోబడాలని మరియు తమ మంచి పనుల ద్వారా తమను తాము నీతిమంతులుగా చూపించుకోవాలని చర్చి ప్రజలకు చెబుతోంది. చాలా మందికి బైబిల్ లేదా అది యేసుక్రీస్తు గురించి ఏమి చెప్తుందో తెలియదు.

3. లూథర్ చిన్న మరియు పెద్ద క్యాటికిజంలను ఏ ఉద్దేశ్యంతో వ్రాసాడు?

మార్టిన్ లూథర్ విశ్వాసులకు బైబిల్ గురించి చాలా తక్కువగా తెలుసు అనే విషయం తెలుసుకొని చాలా నిరాశ చెందాడు. పాస్టర్లు మరియు తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిల్ యొక్క సాధారణ సత్యాలను బోధించగలిగేలా అతను స్మాల్ క్యాటికిజంను వ్రాసాడు. బైబిలును బోధించే వారికి పెద్ద క్యాటికిజం ద్వారా ఇంకా ఎక్కువ బోధలను ఇచ్చాడు.

4. క్యాటికిజంలోని ఆరు ప్రధాన భాగాలు ఏమిటి?

1. పది ఆజ్ఞలు; 2. అపొస్తలుల విశ్వాస ప్రమాణము; 3. ప్రభువు ప్రార్థన; 4. పరిశుద్ధ బాప్తిస్మము; 5. తాళపు చెవులు మరియు ఒప్పుకోలు; 6. పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము.

5. అన్నిటికంటే దేవునికి భయపడడం, ప్రేమించడం మరియు నమ్మియుండటం అంటే ఏమిటి?

ఇతర అధికారాల కంటే మనం ఆయన మాటను ఎక్కువగా గౌరవించాలని; మనం దేనినైనా లేదా మరెవరినైనా కోరుకునే దానికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలని; మనం అతని మాట వినాలి మరియు ఇతరుల కంటే ఆయననే ఎక్కువగా నమ్మాలని అర్ధం.

6. విశ్వాస ప్రమాణం యొక్క ఉదేశ్యం ఏమిటి?

విశ్వాస ప్రమాణం అనేది కేవలం విశ్వాసం యొక్క ప్రకటన. ఇది నేను ఏమి విశ్వసిస్తున్నాను మరియు నేను లేఖనాలను ఎలా అర్థం చేసుకున్నాను అనే దానిని తెలియజేస్తూవుంది. ఇది విశ్వాసులకు వారి విశ్వాసాన్ని చెప్పడానికి మరియు తప్పుడు బోధకులను గుర్తించడానికి సహాయపడుతుంది.

7. అపొస్తలుల విశ్వాస ప్రమాణములో మూడు అంశాలు ఎందుకు ఉన్నాయి?

 (త్రిత్వము) ట్రినిటీలోని ముగ్గురు వ్యక్తులు- తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ, వారికి సంబంధించిన పనిని చక్కగా వివరించుటకు గాను విశ్వాస ప్రమాణములో మూడు అంశములు వున్నాయి.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.