
దెయ్యాలు అంటే ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది?
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ప్రసంగి 12:7ని బట్టి “మన్నయినది వెనుకటి వలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయ చేసిన దేవుని యొద్దకు మరల పోవును” అను మాటలను బట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, శరీరం మరియు ఆత్మ వేరు చేయబడతాయని తెలుస్తుంది. అట్లే హెబ్రీయులు 9:27ని బట్టి “మనుష్యు లొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” అంటే శరీరము నుండి వేరుపడిన ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది వెంటనే దేవుని తీర్పు ఉంటుంది అని తెలుస్తుంది. మరణించిన తరువాత జీవం లేని శరీరం మాత్రమే ఈ భూమిపై ఉంటుంది. లూకా 16:19-31ని బట్టి దేవుని తీర్పు తరువాత ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఉంటుందని అక్కడి నుండి వెనుకకు రాదని అంటే చనిపోయిన వారు తిరిగి ఈ లోకానికి దెయ్యాలుగా రారని అలా వచ్చే ఛాన్స్ లేదని బైబులు చెప్తుంది.
మరి చనిపోయిన వాళ్ళు వెనుకకు వచ్చే ఛాన్స్ లేనప్పుడు కొన్నిసార్లు మనకు బాగా పరిచయమున్న మన పరిసరాలలో అక్కడ ఎవరో ఉన్నట్టు మనలను ఎవరో చూస్తున్నట్లు అనిపించడమే కాకుండా వెంటనే భయం వేస్తుంది రోమాలు పైకిలేస్తాయి, కొందరికి కొన్ని రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి మరణించిన వారి కుటుంబ సభ్యులు కనిపించొచ్చు, ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని. మరికొందరు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏదో వాళ్ళని నొక్కిపెట్టినట్టు, వాళ్ళు లేవాలని ప్రయత్నించినా లేవలేక పోయినట్లు కేకలు వెయ్యడానికి ప్రయత్నించినా వెయ్యలేక పోయినట్లు అనుభవించిన సంఘటనల గురించి చెప్తుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో ఉండొచ్చు, మరి వీటిని ఎలా వివరిధ్ధాం. వ్యక్తులకు ఎదురైయే పారానార్మల్ అనుభవాలను సాతానుకు వాని దూతలకు ఆపాదించవచ్చు.
దయ్యాల గురించి బైబిలు ఏమి చెబుతుంది : బహుశా డెవిల్ మరియు డిమన్స్ (దెయ్యాలు) అనే పదాల మధ్య తేడాను మొదటగా తెసులుకొందాం. డెవిల్ అనే పదం గ్రీకు పదం డయాబోలోస్ (διάβολος) నుండి వచ్చింది. అంటే: “అపవాది,” “నిందితుడు,” లేదా “తప్పుడు నేరం మోపేవాడు” అని అర్ధం. అపవాది దేవునికి మరియు మానవాళికి ప్రధాన శత్రువు, పడిపోయిన దేవదూతల నాయకుడు, మరియు బైబిల్లో సాతాను అని కూడా పిలువబడ్డాడు. మత్తయి 25:41, నరకమనేది మానవులకు శిక్ష విధించే స్థలంగా సృష్టించబడలేదు, కానీ “అపవాదికి వాని దూతల కోసం సిద్ధం చేయబడింది” అని వెల్లడిస్తుంది. సాతాను వాని తిరుగుబాటులో వానితో చేరిన అసంఖ్యాకమైన దూతలను కలిగి ఉన్నాడు. వారు శక్తిలో విభిన్నముగా ఉన్నప్పటికీ, వారందరూ మంచిదైన ప్రతి దానికీ వ్యతిరేకంగా నిలబడతారు.
మంచి దేవదూతల మాదిరిగానే, సాతాను వాడి దూతలు శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవులు. వారు మన మానవ సామర్థ్యాల కంటే ఉన్నతమైన శక్తులను కలిగి ఉన్నారు. సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియలు, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతిరాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు. నశించిపోతున్న వారిని మోసగించే ప్రతి రకమైన చెడును, వారు చేయగలరని లేఖనం వెల్లడిస్తుంది, (2 థెస్సలొనీకయులు 2:9,10). అంత్య దినాలలో అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరని యేసు చెప్పాడు, (మత్తయి 24:24). ఈ నకిలీ అద్భుతాలు చాలా ఆకట్టుకునేవిగా ఉంటాయి, అవి “ఏర్పరచబడిన వారిని సహితము” మోసం చేస్తాయి.
ఫరో ఇంద్రజాలికులు అపవాది నకిలీ అద్భుతాలను చేయగలగడం ఇందుకు ఒక మంచి ఉదాహరణ. యెహోవా తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి మోషేను ఫరో దగ్గరికి పంపినప్పుడు, ఆయన మోషేకు అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. అక్కడ ఫరో ఇంద్రజాలికులు తమ రహస్య కళల ద్వారా ఈ సంకేతాలను నకిలీ చేయగలిగారు. కాని అప్పుడు ఒక అద్భుతమైన విషయం కూడా జరిగింది. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రముల చేత ఆలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మ్రింగివేసెను, నిర్గమకాండము 7:10-12. సాతాను కార్యాలయంలో దేవుని కొన్ని అద్భుతాలను నకిలీ చేయగల కాపీ యంత్రం ఉంది. అయినప్పటికీ దాని లక్షణాలు పరిమితం. ఇది నిజమైన విషయాన్ని చౌకైన ప్రతిరూపంగా మాత్రమే కాపీ చెయ్యగలదు. క్రైస్తవులుగా మన విశ్వాసం ఆకట్టుకునేలా కనిపించే సంకేతాలు అద్భుతాలపై ఆధారపడి ఉండకూడదు. అయితే వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, మత్తయి 16:4.
దయ్యాలు కలిగి ఉన్న మరో శక్తి ఏమిటంటే, మన మనస్సులపై దాడి చేసి, మన ఆలోచనలను ప్రభావితం చేసే అధికారం. అననీయ యొక్క పాపాన్ని పేతురు గద్దిస్తూ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అని అడిగాడు. (అపొస్తలుల కార్యములు 5:3). 2 కొరింథీయులు 4:4లో, అపొస్తలుడైన పౌలు, “క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత (అపవాది) అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాడు” అని చెప్పాడు. పౌలు సాతానును “వాయు మండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి” అని కూడా పిలిచాడు (ఎఫెసీయులు 2:2). దయ్యాల బారిన పడిన వారితో వ్యవహరించే వారిలో సాతాను సామర్ధ్యమైన మనస్సులను చదవటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దయ్యాలు పట్టిన వ్యక్తి ఏమనుకుంటున్నాడో దానికి దయ్యాలు ప్రతిస్పందించటాన్ని మనం చూడొచ్చు. దెయ్యం పట్టిన వ్యక్తి మాటల ద్వారా కాకుండా ఆలోచన ద్వారా దెయ్యంతో సంభాషిస్తాడు. ఇది స్కిజోఫ్రెనిక్ కంటే భిన్నంగా ఉంటుంది, స్కిజోఫ్రెనిక్ లో కొందరికి తమతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. దయ్యాలు పట్టిన వ్యక్తి విషయంలో, ఆ వ్యక్తికి మరియు ఆ వ్యక్తి మనస్సులో జరిగే ఒక వాస్తవ సంభాషణ ఉండొచ్చు.
పడద్రోయబడిన దూతలందరు సాతాను నాయకత్వము క్రింద గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నారని 1 పేతురు 5:8 చెబుతుంది. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు అని యోహాను 8:44 చెబుతుంది. ఈ మాటలకు, సాతాను తన శక్తులను అబద్ధం చెప్పడానికి ఉపయోగిస్తాడని మనుష్యులను నిజదేవుని నుండి దూరపరచడానికి వారి నిత్యజీవాన్ని దోచుకోవడానికి వారిని నాశనము చెయ్యడానికి ప్రయత్నిస్తాడని అర్ధం. గనుకనే మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము అని ఎఫెసీయులకు 6:12లో పౌలు చెప్పాడు. మనకు హాని కలిగించటానికి ప్రయత్నించే ఈ దురాత్మల సమూహములతో అందరూ ఇక్కడ పోరాడుతూ ఉన్నారని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టే మనుష్యులకు ఎదురైయే పారానార్మల్ అనుభవాలను సాతానుకు వాని దూతలకు బైబులు ఆపాదిస్తుంది.
బైబిల్ ప్రకారం, దయ్యాలు ప్రజలను మోసగిస్తూ శోధిస్తూ హాని చేస్తూ వారిని ఆధ్యాత్మికంగా శారీరకంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. దేవుని సత్యం నుండి, యేసుక్రీస్తు సువార్త నుండి, ఆధ్యాత్మికమైన జీవితం నుండి ప్రజలను దూరం చేయడమే వాటి లక్ష్యం.
దయ్యాల కార్యకలాపాలు :
1. ప్రజలను మోసగించడం మరియు తప్పుడు బోధన (“దయ్యముల బోధ“) : దయ్యాలు అబద్ధాలు మరియు మోసాల ద్వారా ప్రజలను సత్యం నుండి దూరం చేస్తాయి. 1 తిమోతి 4:1 – అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వారు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు (ఆదికాండము 3:1–5) మరియు తప్పుడు సిద్ధాంతాలను, ఆరాధనలను లేదా వక్రీకరించబడిన వేదాంతశాస్త్రాన్ని ప్రోత్సహిస్తారు.
ఉదాహరణలు:
తప్పుడు మతాలను ప్రోత్సహించడం, విగ్రహారాధనను ప్రోత్సహించడం (1 కొరింథీయులు 10:20).
దేవుడు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అనే బోధ లేదా బైబులు చెప్పని వాటిని ప్రోత్సహించడం. Prosperity theology and Legalism.
క్రీస్తు యొక్క సంపూర్ణతను తక్కువ చేసి చెప్పడం (Undermining the sufficiency of Christ).
2. పాపం చేయాలనే శోధన/ మనుష్యులను పాపం చేయమని ప్రలోభపెట్టటం : దయ్యాలు తరచుగా వ్యక్తులను దేవునికి అవిధేయత చూపేలా శోధిస్తాయి. (లూకా 22:3 – సాతాను యూదాలోకి ప్రవేశించాడు).
ఎఫెసీయులు 6:11–12 – మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నామని పౌలు చెప్పాడు. యాకోబు 3:15 – ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.
సాధారణ లక్ష్యాలు:
గర్వం
లైంగిక అనైతికత
కోపం, భయం, అసూయ
వ్యసనాలు
3. అణచివేత మరియు బాధ : దయ్యాలు వ్యక్తులను, ముఖ్యంగా విశ్వాసులను, భయం, అపరాధం, గందరగోళం లేదా భావోద్వేగ హింస ద్వారా అణచివేయడానికి ప్రయత్నిస్తాయి. 2 కొరింథీయులు 12:7 – పౌలు “శరీరంలో ముల్లు, సాతాను దూత” అని సూచించాడు.
విశ్వాసులను స్వాధీనంలో ఉంచుకోడు కానీ వారిని నిరుత్సాహపరచడానికి బయటి నుండి ఒత్తిడి పెడతాడు, నిందలు మరియు భారం వేయడం ద్వారా కృంగిపోయేటట్లు చేస్తాడు.
4. అవిశ్వాసులను స్వాధీనం లేదా నియంత్రణలో ఉంచుకొంటాయి : (మార్కు 5:1–20 – లిజియన్). కొన్ని బైబిల్ వృత్తాంతాలలో, దయ్యాలు వ్యక్తులను స్వాధీనములో ఉంచుకొన్నాయి/ వారిని ఆవహించాయి – వారి ప్రవర్తన, మనస్సు లేదా శరీరాన్ని నియంత్రించాయి.
మార్కు 5:1–20, గెరాసేన్ దయ్యాలు పట్టిన వ్యక్తిలో దయ్యాల “సేన” ఉంది. లూకా 9:42 – ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడించెను.
విశ్వాసులు దయ్యాల బారిన పడలేరు, ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తుంది (1 కొరింథీయులు 6:19). కానీ అవిశ్వాసులు దయ్యాల బారిన పడతారు వాటి లోతైన ప్రభావానికి గురవుతారు.
5. వెలుగుగా వేషం వేయడం : దయ్యాలు మోసగించడానికి మంచిగా అనిపించే విధంగా కనిపించొచ్చు లేదా ప్రవర్తించొచ్చు. 2 కొరింథీయులు 11:14 – “సాతాను స్వయంగా వెలుగు దూతగా వేషం వేస్తాడు.”
వారు ఆధ్యాత్మికంగా ధ్వనించే భాషను ఉపయోగించొచ్చు లేదా తప్పుదారి పట్టించడానికి ఆధ్యాత్మిక అనుభవాలను ప్రచారం చెయ్యొచ్చు.
6. ప్రభుత్వాలు మరియు దేశాలను ప్రభావితం చేయడం
బైబిల్ వృత్తాంతాలు దయ్యాల శక్తులు పాలకులను లేదా ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని సూచిస్తున్నాయి.
దానియేలు 10:13 – దేవుని దూతను వ్యతిరేకించే ఆధ్యాత్మిక జీవి అయిన “పారసీకుల రాజ్యాధిపతిని” సూచిస్తుంది. ప్రకటన 16:14 – అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్తాయి.
7. క్షుద్ర విద్య మరియు మంత్రవిద్యల ప్రచారం
దేవుని వెలుపల శక్తి, జ్ఞానం లేదా నియంత్రణను కోరుకునే క్షుద్ర అభ్యాసాల వెనుక దయ్యాలు ఉన్నాయి.
లేఖనంలో నిషేధించబడింది:
మంత్రవిద్య (గలతీయులు 5:20)
సోదే చెప్పడం (అపొస్తలుల కార్యములు 16:16–18)
మంత్రవిద్య, మంత్రాలు, శకునాలు (ద్వితీయోపదేశకాండము 18:10–12)
8. అనారోగ్యం లేదా గాయాలు కలిగిస్తాయి (లూకా 13:11 – బలహీనపరచు దయ్యము చేత నడుము వంగిపోయిన స్త్రీ)
అపవాదికి మన గురించి, మన ఆలోచనల గురించి చాలా తెలిసి ఉండొచ్చు. కాని వాడికి అన్నీ తెలియవు. దేవునిలా వాడు సర్వాంతర్యామి కాదు. ఆధ్యాత్మిక జీవిగా, సాతాను ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం అవుతాడు. కాని వాడి అనేక దయ్యాల ద్వారా వాడు ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో ఉండి, మన జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతూ, పాపం చేయడానికి మనల్ని ప్రలోభపెట్టగలడు.
సాతాను శక్తి దేవుని శక్తి కంటే తక్కువ, అయినప్పటికీ అది మన మానవ సామర్థ్యాల కంటే గొప్పది. ఆదాము హవ్వలను మోసగించడంలో సాతాను యొక్క ఉన్నతమైన నైపుణ్యాలను చూడొచ్చు. దేవుని మంచితనాన్ని అనుమానించడానికి హవ్వను నడిపించడంలో ఆమెకు ఏమి చెప్పాలో వాడికి ఖచ్చితంగా తెలుసు (ఆదికాండము 3:1-7). సాతాను మనలను మోసగించగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాడని పౌలు హెచ్చరించాడు (2 కొరింథీయులు 2:11). వాడు వెలుగు దూతగా కనిపించగలడు (2 కొరింథీయులు 11:14).
మనుష్యులలో ఉన్న జెనెటిక్స్, బ్రెయిన్ కెమిస్ట్రీ, ట్రామా, స్ట్రెస్ అనే వాటి ద్వారా ఒక వ్యక్తియొక్క ఆలోచనలు మరియు భావాలను సాతాను వాని దూతలు నియంత్రిస్తూ మనుష్యులను పారానార్మల్ అనుభవాల ద్వారా అబద్దాలను నమ్మేటట్లు చేస్తూ ఒకని నిత్యత్వపు స్థితిని (స్వర్గమా నరకమా) నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నాయి. నయానో భయానో వీటి తంత్రాలకు లోబడిన ప్రజలు దేవుని కృపను తృణీకరిస్తూ తమ స్వార్ధ ప్రయోజనాల నిమిత్తము తమ్మును తాము సంతృప్తి పరచుకొనే క్రమములో వీటిని నమ్ముతూ విభజింపబడ్డాం.
మనకు దాని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా, సాతాను మన శత్రువు. వాడు దేవుణ్ణి మరియు దేవుని బిడ్డలను వ్యతిరేకిస్తున్నాడు. ఈ భూమ్మీద ఉన్న ప్రతి చెడు వెనుక వాడున్నాడు. ఆరాధించబడాలని వాడు తహతహలాడుతున్నాడు, పూజింపబడాలనే వాడి దురాశే దీనంతటికి కారణం. వాడు దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అలాగే తన సమయం పరిమితం అనే సంగతి వాడికీ తెలుసు.
కాని సాతాను ఒక ఓడిపోయిన శత్రువు. ఆదికాండము 3:15లో దేవుడు చేసిన వాగ్దానము ప్రకారం యేసు తన విమోచన కార్యము ద్వారా, సాతానుని తలను నలుగగొట్టాడు. వానికి పరిధి నిర్ణయింపబడింది. వానికి వాని దూతలకు శిక్షావిధి సమీపించింది. ప్రకటన 20:7-10 ప్రకారము ప్రజలను మోసపరచిన అపవాది వాని దూతలు వాడి తంత్రములో చిక్కుబడి వానిని నమ్మి వానిని వెంబడించిన వాళ్ళు అగ్ని గంధకములు గల గుండములో చివరకు పడవేయబడతారని వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడతారని బైబులు చెబుతుంది.
కాబట్టే ఎఫెసీయులకు 6:16 ఆ క్షణం వరకు మనం సాతానుకు వ్యతిరేకంగా ఆయుధధారులమై పోరాడవలసి యున్నామని చెబుతుంది. సాతాను వాని దూతలతో పోరాటమా అని భయపడకండి, యేసుని శక్తి, వాగ్ధానాలను బట్టి మనమందరం అపవాదిపై పైచెయ్యిని కలిగియున్నామని యాకోబు 4:7లో బైబులు చెబుతుంది.
దయ్యాల కార్యకలాపాలు నిజమే, కానీ క్రీస్తు ఇప్పటికే సాతానును ఓడించాడు (కొలొస్సయులు 2:15). విశ్వాసులు దయ్యాలకు భయపడకూడదు, కానీ యేసుకు పరలోకంలో మరియు భూమిపై అన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకుని విశ్వాసంలో స్థిరంగా ఉండాలి (మత్తయి 28:18). ఆయన మరణం మరియు పునరుత్థానం ద్వారా, మనం విముక్తి పొందాము.
ఈ సమాచారంతో ఇప్పుడు మీరు మీ స్వంత ప్రశ్నలను మరియు ఇతరుల ప్రశ్నలను పరిష్కరించగలరని నేను ఆశిస్తున్నాను.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl