దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు?
ఆదికాండము 6:1-2 వచనాలను చదువుకొందాం: నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి అను మాటలలో పేర్కొనబడిన “దేవుని కుమారులు” అంటే ఎవరు?
“దేవుని కుమారులు” ఎవరు అనే విషయంపై పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
- కొందరి అభిప్రాయం ప్రకారం, వారు పడిపోయిన దేవదూతలు.
- మరికొందరు, వారు శక్తివంతమైన మానవ పాలకులు అని అంటారు.
- ఇంకొందరు, వారు దైవభక్తిగల షేతు సంతతికి చెందినవారని భావిస్తారు.
- మరికొందరు, ప్రాచీన మతపురాణాలలో దేవతలు మానవ స్త్రీలతో సంబంధం కలిగిన కథలను ఆధారంగా తీసుకొని, ఈ మాటలను పురాణ కథనాలుగా పరిగణిస్తారు.
అందువల్ల, “దేవుని కుమారులు” అనే పదానికి సంబంధించి వివిధ వివరణలు ఉన్నాయి.
పడిపోయిన దేవదూతల అభిప్రాయాన్ని సమర్థించేవారు యోబు 1:6, యోబు 38:7, కీర్తన 29:1 వంటి వచనాలలో “దేవుని కుమారులు” అనే పదం దేవదూతలను సూచించడానికి ఉపయోగించబడిందని చెబుతారు. అందువల్ల ఆదికాండము 6లో కూడా అదే అర్థం ఉండవచ్చని వారు భావిస్తారు. అలాగే మత్తయి 22:30లో యేసు “పరలోకమందున్న దూతలు వివాహం చేసుకోరు” అని చెప్పినప్పుడు, అది పరలోకంలోని దేవదూతల గురించి మాత్రమేనని, పడిపోయిన దూతల గురించి కాదని వారు వాదిస్తారు.
ఈ దృష్టికోణం ప్రకారం, భూమికి పడద్రోయబడిన సాతాను మరియు అతని దూతలు దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని లెక్కచేయకుండా నరుల కుమార్తెలలో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఉండవచ్చని భావిస్తారు. బైబిలులో పడిపోయిన దూతలు మానవ స్త్రీలను వివాహం చేసుకోవడం గురించి స్పష్టమైన నిషేధం లేదని కూడా వారు తర్కిస్తారు. అంతేకాక, ఈ అసహజమైన సంబంధాల వల్ల భూమిపై తీవ్రమైన దుష్టత్వం పెరిగి, దాని ఫలితంగా మహా జలప్రళయం సంభవించిందని ఈ అభిప్రాయాన్ని సమర్థించేవారు చెబుతారు.
పడిపోయిన దేవదూతలే “దేవుని కుమారులు” అని భావించినప్పుడు ఒక సమస్య వస్తుంది. బైబిలులో దేవదూతలకు లింగం ఉందని గాని, వారు సంతానం పొందగలరని గాని స్పష్టమైన ఆధారం లేదు. ఆదికాండము 6:2లో “దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు” అని చెప్పబడిన మాటలను, నేను పడిపోయిన దేవదూతలు మానవ స్త్రీలతో లైంగిక సంబంధం కలిగినట్లుగా అర్థం చేసుకోను. ఈ అభిప్రాయాన్ని ఎందుకు నమ్మనో వివరిస్తాను.
ఈ క్లిష్టమైన భాగాన్ని అర్థం చేసుకోవడానికి “దేవుని కుమారులు” అనే పదాన్ని సందర్భానుసారంగా చూడాలి. ఈ పదం కొన్ని చోట్ల దేవదూతలను సూచించినప్పటికీ, మత్తయి 5:9లో “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు” అని చెప్పబడింది. ఇక్కడ “దేవుని కుమారులు” అనే భావం జీవసంబంధమైన పుత్రత్వాన్ని కాకుండా, దేవునితో ఉన్న విధేయత మరియు సంబంధాన్ని సూచిస్తుంది. అందువల్ల, ఆదికాండము 6వ అధ్యాయంలోని “దేవుని కుమారులు” అనే పదాన్ని విశ్వాసులైన దేవుని ప్రజలు, ముఖ్యంగా దైవభక్తిగల షేతు సంతతివారిగా అర్థం చేసుకోవచ్చు. “నరుల కుమార్తెలు” అంటే అవిశ్వాసులైన కయీను సంతతికి చెందిన స్త్రీలు అని భావిస్తే, ఈ భాగం విశ్వాసులు మరియు అవిశ్వాసుల మధ్య జరిగిన వివాహాలను సూచిస్తుందని బైబిల్ సందర్భం సమర్థిస్తుంది.
ఆదికాండము 3 తరువాత ఆదాము సంతానం ప్రధానంగా రెండు కుటుంబ వంశాలుగా కనిపిస్తుంది: కయీను వంశం మరియు షేతు వంశం. ఆదికాండము 4వ అధ్యాయం కయీను వంశంలోని చెడుతనాన్ని చూపిస్తే, ఆదికాండము 5వ అధ్యాయం షేతు వంశంలోని దైవభక్తిని చూపిస్తుంది.
షేతు వంశంలో హనోకు మరియు నోవహు వంటి దేవునితో నడిచిన వ్యక్తులు ఉన్నారు. దీనివల్ల షేతు వంశం దేవునికి విధేయత చూపిన వంశంగా, కయీను వంశం దేవునికి దూరమైన వంశంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆదికాండము 6లో ఈ రెండు వంశాల మధ్య జరిగిన వివాహాలను సూచిస్తున్నట్లు భావించడం సహజంగా ఉంటుంది.
బైబిలులో దైవభక్తిగల షేతు సంతానము, దైవభక్తిలేని కయీను సంతానముతో వివాహం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పబడలేదు. అందువల్ల అనేక మంది హీబ్రూ పండితులు ఆదికాండము 6:1-2 వచనాలు దేవదూతలు మరియు మానవ స్త్రీల మధ్య వివాహాలను కాకుండా, షేతు మరియు కయీను వంశాల మధ్య జరిగిన వివాహాలను సూచిస్తాయని భావిస్తారు.
ఈ రెండు వంశావళులు కలిసినప్పుడు, అకస్మాత్తుగా, ప్రతి ఒక్కరూ చెడులో చిక్కుకున్నారు. కాబట్టే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఆదికాండము 6:5,6 వచనాలు తెలియజేస్తున్నాయి. బైబులు ఇంత స్పష్టముగా ఉంటే దేవుని కుమారులంటే పడిపోయిన దేవదూతలే అని అభిప్రాయపడడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి.
“దేవుని కుమారులు” మరియు “నరుల కుమార్తెలు” అనే పదాలు పడిపోయిన దేవదూతలు మరియు భూలోక జీవుల మధ్య ఏర్పడిన లైంగిక సంబంధమును గురించి చెప్తున్నాయి అని ఊహించి చెప్పడానికి లేఖనాలు మనలను అనుమతించవు. ఇలాంటి కష్టమైన వచనాన్ని అర్ధం చేసుకొనేటప్పుడు లేఖనము యొక్క విస్తృత పరిధిలో భాష ఎలా వాడబడిందో మనం మొదటిగా అర్ధం చేసుకోవలసి ఉన్నాం. లేఖనాల ద్వారా లేఖనాలు వివరించబడాలనే ప్రాముఖ్యమైన సూత్రాన్ని మరచిపోకండి.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
