పరిశుద్ధ గురువారం బి సిరీస్
పాత నిబంధన పాఠము: నిర్గమ 12:1-14; పత్రిక పాఠము: 1 కొరింథీ 10:16-17; సువార్త పాఠము: మార్కు 14:12-26; కీర్తన 115.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: నిర్గమ 12:1-14
నిర్గమ 12:1-14, 1మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను 2– నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. 3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు వారు తమతమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. 5ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండియైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. 7ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమతమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 8ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను 9దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను; 10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. 11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి. 12ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. 13మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. 14కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను.
చాలా మంది, ముఖ్యమైన సంఘటనలను సెలెబ్రేట్ చేసుకోడానికి ప్రత్యేక రోజులను కలిగి ఉంటారు. లేవీయకాండము 23లో దేవుడు ఇశ్రాయేలీయులు ఉత్సహించడానికి వారికి కొన్ని ప్రత్యేకమైన రోజులను ఇచ్చాడు. ఈ ప్రత్యేక రోజులు బహుళ ప్రయోజనాలను నెరవేరుస్తాయి. ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు చేసిన గొప్ప విషయాలను వాటి నెరవేర్పును అవి మనకు గుర్తు చేస్తాయి.
నిర్గమకాండము 12, పస్కా మరియు పులియని రొట్టెల పండుగ గురించి చెప్తూ ఉంది. ఈ రెండు పండుగలు యూదు ప్రజలకు చాలా అర్థవంతమైనవి. అవి మన చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే గొప్ప సంఘటనలలో ఒకటైన ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విముక్తిని గుర్తు చేసుకోవడానికి సహాయపడుతూ ఉన్నాయి. అవి యూదులకు, క్రైస్తవులకు కూడా చాలా అర్థవంతమైనవి, ఎందుకంటే అవి మన పాపరహితమైన పునరుత్థానమైన పస్కా గొర్రెపిల్ల అయిన మెస్సీయ ద్వారా వచ్చే గొప్ప విమోచన గురించిన ప్రవచనాలు. పస్కా మరియు పులియని రొట్టెల పండుగల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ చాల ప్రాముఖ్యమైంది ఏమిటంటే, పదవ తెగులు నుండి ఇశ్రాయేలీయులు తప్పించుకోవడం యాదృచ్ఛికం కాదు. స్వేచ్ఛ ఎర్ర సముద్రం అవతల ఉన్నప్పుడు ఈజిప్టులో ఎవరు ఉండాలనుకొంటారు?
ఆదికాండము 9:14-15లో ఇంద్రధనస్సును ఒక గుర్తుగా దేవుడు ఇస్తూ, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్య నున్న నా నిబంధనను (గుర్తును) జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు అని చెప్పాడు. ఇది, నోవహు అతని వారసులందరితో ఇప్పటికి దేవుడు చేసిన శాశ్వత నిబంధనను గుర్తుచేస్తూ దేవుడు వారిని మర్చిపోలేదని తెలియజేస్తూ ఉంది. ఇప్పటికి ఆ ఇంద్రధనస్సును చూసేది దేవుడు మాత్రమే కాదు, మనం కూడా చూస్తాము. దేవుడు మనల్ని ఎప్పటికీ తన శాశ్వత నిబంధనను మరచిపోడని అది మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ, మన పాఠములో, గొర్రెపిల్ల రక్తాన్ని (నిర్గమకాండము 12:7) గుర్తుగా వారి ఇంటి ద్వారబంధము మీద పూయమని అది ఇశ్రాయేలీయులకు ఒక గుర్తుగా పనిచేస్తుందని ఆయన రక్తాన్ని చూసి ప్రతి ఇశ్రాయేలీయుల ఇంటిని దాటి వెళ్తాడని చెప్పాడు.
పస్కా పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి?
1. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు నాశనం నుండి రక్షించబడింది.
2. ఇది ఇశ్రాయేలును దేవుని ప్రజలుగా ప్రత్యేకపరుస్తూ ఉంది.
3. ఆ ప్రత్యేకతకై వారు నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోవలసియున్నారు.
4. ఆ గొర్రెపిల్ల రక్తం వారిని రక్షించుటకై బలిగా వధించబడాలి.
5. సిద్దపడి పస్కాను పుచ్చుకోవలసియున్నారు.
6. తీర్పును ప్రకటించడానికి యెహోవాయే స్వయంగా వస్తున్నాడు.
1
1మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను 2– నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. పస్కా పండుగ వారి నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచించేదిగా ఒక గొప్ప స్మారకానికి గుర్తుగా ఒక పెద్ద పండుగగా ఉత్సహించేదిగా ఉండాలని యెహోవా కోరుకున్నాడు, దాని ద్వారా వారి క్యాలెండర్‌ను యెహోవా నిర్ధేశించాడు. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు, కొందరు శరదృతువు ప్రారంభాన్ని నూతన సంవత్సరంగా మరికొందరు వసంత ఋతువు ప్రారంభాన్ని నూతన సంవత్సరంగా కలిగి ఉన్నారు. ప్రతి దేశం వారు తమ క్రొత్త సంవత్సరాన్ని ఎలా ఏర్పర్చుకొన్నారో అనే దానికి వారి స్వంత కారణాలు అనేకం ఉన్నాయి. వారిలో చాలా మంది వ్యవసాయ చక్రాలకు అనుగుణంగా మరియు వారి మతపరంగా వాటితో అనుసంధానించబడి ఉన్నారు. ఆయన ప్రజలు వారి చుట్టూ ఉన్న దేశాలను అనుకరించాలని యెహోవా కోరుకోవడం లేదు. కాబట్టి, పస్కా అనే సువార్త సంఘటన ద్వారా ఇశ్రాయేలు వారి క్యాలెండర్‌ను ప్రభువు గుర్తించమని యెహోవా కోరుతున్నాడు. ప్రభువు సమయం గురించి శ్రద్ధ వహిస్తాడు. సత్యమే ఆయన ప్రజల కాల నిర్వహణను రూపొందించాలనేది యెహోవా ఉద్దేశ్యము.
సమయం ప్రభువు యొక్క పరికరం, సమయం సృష్టిలో సృష్టి కోసం నిర్వహించాల్సినది. ప్రభువు సమయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, రోజువారీ పని, రోజువారీ/వారం/నెలవారీ/సంవత్సరం వారీ సబ్బాత్, రోజువారీ ప్రార్థన, మరియు రోజులు, వారాలు మరియు సంవత్సరాలను తెలియజేసే అనేక ఇతర మంచి చర్యలు మరియు వేడుకలతో తన ప్రజలను నింపాలని ఉద్దేశించాడు. ఈ మంచి విషయాలు ప్రభువు ఎవరో జరుపుకోవడానికి మరియు ఆయనను ఆయన మహిమను ప్రదర్శించడానికి మరియు వారికి సంపూర్ణ ఇంద్రియ ఆనందం ఇవ్వడానికి ఉద్దేశించబడినవి.
ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా వేరుచేసే పనిని కొనసాగించడానికి దేవుడు ఈ పస్కా పండుగను స్థాపించాడు. దేవుడు తన ప్రవక్త హోషేయ ద్వారా ఇలా ప్రకటించాడు, “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని” (హోషేయ 11:1). దేవుడు ఇప్పుడు తన ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించడం ద్వారా వారిని వేరు చేయబోతున్నాడు. ఆయన వారిని తన పిల్లలుగా దత్తత తీసుకుంటున్నాడు.
పస్కా భోజనం సిద్ధం చేయడానికి దేవుడు ఇచ్చిన ఆదేశాలను మనం పరిశీలిస్తే, మొత్తం ఆచారం మన పస్కా గొర్రెపిల్ల అయిన క్రీస్తు వైపు ఎలా చూపుతుందో మనం దశలవారీగా చూస్తాము:
2
3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు (ఈ నెల పదవ రోజున) వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. 5ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండియైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
వారు నాలుగు రోజుల ముందే పస్కాను సిద్ధం చేయడం ఆరంభించాలని ఆజ్ఞ్యాపింపబడ్డారు. లేకపోతే 15,00,000 మందికి ఈజిప్టులో చాలా గొర్రె పిల్లలను సిద్ధం చేయడం కష్టంగా ఉండేది, పస్కా తర్వాత ముఖ్యంగా వారు వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది.
పస్కా గొర్రెపిల్ల గొర్రెలు లేదా మేకల నుండి ఎంపిక చేయబడిన ఒక సంవత్సరం వయస్సు గల మగది.
మొదట దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలును అందించాడు. ఆ విధంగా అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు స్థానంలో దానిని అర్పించాడు. తరువాత దేవుడు ఇక్కడ మొదటి పస్కా పండుగలో ఒక వ్యక్తికి బదులుగా కాకుండా, ఒక కుటుంబానికి లేదా కుటుంబాల సమూహానికి ప్రత్యామ్నాయంగా ఒక గొర్రెపిల్లను అందించాడు. ఒడంబడిక సమాజంలోని ప్రతి కుటుంబం దేవునికి తన సొంత గొర్రెపిల్లను అర్పించినప్పుడు, దేవుడు మొత్తం దేశం కోసం ఒకే బలిని అందించాడు. ప్రాయశ్చిత్త దినాన, ఒకే జంతువు ఇశ్రాయేలు ప్రజలందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసింది. చివరికి బాప్తిస్మమిచ్చు యోహాను “యేసు తన వైపుకు రావడం చూసి, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పిన రోజు వచ్చింది (యోహాను 1:29; యోహాను 11:50–52). దేవుడు తన కృపలో సమస్త లోకము కొరకు ఆయన ఒక గొర్రెపిల్లను అందించాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల, (ప్రక. 13:8) 1 కొరింథీయులకు 5:7, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
ప్రతి కుటుంబం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి, వారి కుటుంబం చిన్నగా ఉండి, వారు గొర్రె పిల్లను పూర్తిగా తినలేకపోతే, వారు సమీప పొరుగువారితో భాగస్వామిగా ఉండాలి, తద్వారా వారికి ప్రాయశ్చిత్తం చేసిన మొత్తం గొర్రె పిల్లను పూర్తిగా తినవచ్చు. ఇది ముఖ్యమైనది ఎందుకంటే ప్రభువు విమోచన కార్యం కొద్దిమందికి మాత్రమే ఒంటరి అనుభవంగా ఉండకూడదు.
పస్కా పండుగను యెహోవాను అనుసరించే అన్ని కుటుంబాలు ఆచరించాలి మరియు అనుభవించాలి, ఎందుకంటే వారు కలిసి ప్రభువును అనుసరించి వాగ్దాన దేశమునకు వెళ్తున్నారు. కాబట్టే గొర్రెపిల్ల యొక్క పూర్తి వినియోగం వారు ఇతర కుటుంబాలకు పంచుకోవడానికి వెళ్ళాలని ఆదేశించింది. వారు బలి మొత్తాన్ని తినేలా చూసుకోవడం ద్వారా వారి భాగస్వామ్యం నిర్దేశించబడింది. ప్రభువు రాజ్యాన్ని ఒంటరిగా కాకుండా సహవాసంలో అనుభవించాలి, ఐక్యతతో నడవాలని కోరుతుంది.
జాగ్రత్తగా పరిశీలించి నిర్దోషమైన దానిని నాలుగు రోజుల ముందుగా వాళ్ళు తమ ఇళ్లలోకి తీసుకురావాలి. నాలుగు రోజులు జాగ్రత్తగా దానిని చూసుకోవాలి. ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిపూర్ణతను కోరుతున్నాడు కాబట్టి గొర్రెపిల్ల పరిపూర్ణంగా ఉందని నిర్ధారించుకోవాలి పరిపూర్ణత లేని దానిని వారు అర్పించకూడదు. గొర్రెపిల్లను వధించడం వారికి చాలా ఖరీదైన విషయం.
ఇస్సాకుకు ప్రత్యామ్నాయ బలి మరియు ఐగుప్తులో విశ్వాసంతో వ్యవహరించిన వారికి ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం మరియు ఆ ప్రాయశ్చిత్త బలులు సూచించే ప్రభువైన యేసు మధ్య స్పష్టమైన సంబంధాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను చూపిస్తూ, ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల అని అన్నాడు. ఆయనలో ఎటువంటి కళంకం లేదు.
ఈ పస్కా గొర్రెపిల్ల “నిర్దోషమైనదిగా” ఉండాలని దేవుడు నిర్దేశించాడు. —పేతురు ఆసియా మైనర్‌లోని చెల్లాచెదురుగా ఉన్న క్రైస్తవులకు వ్రాస్తూ, “అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా అని రాశాడు (1 పేతురు 1:19).
పస్కా గొర్రెపిల్ల భవిష్యత్తులో జగబోయే దానిని గూర్చి తెలియజేస్తూ ఉంది, సిద్ధం చేస్తుంది మరియు ప్రతిబింబిస్తుంది. దాని ఫలితాలు యేసు నుండి ఆయన కార్యము నుండి వస్తాయి. యోహాను 6:53, యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు అని చెప్తూవుంది. యేసు శిష్యులతో కలిసి పస్కా భోజనంలో రొట్టెను మరియు విమోచన పాత్రను తీసుకొని, ఆ సంవత్సరాలన్నింటికీ ఈ భోజనం ఆయన కోసం వారిని ఎలా సిద్ధం చేస్తుందో చూపిస్తూ దీనిని ఎత్తి చూపాడు. 1 కొరింథీయులకు 5:7, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.
3
7ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 8ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను 9దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను; 10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.
వారు రక్షింపబడుటకుగాను గొఱ్ఱెపిల్ల వధింపబడవలసి ఉంది. దాని రక్తం సంహార దూతను వారి నుండి దాటిపోయేలా చేస్తుంది. వారికి జీవము ఇవ్వడానికి మరొకరి జీవము వారికొరకు ఇవ్వబడుతుంది. హెబ్రీ 9:22, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. లేవీయకాండము 17:11, రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
హెబ్రీయులకు 9:11-14, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును. యెహోవా తీర్పునుండి దాటడానికి వారికి సహాయపడుతూ ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తం ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది.
పస్కా గొర్రెపిల్లను బలిగా వధించాలి. —“క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను” (ఎఫెసీయులు 5:2) అని పౌలు తన తోటి విశ్వాసులకు గుర్తు చేశాడు. హెబ్రీయుల పుస్తక రచయిత క్రీస్తును “అర్పణ” మరియు “బలి” అని పదేపదే పేర్కొన్నాడు.
4
11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి. ప్రభువు వారికి ప్రాయశ్చిత్తం మాత్రమే కాకుండా భూమిపై ఉన్న కుటుంబాలు ప్రభువును తెలుసుకునేలా చూసే ప్రపంచవ్యాప్త మిషన్‌లో వారు తనతో చేరగలిగేలా ప్రభువు వారిని తన ప్రజలుగా చేస్తున్నాడు. వారి రక్షణ కేవలం విశ్రాంతి తీసుకోవడానికి కాదు. వారి రక్షణ వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్లి మిషన్‌లోకి రావడానికి సిద్ధంగా ఉండటానికి మరియు సమీకరించబడటానికి పునాదిగా ఉండటం.
5
12ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.
ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతల కందరికిని తీర్పు తీర్చడానికి యెహోవా స్వయంగా ఐగుప్తు దేశము గుండా సంచరించబోవు చున్నాడు.
6
13మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
ఇశ్రాయేలీయులు “కొంచెం రక్తం తీసుకొని ఇళ్ల ద్వారబంధాల ప్రక్కల మరియు పైభాగాలపై పూయాలి.” పస్కా పండుగ రాత్రి, ఆయన ఐగుప్తు గుండా వెళ్లి ప్రతి తొలి సంతానాన్ని కొట్టినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా వాగ్దానం చేశాడు, “నేను రక్తాన్ని చూసినప్పుడు, నేను మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఐగుప్తును కొట్టినప్పుడు ఏ వినాశకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.” మరో మాటలో చెప్పాలంటే, పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలు నాశనం నుండి రక్షించబడింది.—ఇది, లేఖనం యొక్క కేంద్ర బోధనను సూచిస్తుంది, మనం పాపం, మరణం మరియు సాతాను శక్తి నుండి “క్రీస్తు యొక్క విలువైన రక్తంతో, మచ్చ లేదా లోపం లేని గొర్రెపిల్ల” నుండి విముక్తి పొందాము.
ఈ గొప్ప తీర్పులో విశ్వాసముతో ఈ రక్తమును వర్తింప చేసుకొనిన వారికి ఈ రక్తం ఒక గొప్ప గుర్తుగా ఉంటూ వారు ఆ తీర్పునుండి దాటడానికి వారికి సహాయపడుతుంది. ప్రభువు కోరినది చేయడం విశ్వాసం. ఆయన మాటలను లక్ష్యపెట్టడం విశ్వాసం. విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే ఆయన మాటలను బట్టి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు రక్షింపబడతారు. ఆ గొర్రెపిల్ల రక్తమే వారికి రక్షణ. వారు రక్తమును నమ్ముకున్నారు. ద్వారబంధమున రక్తమును పూయడం విశ్వాస క్రియ. మరణం నుండి విముక్తి పొందాలంటే, వారు దేవుని మాటను నమ్మాలి.
విశ్వాసం ద్వారా ప్రతి కుటుంబం పరిపూర్ణమైన గొర్రెపిల్లను ఎంచుకుంది, విశ్వాసం ద్వారా వారు దాని ప్రాణాన్ని తీసుకొని చేదు కూరలతో కాల్చారు, విశ్వాసం ద్వారా వారు దాని రక్తాన్ని తలుపు మీద చల్లారు. రక్తం వారి విశ్వాసానికి బహిరంగ ఒప్పుకోలు, బలి అర్పించబడిన గొర్రెపిల్ల యొక్క ప్రాయశ్చిత్త ప్రభావాన్ని వారు విశ్వసించారని అది సూచిస్తుంది. కాబట్టి వారు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడ్డారు.
ముగింపు: యేసు పస్కా పండుగ నెరవేర్పు అని తెలుసుకుని నమ్మండి, ఆయనే లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల. మనిషి చేసే ఏ ప్రయత్నంలోనూ రక్షణ లేదు. మీరు రక్షింపబడవలసిన అవసరం లేదని అనుకొంటే, మీరు దేవుని తీర్పుగుండా వెళ్లాలనే విషయాన్ని తెలుసుకోండి. ప్రభువే స్వయముగా రక్షణను అందిస్తున్నాడు, కానీ ఆ ఆఫర్ ఒకరోజు రద్దు చేయబడుతుంది. చివరకు విమోచన సమయం వచ్చింది! పస్కా పండుగ రాత్రి దేవుడు ఐగుప్తులోని మొదటి సంతానాన్ని చంపి, ఆయన తన మొదటి సంతానమైన ఇశ్రాయేలును విడిపించాడు. విశ్వాసం ద్వారా యేసును స్వీకరించని వారు అత్యంత భయంకరమైన శాశ్వతమైన తీర్పును స్వీకరించవల్సి ఉంది. ఆ చివరి రోజున సాతాను వాని దూతలతో పాటు శాశ్వత మరణమైన నరకములో పడవేయబడతాం. పస్కా గొర్రెపిల్ల బలి ఇవ్వబడింది. నమ్మండి రక్షింపబడండి. దేవుని ప్రజలుగా మనం, ఒడంబడిక సహవాసంలో మన ప్రాథమిక లింక్‌గా యేసుక్రీస్తులో ముద్రింపబడాలని పస్కా మనకు గుర్తు చేస్తుంది. స్థానిక చర్చిలో యేసును పంచుకొందాం మరియు మిషన్‌లో బైబిల్ ఐక్యతలో ఉండటానికి పోరాడదాం.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl