పరిశుద్ధ గురువారం బి సిరీస్

పాత నిబంధన పాఠము: నిర్గమ 12:1-14; పత్రిక పాఠము: 1 కొరింథీ 10:16-17; సువార్త పాఠము: మార్కు 14:12-26; కీర్తన 115.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: నిర్గమ 12:1-14

నిర్గమ 12:1-14, 1మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను 2– నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. 3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు వారు తమతమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. 5ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండియైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును. 7ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమతమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 8ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను 9దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను; 10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. 11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి. 12ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. 13మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. 14కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను.

ఈ 12వ అధ్యాయం పస్కా పండుగను గురించి మాట్లాడుతుంది. ఈ పండుగకు కేంద్రబిందువైన పస్కా గొఱ్ఱెపిల్ల, “లోక పాపమును తీసివేయు దేవుని గొఱ్ఱెపిల్ల” (యోహాను 1:29) అయిన క్రీస్తుకు ఒక సూచన, లేదా చిత్రం. పస్కా పండుగ కేవలం విమోచనకు సంబంధించినది మాత్రమే కాదు—అది దేవుని న్యాయాన్ని, శక్తిని మరియు కరుణను కూడా వెల్లడిస్తుంది.

మన పాఠములో దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి, ఆ దేశం నుండి వేరు చేయడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ఈ పస్కా పండుగను స్థాపించాడు. పస్కా పండుగలో దేవుడు తన ప్రజలకు ఒక భోజనాన్ని ఇచ్చాడు. అది కేవలం ఆహారం కాదు—ఒక సందేశం. అది ఒక ఆచారం కాదు—రక్షణకు సంబంధించినది.

పస్కా అనేది బైబిలులో ప్రాముఖ్యమైన బోధ. దీనిని సరిగ్గా అర్థం చేసుకోవడమంటే—పాపం యొక్క తీవ్రతను (ధర్మశాస్త్రాన్ని), అలాగే దేవుని రక్షించే కృప యొక్క లోతును (సువార్తను) గ్రహించడమే.

ఈ వాక్య భాగం, “రక్షించే గొర్రెపిల్ల ద్వారా”

  1. దేవుడు రక్షణ మార్గాన్ని అందించాడని (నిర్గమకాండము 12:1–5).
  2. గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షణ వస్తుందని (నిర్గమకాండము 12:6–13).
  3. రక్షణను జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం జీవిద్దామని తెలియజేస్తూవుంది.

1

1మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను 2– నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల. పస్కా పండుగ వారి నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచించేదిగా ఒక గొప్ప స్మారకానికి గుర్తుగా ఒక పెద్ద పండుగగా ఉత్సహించేదిగా ఉండాలని యెహోవా కోరుకున్నాడు, దాని ద్వారా వారి క్యాలెండర్‌ను యెహోవా నిర్ధేశించాడు.

ఆయన ఇలా ఎందుకు చేసాడు? ఎందుకంటే విమోచనమే వారి “కొత్త జీవితానికి” ప్రారంభంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశ్యం.

ఆ క్రొత్త ప్రారంభానికి ముందు వారి బాక్గ్రౌండ్ గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకొందాం: షేతు → నోవహు → షేము → తెరహును → అబ్రాహాము → ఇస్సాకు → యాకోబు ఇలా దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి చరిత్ర పొడవునా ఒక భక్తిగల వంశాన్ని కాపాడుకొంటూ వచ్చాడు. లోకం భ్రష్టమైనప్పుడు కూడా, దేవుడు నమ్మకమైన శేషాన్ని కాపాడుకొంటూ వచ్చాడు. అబ్రాహాము దాకా దేవుని ప్రణాళిక నిర్దిష్ట వ్యక్తుల ద్వారా జరిగింది. అబ్రాహాము దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు: నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడతారు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను (ఆది 12:2,3) అని చెప్పాడు. ఇక్కడి నుండి దేవుని ప్రణాళిక టర్నింగ్ తీసుకొంది. ఇప్పటినుండి Godly line కేవలం వ్యక్తులు కాదు—ఒక జనముగా దైవభక్తిగల వంశం ఒక వాగ్దానంతో ఎన్నుకోబడిన కుటుంబంగా మారింది. యాకోబు నుండి వచ్చిన 12మంది కుమారులు → ఇశ్రాయేలు గోత్రాలుగా ఒక జనముగా మారారు. ఇశ్రాయేలు కేవలం వారి కోసం మాత్రమే ఎన్నుకోబడలేదు. వారి లక్ష్యం: సత్య దేవునిని లోకానికి బయలుపరచడం, జనములకు వెలుగుగా ఉండటం, యేసు క్రీస్తు రాకకు మార్గాన్ని సిద్ధం చేయడం, లోకములో దేవునికి సాక్ష్యముగా ఉండడం. ఒక వ్యక్తి నుండి → ఒక జనముగా → సర్వజనములను ఆశీర్వదించటానికి దేవుని ప్రణాళిక టర్నింగ్ తీసుకొంది.

మనకందరికీ తెలిసిన విషయమే, యోసేపు కాలంలో కరువు కారణంగా ఇశ్రాయేలీయులు (70) ఐగుప్తుకు వచ్చారు. యోసేపు ఐగుప్తులో ఒక నాయకుడు, కాబట్టి అతని కుటుంబానికి స్వాగతం లభించింది, రక్షణ కల్పించబడింది. కొంతకాలానికి “యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు వచ్చాడు” (నిర్గమ 1:8). ఈ ఫరో ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతున్నందున వారికి భయపడ్డాడు. వారిని అదుపులో ఉంచడానికి బానిసలుగా చేసాడు. బలవంతపు చాకిరీ చేయించారు: పితోము, రామెసెస్ వంటి పట్టణాలను వారిచే కట్టించారు (నిర్గమ 1:11). అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు, వారి జీవితాలు “కఠినమైన చాకిరీ వలన చేదుగా” చేయబడ్డాయి, (నిర్గమ 1:14). టాస్క్ మాస్టర్స్ వారి పరిమితులను దాటి వారిని హింసించారు. ఇశ్రాయేలీయుల జనాభాను నియంత్రించడానికి మగ శిశువులను చంపించారు (నిర్గమ 1:16). చెప్పాలంటే: వారిని వాడుకున్నారు, హింసించారు, అమానవీయంగా చూశారు. కాబట్టి, బానిసత్వం కొత్త పాలకుని భయం, అణచివేత కారణంగా రాజకీయ నియంత్రణలో భాగంగా సంభవించింది.

మరి వారిని అలా దాస్యంలో ఉంచడంలో సాతాను పాత్ర కూడా ఉండొచ్చంటారా? ఉంటే సాతానుకు గల కారణాలు ఏమై ఉండొచ్చు? . బానిసత్వాన్ని ఉపయోగించుకొని వాడు దేవుని జనాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఇది ఇశ్రాయేలును తుడిచిపెట్టే ప్రయత్నం. బి. దేవుని వాగ్దానాలను ఆపడం. అబ్రాహాము ద్వారా అతని సంతానం గొప్ప జనాంగంగా ఎదుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడు (ఆది 12:2). సాతాను దేవుని ప్రణాళికను వ్యతిరేకిస్తాడు, కాబట్టి దాని నెరవేర్పును అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. సి. మెస్సీయ రావలసిన జనాంగం ఇశ్రాయేలు కాబట్టి రాబోయే రక్షకుని రాకను నిరోధించడానికి ప్రయత్నించాడు. ఒకవేళ ఇశ్రాయేలు నాశనమైతే, రక్షణ ప్రణాళికకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా, దాస్యం అనేది దేవుని విమోచన ప్రణాళికను సాతాను ఎదిరించడమే.

బానిసత్వంలో దేవుని విమోచన ప్రణాళికలో, సాతాను ఎదిరిస్తుండగా 430 yrs దేవుడు ఇనాక్టివ్గా ఉన్నాడంటారా?
• బానిసత్వంలో ఆయన వారి ప్రాణాలను కాపాడుతూ వారిని ఒక జనాంగంగా బహుగా వృద్ధి చెందించాడు.
• ఆయన వారి విమోచకుడిగా మోషేను సిద్ధం చేశాడు. అందులో భాగంగానే మోషే శిశువుగా ఉన్నప్పుడే కాపాడబడ్డాడు.
• బానిసత్వం దేవుడు అవసరమైన ప్రజలుగా వారిని తీర్చిదిద్దింది. బానిసత్వంలో వారికి ఏ అధికారమూ లేదు, స్వేచ్ఛ లేదు, తమను తాము రక్షించుకోవడానికి మార్గమూ లేదు. కాబట్టి వారు తమ పితరుల దేవునికి మొరపెట్టడానికి బానిసత్వం వారికి సహాయపడింది. ఆయన వారి మొరలను విన్నాడు, (నిర్గమ 2:24). ఇది వారి విశ్వాసాన్ని, దేవునిపై ఆధారపడటాన్ని, దేవునిపై నమ్మకాన్ని నిర్మించింది.
• దేవుడు ఆలస్యం చెయ్యొచ్చు, కానీ ఆయన ఎన్నడూ విఫలం కాడు. దేవుడు మౌనంగా ఉండొచ్చు, కానీ ఆయన పనిచేస్తూనే ఉంటాడు. తన సమయములో—దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఇది పస్కా పండుగ యొక్క అర్థానికి వారిని సిద్ధపరిచింది.

ఇశ్రాయేలీయులు తమ స్థితిని మార్చుకోలేరు, స్వేచ్ఛను సంపాదించుకోలేరు, వారు స్వేచ్చకు ఒక ప్రణాళికను రూపొందించుకోలేదు, స్వేచ్ఛ కోసం బేరసారాలు జరపలేదు. వారు తమను తామే రక్షించుకోలేరని, వారికి దేవుని అవసరం ఉందనే విషయాన్ని బానిసత్వం వారికి తెలియజేసింది. తమను తాము విడిపించుకోవడానికి వారికి శక్తి లేదు. దేవుడు జోక్యం చేసుకొన్నాడు. దేవుడే మార్గాన్ని కలుగజేశాడు. ఆయనే రక్షణను సిధ్ధపర్చాడు. రక్షణ కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది అని బానిసత్వము వారికి తెలియజేసింది.

దేవుడు ఒక కొత్త కార్యం చేయబోతున్నాడు. ఒక కొత్త ప్రారంభం. ఆ కొత్త ప్రారంభానికి ఆయన కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఇచ్చాడు. ప్రతి ఇంటికి ఒకటి చొప్పున్న దోషం లేని, పరిపూర్ణమైన గొర్రెపిల్లను తీసుకోమని చెప్పాడు. పరిపూర్ణమైన గొర్రెపిల్ల రక్తం మాత్రమే వారిని దేవుని తీర్పు నుండి రక్షించబోతుంది. అది కృపచేత విమోచించబడిన ప్రజలను సృష్టించబోతోంది. రక్తం ద్వారా కృప ఇశ్రాయేలును కప్పివేయబోతుంది.

ఆ పస్కా రాత్రి తర్వాత వారు స్వేచ్ఛను పొందబోతున్నారు. అప్పటి నుండి వారి జీవితం మొదలవబోతుంది. కాబట్టే దేవుడు “ఇదే మీకు మొదటి నెలగా” ఉండాలి అని చెప్పాడు. పస్కా అనే రక్షణ సంఘటన ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు క్యాలెండర్‌ను ఏర్పర్చి దానిని ఎంతో ప్రాముఖ్యమైనదిగా మార్చాడు. దేవుని దృష్టిలో, ఒకని జీవితం పాపం నుండి విమోచన పొందినప్పటి నుండి నిజంగా ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు తమను తాము రక్షించు కోలేదు—దేవుడు వారిని రక్షించాడు. దీని ఉద్దేశ్యం, విమోచకుడు ఎవరో గుర్తు పెట్టుకోవడం, ఆయనను మహిమ పరచడం, ఆయనలో ఆనందం పొందడం.

అలాగే, ఇశ్రాయేలు ప్రజలను తన సొంత ప్రజలుగా ప్రత్యేకపర్చడానికి దేవుడు ఈ పస్కా పండుగను స్థాపించాడు. దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించడం ద్వారా వారిని ప్రత్యేకపర్చబోతున్నాడు. ఆయన వారిని తన పిల్లలుగా దత్తత తీసుకుంటున్నాడు. ఆ దత్తత కార్యాన్ని ప్రారంభించాడు.

Application: ఈ గొప్ప సత్యాన్ని మన ప్రస్తుత జీవితానికి అన్వయిస్తే, చాలా స్పష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు మనకు కనిపిస్తాయి.

• జీవితానికి నిజమైన “ప్రారంభం” ఏమిటో ఆలోచించండి. దేవుని దృష్టిలో నిజమైన ప్రారంభం—విమోచనం. అంటే, మనం పాపం నుండి విడిపించి దేవునితో సంబంధంలోకి వచ్చిన రోజు నుండే మన జీవితానికి అసలు అర్థం మొదలవుతుంది. కాబట్టి మీ ప్రాధాన్యతలను మార్చు కోండి: “నేను క్రీస్తులో కొత్త జీవితం ప్రారంభించాను? దానిలో నేను కొనసాగుతున్నానా” అనే ప్రశ్న మనకు ముఖ్యమవ్వాలి.

• మనం ఈరోజు ఒక విధంగా పాపం, మరణం అపవాది యొక్క అధికారం, అలవాట్లు, ప్రపంచపు ఆలోచనలు యొక్క అధికారం క్రింద ఉన్నామని గుర్తించండి. చాలాసార్లు మనం వాటి ప్రకారం జీవిస్తూ ఉంటాం— కానీ దేవుడు మనలను ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం మన హృదయాన్ని పరిశీలించుకుని, “నేను ఇంకా ఎవరి అధికారం క్రింద ఉన్నాను?” అని ప్రశ్నించుకొందాం.

• రక్షణ మన ప్రయత్నాల ద్వారా సాధ్యం కాదు. ఈరోజు కూడా చాలామంది సత్క్రియలు, ఆచారాలు, ప్రార్థనలు, నానా రకాలుగా దేవుని చేరాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పస్కా మనకు నేర్పేది ఏమిటంటే— రక్షణకు దేవుడే మార్గాన్ని సిద్ధం చేసాడు. మనం కాదు. ఆ మార్గం యేసుక్రీస్తు. కాబట్టి మన విశ్వాసం మన పనులపై కాకుండా క్రీస్తు చేసిన కార్యంపై ఉండాలి.

• దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడని నమ్మడం నేర్చుకొందాం—even when we don’t see it. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు మౌనంగా కనిపించాడు, కానీ ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. కానీ అవి వృథా కాదు. అవి సిద్ధపరచే కాలం. కాబట్టి మనం సహనంతో, విశ్వాసంతో ఉండాలి.

• మనం దేవుని కార్యాలను మరువకుండా జీవించాలి. పస్కా ఒక స్మారకం—తరతరాలకు చెప్పాల్సిన కథ. అలాగే మన జీవితంలో దేవుడు చేసిన రక్షణను, మార్పును, కృపను మనం గుర్తుంచుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి, మన జీవితంతో సాక్ష్యమివ్వాలి. ఎందుకంటే మరచిపోతే, మనం మళ్లీ పాత జీవితానికి తిరిగి వెళ్లే ప్రమాదం ఉంది.

మీరు దేవునికి చెందిన ప్రత్యేక ప్రజలని గుర్తుంచుకొండి. దేవుడు ఇశ్రాయేలును విడిపించి తన ప్రజలుగా చేసుకున్నట్లే, ఈరోజు ఆయన మనలను కూడా క్రీస్తులో తనవారిగా చేసుకున్నాడు. కాబట్టి మన జీవితం వేరుగా ఉండాలి—మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన జీవన విధానం దేవుని మహిమను ప్రతిబింబించాలి.

అందువల్ల, పస్కా కథ కేవలం గత చరిత్ర కాదు—ఇది మన కథ. దేవుడు అప్పట్లో చేసినట్లే ఈరోజు కూడా రక్షిస్తాడు, మార్చుతాడు, కొత్త ప్రారంభం ఇస్తాడు. కానీ మనం ఆ కొత్త జీవితంలో నిజంగా జీవించటానికి విధేయత చూపడానికి ఇష్టపడుతున్నామా?

2

3మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు (ఈ నెల పదవరోజున) వారు తమతమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను. 4ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను. 5ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. 6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండియైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.

వారు నాలుగు రోజుల ముందే పస్కాను సిద్ధం చేయడం ఆరంభించాలని ఆజ్ఞ్యాపింపబడ్డారు. లేకపోతే 15,00,000 మందికి ఈజిప్టులో గొర్రె పిల్లలను సిద్ధం చేయడం కష్టంగా ఉండేది. వారు దానిని జాగ్రత్తగా పరిశీలించి నిర్దోషమని కన్ఫర్మ్ చేసుకొని ఒక సంవత్సరం వయస్సు గల మగదానిని నాలుగు రోజుల ముందుగా వాళ్ళు తమ ఇళ్లలోకి తీసుకురావాలి. ఈ నాలుగు రోజులు వాళ్ళు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిపూర్ణతను కోరుతున్నాడు కాబట్టి గొర్రెపిల్ల పరిపూర్ణంగా ఉందని నిర్ధారించుకోవాలి. పరిపూర్ణత లేని దానిని వారు అర్పించకూడదు. అలాగే గొర్రెపిల్లను వధించడం వారికి చాలా ఖరీదైన విషయం. దేవుని మాట మీద నమ్మకముంచి విధేయతతో దేవుడు ఈ ప్రత్యన్మయమైన బలి ద్వారా రక్షిస్తాడు అని విశ్వసించి దానిని పుచ్చుకొని దాని రక్తమును వారి గుమ్మములకు పూయవలసి ఉన్నారు. బలవంతము ఏమిలేదు.

ఇలా చెయ్యమని దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ ఆజ్ఞ వెనుక చాలా ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి:
• (a) రక్షణ కోసం. ప్రతి ఇంటికి ఒక నిర్దోషమైన గొఱ్ఱెపిల్ల తీసుకోవాలి. దాని రక్తం ద్వారా వారు మరణం నుండి రక్షింపబడతారు (12:13). 👉అర్థం: రక్షణ దేవుని ద్వారా మాత్రమే వస్తుంది.
• (b) ప్రత్యామ్నాయ బలిగా గొర్రెపిల్లను ఇచ్చాడు (Substitution). అర్థం: ఒకరి స్థానంలో ఇంకొకరు శిక్ష అనుభవించడం. 👉రక్తం → మరణం నుండి కాపాడుతుంది. వారికి విడుదలను ఇస్తుంది.
• (c) సంపూర్ణ విధేయతను పరీక్షించడం. “ఈ నెల 10వ రోజు తీసుకోవాలి. నిర్దోషమైనది. చిన్న విషయాల్లో కూడా కచ్చితమైన విధేయత అవసరం. 👉 అర్థం: దేవుని మాటకు పూర్తిగా లోబడాలి.
• (d) సమూహ అనుభవం (కమ్యూనిటీ). ఇక్కడ మొదటి పస్కా పండుగలో ఒక వ్యక్తికి బదులుగా కాకుండా, ఒక కుటుంబానికి లేదా కుటుంబాల సమూహానికి ప్రత్యామ్నాయంగా ఒక గొర్రెపిల్లను రక్షణకై/ విడుదలకై అర్పించమని ఆజ్ఞపింపబడ్డారు. కుటుంబం చిన్నదైతే పొరుగువారితో పంచుకోవాలి. 👉అర్థం: రక్షణ వ్యక్తిగతమైనదే కానీ అది అందరికి. ప్రభువు విమోచన కార్యం కొద్దిమందికి మాత్రమే ఒంటరి అనుభవంగా ఉండకూడదు.

పస్కా పండుగను యెహోవాను అనుసరించే అన్ని కుటుంబాలు ఆచరించాలి మరియు అనుభవించాలి, ఎందుకంటే వారు కలిసి ప్రభువును అనుసరించి వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు. కాబట్టే గొర్రెపిల్ల యొక్క పూర్తి వినియోగం ఇతర కుటుంబాలతో కలసి పంచుకోవాలని ఆదేశింపబడ్డారు. వారు బలి మొత్తాన్ని తినేలా చూసుకోవడం ద్వారా వారి భాగస్వామ్యం నిర్దేశించబడింది. ప్రభువు రాజ్యాన్ని ఒంటరిగా కాకుండా సహవాసంలో అనుభవించాలి, ఐక్యతతో నడవాలని కోరుతుంది.

వారు బానిసలు, ఎన్నో సంవత్సరాలు శ్రమలో ఉన్నారు. దేవుని తొమ్మిది తెగుళ్లను చూసినవారు. కాబట్టి వారు దేవుని మాటలు విని భయపడి ఉండొచ్చు. భయం: మరణ దూత రాబోతున్నాడు. ఏదైనా తప్పు చేస్తే ప్రమాదం. ఆశ: దేవుడు రక్షించబోతున్నాడు. సందేహం: “ఇలా నిజంగా జరుగుతుందా?” వారు ఆయన చెప్పినదాన్ని నమ్మి ఆయన చెప్పినట్లు చేస్తే జరుగుతుంది.

7ఈ నెల పదునాలుగవ దినము వరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 8ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చ బడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను 9దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను; 10దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడిన దైనను తిననే తినకూడదు; ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

ఇశ్రాయేలీయులు ఆ రక్తములో కొంత తీసికొని ఇండ్ల ద్వారబంధముల మీద, పైభాగమున గురుతుగా పూయవల్సి ఉన్నారు. పస్కాపండుగ రాత్రి, ఆయన ఐగుప్తు దేశములలో సంచరించి ప్రతి తొలిచూలు బిడ్డను సంహరించ బోతున్నప్పుడు, మీరున్న యిండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు, అని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, నిర్దోషమైన పరిపూర్ణమైన పస్కా గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ లభిస్తుంది. ఆ రాత్రి, దేవుడు ఐగుప్తు దేశం గుండా వెళ్ళబోతున్నాడు. తీర్పు రాబోతోంది. కానీ రక్షణ పొందడానికి ఒక్కటే మార్గం ఉంది: ఆ గొర్రెపిల్ల రక్తం. “నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను” (13) అని చెప్పాడు తప్ప, •“నేను మీ మంచి క్రియలను చూసినప్పుడు”, •“నేను మీ కృషిని చూసినప్పుడు”, •“నేను మీ చిత్తశుద్ధిని చూసినప్పుడు” దాటిపోతాను అని చెప్పలేదు.

ఆయన “నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు” దాటిపోతాను అని చెప్పాడు. రక్తం ఎందుకు? ఎందుకంటే పాపం మరణాన్ని తెస్తుంది. మరియు బలియాగం ద్వారా మాత్రమే జీవం లభిస్తుంది. దేవుని న్యాయం ప్రకారం శిక్ష రావాలి. శిక్ష నిజమే—కానీ ప్రత్యామ్నాయం ఇవ్వబడింది. ప్రజలు జీవించడం కోసం ఆ గొర్రెపిల్ల మరణించింది.

అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసాన్ని అందరూ తినాలని దేవుడు ఎందుకు చెప్పాడు?
• రక్షణ ప్రతిఒక్కరు వ్యక్తిగతంగా అనుభవించాలని. దేవుడు ఇశ్రాయేలును నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రు డని పిలిచాడు (నిర్గమ 4:22). —ఇది కేవలం కృప మాత్రమే. వారు ఈ హోదాను సంపాదించుకోలేదు; దేవుడు వారిని ప్రేమతో ఎన్నుకున్నాడు.
• రక్తం తలుపులపై బాహ్య రక్షణకు గురుతుగా ఉంది.
• మాంసం తినటం → అంతర్గత భాగస్వామ్యాన్ని తెలియజేస్తుంది. అర్థం: రక్షణను కేవలం చూడటం కాదు, ప్రతిఒక్కరు వ్యక్తిగతంగా అనుభవించాలి. సంపూర్ణముగా స్వీకరించాలి. తినటం అంటే: “ఇది నా కోసం” అని అంగీకరించడం. రక్షణను వ్యక్తిగతంగా స్వీకరించడం.
• మాంసం అగ్నిచేత కాల్చబడటం అంటే, తీర్పు, శుద్ధిని సూచిస్తుంది. అర్థం: బలి పూర్తిగా దేవునికి సమర్పిం చబడింది. 👉 ఇది మీరు: రక్తంపై విశ్వాసం పెట్టాలి, బలిని స్వీకరించాలి, దేవుని రక్షణలో భాగం కావాలి.

ఇందులో ప్రతి కుటుంబం పాల్గొనాలి. ఎవ్వరూ బయట ఉండకూడదు. చిన్న కుటుంబం అయితే పొరుగు వారితో పంచుకోవాలి. 👉 అర్థం: దేవుని రక్షణ అందరికీ— ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. 👉 ఇది ఒక “కట్టుబాటు భోజనం” (covenant మీల్). దేవుని ప్రజలు కలిసి తినాలి. 👉 తద్వారా వారు దేవునితో ఒక ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశిస్తున్నారు. దేవుడు ఇచ్చిన రక్షణను కేవలం చూడటం కాదు—దాన్ని విశ్వాసంతో స్వీకరించి జీవితంలో భాగం చేసుకోవాలి.

పొంగని రొట్టె, త్వరగా వెళ్లాలి → ఆలస్యం లేదు. పులియని పిండి → పవిత్రతకు సూచన. చేదుకూరలు బానిసత్వపు చేదు జీవితానికి గుర్తు.

11మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.

• ప్రభువు వారికి ప్రాయశ్చిత్తం మాత్రమే కాకుండా భూమిపై ఉన్న కుటుంబాలు ప్రభువును తెలుసుకునేలా చెయ్యడానికి ప్రపంచవ్యాప్త మిషన్‌లో వారు ఆయనతో చేరగలిగేలా ప్రభువు వారిని తన ప్రజలుగా బయలు దేరజేస్తున్నాడు. వారి రక్షణ కేవలం స్వేచ్చకు మాత్రమే పరిమితం కాదు. వారి రక్షణ వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్లి మిషన్‌లో పునాదిగా ఉండాల్సి ఉన్నారు.

విమోచన సమయం చివరకు వచ్చింది! పస్కా పండుగ రాత్రి ఆయన తన తొలి కుమారుడైన ఇశ్రాయేలును ఆయనను విశ్వసించిన వారినందరిని విడిపించాడు.

నిర్గమకాండము 12:1–13లో, దేవుడు పస్కా పండుగను స్థాపించి, ఇశ్రాయేలీయులను ఒక నిష్కళంకమైన గొర్రెపిల్లను బలిగా అర్పించి, దాని రక్తముతో వారి ద్వారబంధములను గుర్తించమని ఆజ్ఞాపించాడు, తద్వారా తీర్పు వారిని దాటిపోతుంది; ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, పాపులను నిత్య మరణం నుండి రక్షించడానికి రక్తం చిందించిన, దేవుని యొక్క నిజమైన మరియు పరిపూర్ణ గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుకు ఇది ఒక ముందస్తు సూచన. దేవుడు తన కృపలో సమస్త లోకము కొరకు ఆయన ఒక గొర్రెపిల్లను అందించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, బాప్తిస్మమిచ్చు యోహాను “యేసును చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని చెప్పాడు (యోహాను 1:29; యోహాను 11:50–52). ఈ పస్కా గొర్రెపిల్ల “నిర్దోషమైనదిగా” ఉండాలని దేవుడు నిర్దేశించాడు. —పేతురు ఆసియా మైనర్‌లోని చెల్లాచెదురుగా ఉన్న క్రైస్తవులకు వ్రాస్తూ, “అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా అని వారికి ఆత్మ ప్రేరణచేత సాక్ష్యమిచ్చాడు (1 పేతురు 1:19). జగదుత్పత్తి మొదలు కొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్ల, (ప్రక. 13:8) 1 కొరింథీయులకు 5:7, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని బైబులు యేసుని గురించి చెప్తూవుంది.

యోహాను 6:53, యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు అని చెప్తూవుంది.

ఈ సంబంధం మాండీ గురువారం నాడు స్పష్టమవుతుంది, ఆ రోజున యేసు తన శిష్యులతో పస్కా పండుగను జరుపుకొని, ప్రభువు బల్లలో వారికి రొట్టె ద్రాక్షారసాన్ని ఇవ్వడం ద్వారా దాని రూపాన్ని మార్చాడు, తద్వారా పస్కా బలి యొక్క నెరవేర్పు తానే అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు తమ సొంత నీతి వలన కాక గొర్రెపిల్ల రక్తము వలన ఎలాగైతే రక్షించబడ్డారో, అలాగే విశ్వాసులు తమ క్రియల వలన కాక క్రీస్తు ప్రాయశ్చిత్త రక్తము నందు విశ్వాసము వలన రక్షించబడతారు; ఈ విధంగా, పస్కా పండుగ తన సంపూర్ణ అర్థాన్ని యేసులో కనుగొంది, ఆయనపై విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని తీర్పు దాటిపోతుంది.

ఆ గొర్రెపిల్ల రక్తం ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసింది. —“క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను” (ఎఫెసీయులు 5:2) అని పౌలు తన తోటి విశ్వాసులకు గుర్తు చేశాడు.

ఈ గొప్ప తీర్పులో విశ్వాసముతో ఈ రక్తమును వర్తింప చేసుకొనిన వారికి ఈ రక్తం ఒక గొప్ప గుర్తుగా ఉంటూ వారు ఆ తీర్పునుండి దాటడానికి వారికి సహాయపడుతుంది. ప్రభువు కోరినది చేయడం విశ్వాసం. ఆయన మాటలను లక్ష్యపెట్టడం విశ్వాసం. విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే ఆయన మాటలను బట్టి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు రక్షింపబడతారు. ఆ గొర్రెపిల్ల రక్తమే వారికి రక్షణ. వారు రక్తమును నమ్ముకున్నారు. ద్వారబంధమున రక్తమును పూయడం విశ్వాస క్రియ. మరణం నుండి విముక్తి పొందాలంటే, వారు దేవుని మాటను నమ్మాలి.

విశ్వాసం ద్వారా ప్రతి కుటుంబం పరిపూర్ణమైన గొర్రెపిల్లను ఎంచుకుంది, విశ్వాసం ద్వారా వారు దాని ప్రాణాన్ని తీసుకొని చేదు కూరలతో కాల్చారు, విశ్వాసం ద్వారా వారు దాని రక్తాన్ని తలుపు మీద చల్లారు. రక్తం వారి విశ్వాసానికి బహిరంగ ఒప్పుకోలు, బలి అర్పించబడిన గొర్రెపిల్ల యొక్క ప్రాయశ్చిత్త ప్రభావాన్ని వారు విశ్వసించారని అది సూచిస్తుంది. కాబట్టి వారు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడ్డారు.

Application: ఈ పాఠాన్ని ఈరోజు మన జీవితాలకు అన్వయించుకుంటే చాలా శక్తివంతమైన సత్యాలు కనిపిస్తాయి.

• రక్షణ మన ప్రయత్నాల వల్ల కాదు, దేవుడు ఇచ్చిన మార్గం ద్వారానే వస్తుందని పస్కా కథ మనకు చెబుతుంది. మీ మంచి పనులను చూసి మిమ్మల్ని కాపాడుతానని దేవుడు చెప్పలేదు. ఆయన ఒక్కటే చెప్పాడు: నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు మిమ్మల్ని దాటిపోతానని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు మనము కూడా మన నీతి, మన కృషి, మన సత్క్రియల మీద ఆధారపడలేం. మన రక్షణకు ఏకైక ఆధారం యేసు రక్తమే. కాబట్టి మనం మనపై నమ్మకం పెట్టుకోకుండా, క్రీస్తు కార్యంపై విశ్వాసం ఉంచుదాం.

• పస్కా మనకు వ్యక్తిగత విశ్వాసం యొక్క అవసరాన్ని నేర్పిస్తుంది. రక్తం తలుపు మీద పూయబడాలి — అది బయట గుర్తు. మాంసం తినాలి — అది అంతర్గత స్వీకారం. అంటే, రక్షణ/ రక్షకుని గురించి కేవలం తెలుసుకోవడం మాత్రమే సరిపోదు; రక్షణ/ రక్షకుని మనం వ్యక్తిగతంగా స్వీకరించాలి.

• ఈ పాఠం మనకు సంపూర్ణ విధేయత ఎంత ముఖ్యమో చూపిస్తుంది. చిన్న విషయాలలో కూడా దేవుడు స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు — పస్కాను ఏ రోజు, ఏ విధంగా, ఏ రీతిగా చేయాలి అని. ఇశ్రాయేలీయులు తమకు అర్థం కాకపోయినా దేవుని మాటను పూర్తిగా అనుసరించారు. అదే విధంగా ఈరోజు మనం కూడా దేవుని వాక్యానికి, పూర్తిగా లోబడదాం. నిజమైన విశ్వాసం ఎప్పుడూ విధేయతలో కనిపిస్తుంది.

• ఇది మనకు సహవాసం (community) విలువను నేర్పిస్తుంది. పస్కా ఒక వ్యక్తి కోసం కాదు — ఒక కుటుంబం కోసం అంటే దేవుని రక్షణ ఒంటరిగా అనుభవించడానికి కాదు. విశ్వాసం వ్యక్తిగతమైనదే అయినా, అది సమూహంలో పెరగాలి.

• పస్కా మనకు తక్షణ స్పందన (urgency) నేర్పిస్తుంది. వారు చెప్పులు వేసుకొని, కఱ్ఱలు పట్టుకొని, త్వరగా తినాలి. ఎందుకంటే వారు వెంటనే బయలుదేరాలి. అదే విధంగా ఈరోజు మనం కూడా ఆలస్యం చేయకూడదు. రక్షణ పిలుపు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. “తర్వాత చూస్తాను” అనేది ప్రమాదకరం. దేవుడు పిలిచినప్పుడు, వెంటనే స్పందించాలి.

• ఇశ్రాయేలీయుల బానిసత్వం, తెగుళ్లు, బాధలు — ఇవన్నీ చివరికి దేవుని శక్తిని చూపించడానికి, రక్షణను వెల్లడించడానికి ఉపయోగించబడ్డాయి. అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా వ్యర్థం కావు. దేవుడు వాటిని మన విశ్వాసాన్ని పెంచడానికి, తన మహిమను చూపించడానికి ఉపయోగిస్తాడు.

చివరగా, ఈ పస్కా పూర్తిగా యేసు క్రీస్తులో నెరవేరింది. ఆయన నిజమైన నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆయన రక్తం మనలను తీర్పు నుండి కాపాడుతుంది. ఈరోజు 👉 మీరు ఆ రక్తం క్రింద ఉన్నారా? 👉 మీరు యేసును కేవలం తెలుసుకుంటున్నారా, లేక ఆయనను మీ రక్షకుడిగా స్వీకరించారా? ఎందుకంటే దేవుడు ఇచ్చిన రక్షణను ఆలస్యం చేయకుండా, విశ్వాసంతో స్వీకరించండి; ఒంటరిగా కాదు, సహవాసంలో జీవించండి; సంపూర్ణంగా ఆయన మాటకు లోబడండి; యేసు క్రీస్తు రక్తం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే నిజమైన విమోచనం, ఇదే నిత్యజీవానికి మార్గం.

మార్కు 14:22-24, వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము.

లూకా 22:19,20, పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.

Mark 14:22-24; Luke 22:19,20. (True body and true blood) In, under, with. This is not symbolic language—it is a real, sacramental union grounded in Christ’s words. ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్షారసాన్ని (యేసు నిజమైన శరీరంగా మరియు నిజమైన రక్తంగా) అంటే యేసు నిజ శరీరాన్ని మరియు నిజ రక్తాన్ని రొట్టె ద్రాక్షరసంలో (in), యేసు నిజ శరీరాన్ని మరియు నిజ రక్తాన్ని రొట్టె ద్రాక్షరసం క్రింద (under), యేసు నిజ శరీరాన్ని మరియు నిజ రక్తాన్ని రొట్టె ద్రాక్షరసంతో (with) పుచ్చుకోవాల్సి ఉన్నాం. ఇది కేవలం ప్రతీకాత్మక భాష కాదు—ఇది క్రీస్తు మాటలపై ఆధారపడిన ఒక వాస్తవమైన, పవిత్రమైన ఐక్యత.

ప్రభురాత్రి భోజనం ఇచ్చే ఆశీర్వాదములు: దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది, ఎఫెసీయులకు 1 1:7 (మన అపరాధములకు క్షమాపణ); 1 కొరింథీయులకు 11:24,25 దానిని విరిచి–యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని–యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. (క్రొత్తనిబంధన); రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము, (రక్షణ); రోమా 6:22,23 అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. (నిత్యజీవము)

ప్రభురాత్రి భోజనం యొక్క శక్తి: వాక్యం – దీవెనలను వాగ్దానం చేస్తుంది మరియు విశ్వాసాన్ని బలపరుస్తుంది – దీనికి తోడుగా – తినడం మరియు త్రాగడం మన కొరకు దీవెనలను సంపాదించిన క్రీస్తు ద్వారా, వాటిని మనకు ఇవ్వడానికి ఇది మీకు శక్తిని ఇస్తుంది. మనం దీనిని ఎందుకు స్వీకరించాలి? అంటే, పాపక్షమాపణ కొరకు, మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, ప్రోత్సాహం పొందడానికి, దాని బలం ద్వారా క్రీస్తు కొరకు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి.

ప్రభువు బల్లను గురించిన సాధారణ తప్పుడు సిద్ధాంతాలు

    ఎ. అనేక సంఘాలలో “ఇది కేవలం ఒక చిహ్నం (జ్ఞాపకార్థ ఆరాధన) మాత్రమే.

    వారు బోధించేది: రొట్టె మరియు ద్రాక్షారసం కేవలం చిహ్నాలు (symbols) మాత్రమే. ఈ సంస్కారము వారికి యేసును జ్ఞాపకం చేసుకోవడమే మాత్రమే.

    ఇది ఎందుకు తప్పు: రొట్టెను ద్రాక్షారసాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు యేసు పలికిన ఈ మాటలను వారు చెప్పరు (–మీరు తీసికొని తినుడి; ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న యేసుక్రీస్తు యొక్క నిజ శరీరమై యున్నది అను మాటలను పాస్టర్ గారు రొట్టెను ఇస్తూ చెప్పవలసి యున్నారు. This is my body given for you; do this in remembrance of me, లూకా 22:19,20. This is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins, మత్తయి 26:28. (ఇంగ్లీష్ గ్రామర్ లో is అంటే వర్తమాన కాలం (ప్రెసెంట్ ఇండికేటివ్ ఆక్టివ్), 3rd పర్సన్, ఏకవచనం). ప్రతి కాలములో ఈ మాటలు వర్తమానమే (రొట్టెలో, రొట్టెక్రింద, రొట్టెతో యేసుని నిజ శరీరాన్ని పుచ్చుకొంటున్నాం). మీరు తీసుకొని త్రాగుడి ఇది మీకొరకు చిందింపబడిన యేసుక్రీస్తు యొక్క నిజ రక్తమై యున్నది అను మాటలను పాస్టర్ గారు ద్రాక్షారసాన్ని ఇస్తూ చెప్పవలసి యున్నారు.

    1 కొరింథీయులకు 11:27-29, కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. పాల్గొనేవారు “ప్రభువు యొక్క శరీరమునకును రక్తమునకును దోషులు” కాగలరని లేఖనం చెబుతోంది. రొట్టె ద్రాక్షరసం కేవలం ఒక చిహ్నం (symbol) మాత్రమే అయితే, క్రీస్తు యొక్క నిజమైన శరీరానికి మరియు రక్తానికి వ్యతిరేకంగా ఎవరైనా ఎలా పాపం చేయగలరు?

    రొట్టె ద్రాక్షారసాన్ని యేసుని నిజ శరీరంగా నిజ రక్తంగా కాకుండా రొట్టె ద్రాక్షారసాన్ని యేసుని నిజ శరీరానికి నిజ రక్తానికి సాదృశ్యంగా (సింబల్స్) గా భోదిస్తున్న వారి బోధ దేవుని బహుమతిని, కేవలం మనిషి జ్ఞాపకం చేసుకునే చర్యగా తగ్గిస్తుంది.

    👉 ధర్మశాస్త్రం: ఇది పవిత్రమైన వాటిని తేలికగా చుసేటట్లు చేస్తుంది. సువార్త నష్టం: ఇది ప్రభువు బల్లలో ఇవ్వబడిన నిజమైన క్షమాపణను తొలగిస్తుంది.

    బి. రోమన్ కాథలిక్ సిద్ధాంతం (ట్రాన్స్‌సబ్‌స్టాన్షియేషన్)

    వారు బోధించేది: రొట్టె మరియు ద్రాక్షారసం వాటి రూపాన్ని మార్చుకొని క్రీస్తు శరీరంగా మరియు రక్తంగా మారతాయి. దివ్యబలిపూజ (ఒక విధంగా చెప్పాలంటే) క్రీస్తు యొక్క పునఃబలిదానం. క్రీస్తు అందరి కొరకు ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు (హెబ్రీయులు 10:10)

    లోతైన సమస్య: ఆ సన్నిధి ఎలా సంభవిస్తుందో తత్వశాస్త్రం ఉపయోగించి వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రభువు బల్లను ఒక మానవ కార్యం లేదా పునరావృత బలిగా మార్చడం ప్రమాదకరం.

    👉 ధర్మశాస్త్రం: దేవుడు మాట్లాడని చోట మానవ వివరణను జోడిస్తుంది. 👉 సువార్త ప్రమాదంలో: క్రీస్తు బలి ఒక్కసారిగా అందరి కొరకు పూర్తిగా సరిపోదని సూచిస్తుంది.

    C. సంస్కరించబడిన / కాల్వినిస్ట్ దృక్పథం (ఆధ్యాత్మిక సన్నిధి మాత్రమే)
    వారు బోధించేది: క్రీస్తు భౌతికంగా ప్రత్యక్షం కారు, విశ్వాసులు ఆయనను విశ్వాసం ద్వారా ఆత్మీయంగా మాత్రమే పొందుతారు.

    ఇది తప్పు: యేసు తన శరీరాన్ని, రక్తాన్ని తినడానికి, త్రాగడానికి ఇచ్చాడు. అవిశ్వాసులు కూడా దానిని పుచ్చుకొంటున్నారు (తీర్పుకు లోబడినప్పటికీ). ఇది క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని ప్రభువు బల్ల నుండి వేరు చేస్తుంది.

    👉 ధర్మశాస్త్రం: క్రీస్తు మాటలను మానవ తర్కానికి లోబరుస్తుంది (“ఆయన భౌతికంగా ప్రత్యక్షం కాలేరు”)

    👉 సువార్త బలహీనపడుతుంది: ఈ కానుకను విశ్వాసి యొక్క అంతర్గత అనుభవంపై ఆధారపడేలా చేస్తుంది.

    D. స్వీకరణవాదం (విశ్వాసులు మాత్రమే క్రీస్తును పొందుతారు)

    వారు బోధించేది: విశ్వాసులు మాత్రమే క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని పొందుతారు. అవిశ్వాసులు రొట్టెను, ద్రాక్షారసాన్ని మాత్రమే పొందుతారు.

    ఇది తప్పు: ప్రభువు శరీరం మరియు రక్తం విషయంలో అవిశ్వాసులు దోషులని లేఖనం చెబుతోంది. మీరు పొందని దాని విషయంలో మీరు దోషులు కాలేరు.

    E. వివేచన లేకుండా బహిరంగ ప్రభువు బల్ల ఆశీర్వాదం

    కొన్ని సంఘాలలో: విశ్వాసం లేదా బోధనతో సంబంధం లేకుండా ప్రభు రాత్రి భోజనంలో ఎవరైనా పాల్గొనవచ్చు.

    ఇది ప్రమాదకరం: అనర్హులకు ప్రభురాత్రి భోజనాన్ని ఇవ్వవద్దని లేఖనం హెచ్చరిస్తుంది. పవిత్ర సంస్కారాన్ని కాపాడటానికి పాస్టర్లు పిలువబడ్డారు.

    👉 ధర్మశాస్త్రం: ఇది ప్రజలు తమపై తీర్పును తెచ్చుకొనేలా ప్రభువు శరీరాన్ని రక్తాన్ని తిని, త్రాగేలా చేస్తుంది.
    👉 సువార్త: నిజమైన ప్రేమ పవిత్ర సంస్కారాన్ని ఇచ్చే ముందు హెచ్చరిస్తుంది మరియు సరిగ్గా బోధిస్తుంది

    ముగింపు: యేసు పస్కా పండుగ నెరవేర్పు అని తెలుసుకుని నమ్మండి, ఆయనే లోక పాపాన్ని మోసికొనిపోయిన దేవుని గొర్రెపిల్ల. మనిషి చేసే ఏ ప్రయత్నంలోనూ రక్షణ లేదు. మీరు రక్షింపబడవలసిన అవసరం లేదని అనుకొంటే, మీరు దేవుని తీర్పుగుండా వెళ్లాలనే విషయాన్ని తెలుసుకోండి. ప్రభువే స్వయముగా రక్షణను అందిస్తున్నాడు, కానీ ఆ ఆఫర్ ఒకరోజు రద్దు చేయబడుతుంది. విశ్వాసం ద్వారా యేసును స్వీకరించని వారు అత్యంత భయంకరమైన శాశ్వతమైన తీర్పును స్వీకరించవల్సి ఉంది. ఆ చివరి రోజున సాతాను వాని దూతలతో పాటు శాశ్వత మరణమైన నరకములో పడవేయబడతాం. పస్కా గొర్రెపిల్ల బలి ఇవ్వబడింది. నమ్మండి రక్షింపబడండి. దేవుని ప్రజలుగా మనం, ఒడంబడిక సహవాసంలో మన ప్రాథమిక లింక్‌గా యేసుక్రీస్తులో ముద్రింపబడాలని పస్కా మనకు గుర్తు చేస్తుంది. ఈ స్థానిక చర్చిలో యేసును పంచుకొందాం మరియు దేవుని మిషన్‌లో బైబిల్ ఐక్యతలో ఉండటానికి పోరాడదాం.

    దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

    KURAPATI VIJAY KUMAR,
    HDFC BANK, Account no 50200096563465,
    IFSC code. HDFC0005872,
    Swift code HDFCINBB,
    JKC College Road Branch, GUNTUR 522006,
    ANDHRA PRADESH, INDIA.
    The phone pay UPI Id : 9848365150-2@ybl