మట్టల ఆదివారము బి సిరీస్ (పాత నిబంధన ప్రసంగము)

పాత నిబంధన పాఠము: జెకర్యా 9:9-10; పత్రిక పాఠము: ఫిలిప్పీ 5:7-0; సువార్త పాఠము: మార్కు 11:1-10; కీర్తన 24.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: జెకర్యా 9:9-10

జెకర్యా 9:9-10, సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

పర్షియన్ రాజు సైరస్ ది గ్రేట్ క్రీ.పూ.538లో యూదులు తమ దేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతించాడు. యూదులు చెర నుండి తిరిగి వచ్చారు కానీ వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది: దేశం బలహీనంగా ఉంది, యెరూషలేము పాడై పోయింది, గోడలు కూలిపోయాయి, ఆలయం నాశనం అయింది, ప్రజలు కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ముఖ్యంగా, వారికి స్వతంత్ర రాజ్యం లేదు, వారికి రాజు లేడు. వారు ఇంకా విదేశీ పాలన లోనే ఉన్నారు. జెరుబ్బాబెల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించారు. కానీ వారి ప్రయత్నాలు అడ్డగింపబడుతూ ఉన్నాయి. అడ్డగిస్తూవున్న శత్రువులను ఎదిరించాల్సి రావటం, ప్రతికూల పరిస్థితులు, నెరవేరని వారి అంచనాలు, వైఫల్యం, ఒత్తిడి పునరుద్ధరణ అసాధ్యం ఏమో అనే భావనను కలుగజేసాయి. అసంతృప్తి, నిరాశ, నిస్సహాయత, ఉక్రోషం, కోపం, అవమానం, వారినెంతో ఇబ్బందిపెడుతూ ఉన్నాయి. మమ్మల్ని గమనిస్తూవున్న మా శత్రువులు, అన్యులు ఏమనుకుంటారోనన్న భయం తీవ్రమైన అభద్రతకు కారణ మయ్యింది.

నిజం చెప్పాలంటే, ప్రణాళికాబద్ధమైన వారి లక్ష్యాలకు వారి ప్రస్తుత వాస్తవికతకు మధ్య సాతాను అంతరాన్ని ఏర్పరిచింది. వారి పురోగతిని మందగింపజేసింది. ప్రధానంగా అనిశ్చితిని, వారి నిస్సహాయతను ప్రేరేపించి, వారిని అతిగా ఆలోచించేటట్లు చేసి, వారికి ఆధ్యాత్మికంగా అస్థిరతను కలుగజేసింది. సవాలుతో కూడిన కొత్త పరిస్థితుల ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది, ఇది మితిమీరిన ప్రశ్నలకు మరియు భావోద్వేగ అసౌకర్యానికి దారితీసింది. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా? దేవుడు ఎందుకని ఇన్ ఆక్టివ్ గా ఉన్నాడు అనే ప్రశ్న చేత వారు వేధింపబడేటట్లు చేసింది.

ఆ కాలములో ఇశ్రాయేలుకు దావీదు వంశం నుండి దావీదు వంటి శక్తివంతమైన రాజు లేడు. దావీదు వంశం నుండి మెస్సీయ కోసం గట్టిగా ఎదురుచూస్తున్నారు. పాత నిబంధనలోని మెస్సయ్యను గురించిన ప్రవచనాలు, ముఖ్యంగా ఇశ్రాయేలును శక్తివంతమైన దేశంగా చేసిన దావీదు రాజవంశంతో సంబంధాన్ని కలిగి, రాబోతున్న మెస్సయ్య రాజుగా వస్తాడని చెప్పినందిన అవి ఇశ్రాయేలు రాజకీయ వైభవాన్ని పునరుద్ధరించే రాజుగా దావీదు వంశానికి చెందిన మెస్సయ్య వస్తాడని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఆయన ఒక శక్తివంతమైన సైనిక రాజుగా వచ్చి, తన భౌతిక శక్తి ద్వారా వారి శత్రువులను ఓడించి, ఇశ్రాయేలును మహారాజ్యంగా స్థాపిస్తాడని, యూదులందరిని తిరిగి వాగ్దాన భూమికి సమీకరిస్తాడని, యెరూషలేములో ఆలయాన్ని పునర్నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా శాంతియుగాన్ని నెలకొల్పుతాడని బలంగా నమ్మటం మొదలుపెట్టారు. విమోచకుడి ఆలోచన రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. వారి దేశం యొక్క కీర్తిని మళ్ళి పునరుద్ధరించే ఎంతో గొప్ప విజేతయైన ఆ సైనిక రాజు కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆ శక్తివంతమైన దావీదు రాజ్యం మళ్లీ ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్న చేత వారు వేధింపబడేటట్లు చేసింది.

అలాగే మన పాఠము యొక్క సందర్భము వాళ్ళు వూహించుకొంటున్న దానిని వాళ్ళ హృదయాలకు బలంగా హత్తుకొనేందుకు దోహదపడింది. ఈ అధ్యాయంలోని మొదటి భాగం ఈ ప్రపంచాన్ని, ఇశ్రాయేలు పొరుగు వారిని నిర్దాక్షిణ్యంగా జయించిన గొప్ప విజేత యైన అలెగ్జాండర్ ది గ్రేట్ రాకను గూర్చి వచ్చిన దేవోక్తిని గురించి ప్రవచిస్తూ ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ తన విజయ మార్గంలో శత్రువులను నిర్ధాక్ష్యంగా అణచివేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు అతని రాక వార్త అతని మార్గంలో ఉన్నవారి హృదయాలలో భయాన్ని రేకెత్తించేదిగా ఉంది. వారి మెస్సీయ కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే శక్తివంతమైన రాజుగా/ రాజకీయ విమోచకుడుగా ఉంటాడని వారు భావించారు.

అలాంటి పరిస్థితులలో, మన ఈ పాఠములో జెకర్యా గొప్ప విజేతయైన అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వారికి భిన్నంగా, అందరికంటే ఎంతో గొప్ప విజేతయైన మెస్సయ్యను గురించి ఆ రాజు యొక్క స్వభావాన్ని గురించి ఎందుకని ప్రవచించాడు? రాబోయే రాజు గురించి వారి అంచనాలను సరిదిద్దడానికి మరియు రూపొందించడానికి అలాగే మెస్సయ్య గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉందని వారిని తెలియజేయడానికే ఈ ప్రవచనం ఇవ్వబడింది.

రాబోయే రాజు గురించి దేవుడు ఎందుకని వారి అంచనాలను సరిదిద్దాలనుకొన్నాడు? ఎందుకని వారి ఆలోచనలను రూపొందించాలనుకొన్నాడు? ఎందుకంటే వారికి కావల్సింది స్వతంత్ర రాజ్యం. ఇశ్రాయేలు శక్తివంతమైన దేశంగా పునరుద్ధరించబడటం. దావీదు వంశం నుండి యెరూషలేము నుండి ప్రపంచాన్ని పరిపాలించే రాజు మాత్రమే వారికి కావాలి, ప్రపంచవ్యాప్తంగా శాంతి యుగానికి దావీదు మెస్సయే కారణం కావాలి, అంతే. వారి వరకే మెస్సయ్యా పరిమితం.

ఈ రాజకీయ మెస్సీయ కోసం ఎదురు చూడటం అనేది అనేక విధాలుగా వారి ఆరాధనను కూడా ప్రభావితం చేసింది: ఆలయ ఆరాధన మరియు ప్రార్థనలలో జాతీయ పునరుద్ధరణ కోసమైన ఆశ చేర్చబడింది. యెషయా గ్రంథం 9; యిర్మీయా గ్రంథం 23, యెహెఙ్కేలులో కొన్ని భాగాలు దేవుడు ఇశ్రాయేలు శత్రువులను ఓడిస్తాడని, ఇశ్రాయేలు మళ్ళీ గొప్ప రాజ్యంగా మారుతుందని చెప్తూ ఉండటాన్ని బట్టి ఈ లేఖనభాగాలను వారి ఆలోచనకు ఆధారం చేసుకొన్నారు. రాజ్య కేంద్రంగా ఆలయంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఆలయాన్ని: దేవుని భవిష్యత్ రాజ్యానికి చిహ్నంగా, ఇశ్రాయేలు మహిమను దేవుడు పునరుద్ధరించాలని ప్రజలు ఆశించే ప్రదేశంగా మార్చేశారు. యూదు బోధకులు మెస్సీయ ప్రవచనాలను బోధనలో కేంద్ర బిందువుగా మార్చి, రాబోయే రాజు, ఇశ్రాయేలు పునరుద్ధరణ, దేశాల ఓటమి గురించి వక్కాణించడం ప్రారంభించారు. రాడికల్ భావాజాలాన్ని ప్రజలలో నింపడం ప్రారంభించారు. దేవుడు నిజంగా మనలను పునరుద్ధరించాడా? అనే ప్రశ్న చేత వారు వేధింపబడేటట్లు చేసింది (ఎందుకంటే వెనక్కి వచ్చింది 2 గోత్రాలు మాత్రమే).

జెకర్యా వారి రాజకీయ మెస్సీయ ఆలోచనను/ అంచనాను సరిదిద్దుతూ, ఆ రాజు, నీతిపరుడును రక్షణగల వాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి రావడం, శాంతి తీసుకురావడం, అనేది ప్రజలు ఆశించే సాధారణ సైనిక విజేత నుండి చాలా భిన్నంగా ఉంటుందని 9 వచనంలో ప్రవచించాడు. 10వ వచనం, ఆయన రథాలను మరియు యుద్ధ గుర్రాలను తొలగించి దేశాలకు శాంతిని తెస్తాడని చెప్తుంది. కాబట్టి జెకర్యా మెస్సీయను రాజకీయ విమోచకుడిగా కాకుండా శాంతియుత సార్వత్రిక రాజుగా ప్రకటించాడు. అతని మాటల ద్వారా, ఈ రాజు చాలా వింతైన రాజుగా ఉన్నాడు. ఆయన గొప్ప తగ్గింపుతో వచ్చుననే విషయం మరియు ఆయన సాత్విక స్వరముతో మాట్లాడుననే విషయం ఈ రాజును చాలా వింతైన రాజుగా చూపెడుతూ ఉన్నాయి.

Application: ఇప్పుడు మన మాట్లాడుకున్న విషయాలు కేవలం యూదుల చరిత్ర మాత్రమే కాదు— మనలను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాయి.

• మనం కూడా చాలాసార్లు ఆ యూదుల్లాగే నిరుత్సాహపడుతున్నాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, ప్రార్థనలు ఆలస్యంగా నెరవేరితే, మన ప్రయత్నాలు ఫలించకపోతే—“దేవుడు నన్ను మర్చిపోయాడా?” అని సందేహపడుతున్నాం. ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు— దేని విషయములోనైనా ఆలస్యం అయ్యి నప్పుడు లేదా వైఫల్యం కలిగినప్పుడు, మన విశ్వాసం కదిలిపోతుంది. కానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, దేవుడు మౌనంగా కనిపించినా, మీ జీవితంలో ఆయన ఇన్ ఆక్టివ్ గా లేడు.

• మనం కూడా చాలాసార్లు ఆ యూదుల్లాగే దేవుని గురించి తప్పు అంచనాలు పెట్టుకుంటాం. యూదులు ఒక శక్తివంతమైన రాజకీయ రాజును ఆశించినట్లే, మనం కూడా “నా సమస్యలను వెంటనే తొలగించే దేవుడు”, “నన్ను విజయవంతం చేసే దేవుడు”, “నా జీవితాన్ని సులభం చేసే దేవుడు” అనే ఒక రకమైన “మనకు నచ్చిన దేవుడుని” ఊహించుకుంటాం. కానీ దేవుడు మన అంచనాల ప్రకారం పని చేయడు—ఆయన తన ప్రణాళిక ప్రకారం పని చేస్తాడు. కాబట్టి మనం దేవుని తప్పుగా అనుకోకుండా, మన ఆలోచనలను దేవుని వాక్యానికి సరిపడేలా మార్చుకోవల్సి ఉన్నాం.

• ఆనాటి యూదులను తప్పు త్రోవ పట్టించినట్లుగా ఈ లోక ప్రభావం మరియు సాతాను ఈ రోజు కూడా మన దృష్టిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. యూదుల దృష్టి ఆధ్యాత్మిక రక్షణ నుండి రాజకీయ శక్తి వైపు మళ్లినట్లే, మన దృష్టి కూడా దేవుని రాజ్యం నుండి భౌతిక విజయాలపైకి మళ్లిస్తున్నాయి. “పేరు, డబ్బు, స్థానం” ఇవే ముఖ్యమని ఈ ప్రపంచం చెబుతుంది. కానీ నిజమైన విజయం హృదయ మార్పులో ఉందని, దేవునితో సమాధానంలో ఉందని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు.

• ఈ రోజు ప్రపంచం గొప్పదనాన్ని శక్తి, ప్రదర్శన, ఆధిపత్యంతో కొలుస్తుంది. అలాంటి పరిస్థితుల నడుమ మనం “దేవుని బిడ్డగా జీవిస్తున్నామా?” అని ప్రశ్నించుకోవల్సి ఉన్నాం.

• యూదుల పరిస్థితి బలహీనంగా ఉన్నా, దేవుడు ఒక గొప్ప రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా, ప్రస్తుతం చిన్నగా, బలహీనంగా, అసంపూర్ణంగా కనిపించే పరిస్థితుల వెనుక దేవుడు గొప్ప కార్యాన్ని సిద్ధం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం దృష్టిని ప్రస్తుత సమస్యలపై కాకుండా, దేవుని వాగ్దానాలపై పెట్టవలసి ఉన్నాం.

ఈ రోజు మనం ఏ రకమైన రాజును కోరుకుంటున్నాం? సమస్యలను మాత్రమే పరిష్కరించే రాజునా? లేక మన హృదయాన్ని మార్చి నిజమైన శాంతిని ఇచ్చే రాజునా? జెకర్యా చెప్పిన రాజు మన అంచనాలకు భిన్నమైనవాడు—కానీ మనకు అవసరమైన నిజమైన రక్షకుడు.

యేసు ఎంతో వింతైన రాజుగా ఉన్నాడు

1. ఆయన గొప్ప తగ్గింపుతో వస్తాడు

2. ఆయన సాత్విక స్వరముతో మాట్లాడతాడు

1

జెకర్యా ఏవిధముగా ఈ ప్రవచనాన్ని ప్రారంభించాడో చూడండి. సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. అతని కాలములోని ప్రజలకు ఈ మాటలు గుచ్చుకొని ఉంటాయి. ఎందుకంటే, ఇశ్రాయేలు చరిత్రలో అది వారికెంతో కష్టకాలం. అప్పుడే వాళ్ళు చెరనుండి వారి స్వదేశానికి తిరిగి వచ్చారు. వారి జీవితాలు వాళ్ళు అనుకున్నట్లుగా లేవు. వారు ప్రేమించిన వారి పట్టణము శిధిలమయ్యింది. వారి మందిరం నాశనం చెయ్యబడింది. వాటిని కట్టాలన్న వారి ప్రయత్నాలు వారి శత్రువుల చేత అడ్డగింపబడుతూ ఉన్నాయి. అది వారికీ చీకటి కాలంగా ఉంది. వారి జీవితాలలో సంతోషమనేది లేదు, ఉల్లాసము కూడా లేదు. కాని ఆయన తన ప్రజలను సంతోషముతో ఉల్లాసములో ఉప్పొంగమని ఆజ్ఞాపించాడు. సంతోషము ఉల్లాసము అనే మాటలకు ప్రవక్త ఇక్కడ వాడిన చిత్రము, సంతోషముతో ఉల్లాసముతో గంతులు వేయుడని, కేకలు పెట్టుడని అర్ధం. ఎందుకు బహుగా సంతోషించుచు ఉల్లాసముగా ఉండాలి? అనే ప్రశ్నకు, అతడు, ఎందుకంటే, నీ రాజు నీయొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. “నీ రాజు” అని అంటున్నాడు. నీ సొంత రాజు, చాలా కాలంగా వాగ్దానం చేయబడిన వాడు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాడు, దేవుడు వారికి “రాజు”గా వాగ్దానం చేసిన వాడు, వారి యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు.

    వారి అనిశ్చితిలో సంతోషించుమని దేవుడు చెప్పడానికి కారణమేమై ఉండొచ్చు? దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మరచిపోడని ఆయన వారిని మర్చిపోలేదని, తన ప్రజలకు రక్షణను తీసుకొచ్చే రాజును పంపుతానని వాగ్దానము చేసాడు. ఆయనను పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన వారితో మాట్లాడుతున్నాడు.

    ఈ మాటలను ఆలకిస్తూవున్న వారికీ రాజు వచ్చుచున్నాడనే విషయము ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ఎందుకంటే, ఆ కాలములో వారికి రాజు లేడు. వారి చివరి రాజు హిజ్కియా. అతడు వారితో పాటు చెరలోనికి వెళ్లి అక్కడనే మరణించాడు. అక్కడితో రాజుల వంశావళి సమాప్తమైపోయింది. 536 సంవత్సరంలో వారు పాలస్తీనాకు తిరిగి వచ్చినపుడు వారికి రాజు లేడు. కాని ఇప్పుడు జెకర్యా వారి రాజు వారి యొద్దకు వచ్చుచున్నాడని చెప్తున్నాడు. ఇది వారిని ఎంతో ఆశ్చర్య పర్చి ఉండొచ్చు.

    ఆయన వచ్చే విధానము కూడా ఆయన స్పష్టపర్చాడు. ఆ రాజు వచ్చుచున్న విధానము వారిని ఎంతగానో ఆశ్చర్యపర్చి ఉండొచ్చు. జెకర్యా చెప్తున్న ప్రకారము, ప్రపంచాన్ని గర్వంగా విధ్వంసకరంగా జయించిన వారిలా కాకుండా, ఈ రాజు గుర్రం ఎక్కి రాడు. ఆయన దీనుడునై, గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. రాజు ఇలా రావడాన్ని ఎవరు ఊహించరు, అసలు అనుకోరు. అలాగే ఆ కాలములో, రాజు గాడిదను ఎక్కి తమ ప్రజల యొద్దకు వచ్చే వాళ్ళు కారు. అదెలా ఉంటుందంటే, ప్రధాన మంత్రి గారు డొక్కు సైకిలును ఎక్కి మన దగ్గరకు వస్తున్నట్లుగా ఉంది. జెకర్యా ఇక్కడ చెప్తున్న రాజు భలే వింతైన రాజుగా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతూ వున్న రాజు వారి ఎక్సపెక్టషన్స్కి అస్సలు దగ్గరగా కూడా లేడు.

    ఆయన తగ్గింపుతో ఎందుకని వస్తాడో అర్ధంచేసుకోవాలంటే ఆయన రాకడ యొక్క ఉధ్దేశ్యాన్ని మనం దేవుని వైపు నుండి చూడాలి. జెకర్యా ఆ విషయాన్ని గురించి చెప్తూ, నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును అని ఆయనను గురించి చెప్పాడు. ఆయన నీతిపరుడు అంటే ఆయన తన స్వభావములో, ఖచ్చితముగా పాపము లేనివాడని, ఆయన పాపం చేయడని, నైతికంగా పరిపూర్ణుడని సత్యం, న్యాయం పాటిస్తాడని, ప్రజలకు న్యాయం చేస్తాడని, చెప్తున్నాడు.

    రాజు నీతిమంతునిగా రావడం పాపాత్మకమైన మానవునికి ఆనందానికి కాదు, భయానికి కారణం అవుతుంది. అయితే దీనుడై అనే మాట ఎంతో ఓదార్పును కలుగజేస్తూ ఉంది.

    మెస్సయ్యా రాజు నీతిమంతునిగా రావడం అంటే — ఆయన సంపూర్ణ పవిత్రుడు, పాపం లేనివాడు, న్యాయస్థుడు. ఇలాంటి నీతిమంతుడైన రాజు ముందు ఆయన పాలనలో పాపాత్మకమైన మనిషి నిలబడితే సహజంగా భయం కలుగుతుంది. ఎందుకంటే: మనం పాపులు, మన జీవితంలో లోపాలు ఉన్నాయి, దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించలేకున్నాం. మన పాపాన్ని ఒప్పుకొనేటట్లు చెయ్యడమే కాకుండా తలదించుకొనేటట్లు చేస్తుంది.

    కానీ ఇక్కడే గొప్ప శుభవార్త ఉంది. “అయితే ఆయన దీనుడై” — అంటే ఆయన వినయంతో, సౌమ్యతతో, కరుణతో వస్తాడని ప్రకటింపబడటం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది. ఎందుకంటే: ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. మనలను ఆయన దగ్గరకు పిలవడానికి వచ్చాడు. దీనుడై అనే మాట, 👉 ఈ రాజు కఠినమైన న్యాయాధిపతి కాదు, మనల్ని అర్థం చేసుకునే కరుణగల రక్షకుడు అని చెప్తుంది.

    ఉదాహరణ: వ్యభిచారంలో పెట్టబడిన స్త్రీ.

    ఆయన రక్షణగలవాడుగా అంటే కాపాడువానిగా విడిపించువానిగా వచ్చుచున్నాడని, దేవుడు ఆయనకు విజయం ఇస్తాడని, ఆయన ప్రజలకు రక్షణ తీసుకొస్తాడని, నిజమైన రక్షణ దేవుని నుంచే వస్తుందని, మనుషుల శక్తి కాదు, దేవుడు ఇచ్చే రక్షణే నిజమైనదని ఆయన ఈ ప్రవచనంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ రక్షణ రాజకీయ రక్షణ కాదు; ఇది పాపం నుండి రక్షణ. ఎందుకంటే మనుష్యుల అసలు సమస్య శత్రువులు కాదు, పాపం. పాపం మనలను దేవుని నుండి దూరం చేసింది. ఈ రాజు ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. ఆయన న్యాయం చేసే రాజు, సత్యం మీద నిలబడే రాజు.
    దేవుని ఉద్దేశ్యములో ఆయన వారికీ నిజమైన స్వేచ్ఛను దయచేయడానికి తన నీతితో వారిని రక్షించడానికి వచ్చుచున్నాడు, తప్ప వారు ఎదురుచూస్తున్న విధంగా కాదు. వారి ఆలోచన/ వారి ఆరాధనా ద్వారా వాళ్ళు దేవుని ఉద్దేశ్యాన్ని రూపించలేరు. ఇదే సువార్త యొక్క bueaty: నీతిమంతుడైన ఈ రాజే, మనలను రక్షించడానికి దీనుడై మన దగ్గరకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు.

    పురాతన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్తే → గుర్రం ఎక్కేవారు, అది వారి శక్తి, యుద్ధసిద్ధత, గర్వాన్ని చూపించేది. ఒక రాజు గాడిదపై ప్రయాణించడం అనేది చాలా అసాధారణం. శాంతి కోసం వస్తే → గాడిద ఎక్కేవారు. ఈ రాజు యుద్ధం కోసం కాదు, శాంతి కోసం వస్తున్నాడు. ఆయన దీనుడై గాడిద మీద రావటం ద్వారా ఆయన ఎంత చేరదగినవానిగా ఉన్నాడో చూడండి. గాడిద సాధారణంగా శాంతి, వినయం, commonness కి గుర్తు. అందుకే, సాధారణ రాజకీయ రాజ్యాలకు చెందిన రాజులు గాడిదపై రావడం దాదాపు కనిపించదు.

    ఈ రాజు సాధారణ భౌతిక రాజ్యాలలాంటి రాజు కాడు. ఆయన రాజ్యం సైనిక శక్తి మీద, రాజకీయ అధికారంపై ఆధారపడినది కాదు. ఆయన రాజ్యం దేవుని రాజ్యం, అంటే ఆధ్యాత్మిక రాజ్యం. ఇందువల్ల, ఈ ప్రవచనం యూదుల ఆలోచనలను మార్చడానికి ఇవ్వబడింది. వారు ఒక సైనిక రాజు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ దేవుడు చెప్పినది ఏమిటంటే — రాబోయే మెస్సీయ ఒక సాధారణ రాజకీయ రాజు కాదు.

    ఆయన ఒక ప్రవక్త-రాజు: ప్రవక్తలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. రాజులా పాలిస్తాడు. కానీ ఆయన పాలన శాంతి, నీతి, కరుణ మీద ఆధారపడుతుంది. అందుకే గాడిదపై రావడం ఒక సంకేతం: 👉 ఈ రాజు భౌతిక యుద్ధం చేయడానికి కాదు. 👉 ప్రజలను రక్షించడానికి, దేవుని దగ్గరకు తీసుకురావడానికి వస్తాడు.

    దేవుడు ముందుగానే తన ప్రణాళికను ప్రకటించాడు. ఈ ప్రవచనం క్రీస్తుకు వందల సంవత్సరాల ముందే చెప్పబడింది. దేవుడు చరిత్రను నియంత్రిస్తున్నాడు.

    Application: ఇప్పుడు మన మాట్లాడుకున్న విషయాలు కేవలం యూదుల చరిత్ర మాత్రమే కాదు— మనలను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాయి.

    • ఆ కాలంలో యూదుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది—పట్టణం పాడైపోయింది, రాజు లేడు, భవిష్యత్తు స్పష్టంగా లేదు. అయినా దేవుడు “సంతోషించండి” అని ఆజ్ఞాపించాడు. ఇదే విషయము మనకూ వర్తిస్తుంది. ఈ రోజు మన జీవితంలో సమస్యలు, అనిశ్చితి, ఒత్తిడి ఉన్నప్పటికీ, మన ఆనందం పరిస్థితులపై ఆధారపడకూడదు— క్రీస్తు మీద ఆధారపడాలి.

    • అలాగే, దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు— మనం ఆయనను చూడనప్పటికిని మనం ఆయనను నమ్మవల్సి ఉన్నాం. ఆనాటి యూదులకు రాజు కనిపించలేదు, కానీ దేవుడు “నీ రాజు వచ్చుచున్నాడు” అని చెప్పాడు. వారు చూడలేక పోయినా, దేవుడు వారి జీవితాలలో తన ప్రణాళికను అమలు చేస్తూనే ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా చాలా విషయాలు కనిపించకపోయినా, దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు.

    • అలాగే, మనం దేవుని గురించి పెట్టుకున్న అంచనాలను చెక్ చేసుకొందాం. యూదులు ఒక శక్తివంతమైన సైనిక రాజును ఆశించారు. కానీ దేవుడు వినయమైన, గాడిదపై వచ్చే రాజును పంపించాడు. అలాగే మనం కూడా “నా సమస్యలను వెంటనే తీర్చే దేవుడుగా” యేసు ఉండాలని మనం ఆశిస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం దేవునిని మన అభిరుచికి తగ్గట్టుగా కాదు—ఆయన వాక్యానికి తగ్గట్టుగా దేవునిని అర్థం చేసుకొందాం.

    • అలాగే, మెస్సయ్య యొక్క స్వభావాన్ని మన జీవితంలో ప్రతిబింబించవల్సి ఉన్నాం. ఈరోజు ప్రపంచం గర్వం, పోటీ, శక్తి మీద నడుస్తోంది. కానీ క్రైస్తవునిగా మనం వినయంతో, కరుణతో, శాంతితో జీవిధ్ధాం. ఇది సులభం కాదు, కానీ ఇదే క్రీస్తు మార్గం.

    • అలాగే, యూదులు తమ శత్రువుల నుండి విమోచనం కోరుకున్నారు. యూదులలాగే మనం కూడా బయట సమస్యలపై డబ్బు, ఆరోగ్యం, సంబంధాలపై మాత్రమే— దృష్టి పెడుతున్నాం. కానీ మన అసలు సమస్య పాపం. కాబట్టి మనకు అవసరమైనది పరిస్థితుల మార్పు కాదు—హృదయ మార్పు.

    యేసు దగ్గరకు ధైర్యంగా రండి. ఆయన నీతిమంతుడు. ఆయన శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి 👉 మీ కష్టాల్లో కూడా దేవుడిచ్చే ఆనందాన్ని ఎంచుకోండి. 👉 కనిపించకపోయినా దేవుని ప్రణాళికను నమ్మండి. 👉 మీ అంచనాలను దేవుని సత్యంతో సరిచేసుకోండి. 👉 వినయంతో, శాంతితో జీవించండి. 👉 యేసుని మీ నిజమైన రాజుగా స్వీకరించండి. అప్పుడు మాత్రమే ఆ రాజు మన దగ్గరకు వచ్చినందుకు మనం నిజంగా ఆ సంతోషం, శాంతి, విమోచన అనుభవించగలుగుతాం.

    2

    9:10, ఆయన ఏ విధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడో వివరిస్తుంది. జెకర్యా దానిని గురించి చెప్తూ, ఎఫ్రాయిములో రథ -ములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీ -సు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును.

    ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ఎఫ్రాయిము అతి పెద్ద తెగ. ఇశ్రాయేలు చరిత్రలో ఎఫ్రాయిమ్ తెగ ముఖ్యమైన పాత్ర పోషించింది, దక్షిణానికి వ్యతిరేకంగా తిరుగుబాటులో 10 ఉత్తర తెగలకు నాయకత్వం వహించి ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించింది. జెకర్యా కాలములో ఎఫ్రాయిము ఇక లేదుకదా, మరి ఎందుకు దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ “ఎఫ్రాయిము” అనే పదం కేవలం ఒక తెగను మాత్రమే సూచించదు. అది మొత్తం ఉత్తర రాజ్యానికి (ఇశ్రాయేలు) ప్రతీకగా ఉపయోగించబడింది. జెకర్యా ఇక్కడొక ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు: 👉 దేవుడు కేవలం యూదాను మాత్రమే కాదు, 👉 ఒకప్పుడు విడిపోయిన మొత్తం ఇశ్రాయేలు ప్రజలను (ఉత్తరం + దక్షిణం) తన ప్రణాళికలో చేర్చియున్నాడని చెప్పాడు. అందుకే “ఎఫ్రాయిములో రథములుండకుండ… యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ…” అని చెప్పడం ద్వారా, దేవుడు రెండు భాగాలను కలిపి మాట్లాడుతున్నాడు. ఇది పునరేకీకరణ (reunification) యొక్క సంకేతం.

    అదే కాకుండా, “రథములు, గుఱ్ఱములు, యుద్ధపు విల్లు” అనేవి యుద్ధోపకరణములు. అవి యుద్ధశక్తి, సైనిక బలం గురించి మాట్లాడుతున్నాయి. దేవుడు యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలను తీసివేస్తాను” అనడం ద్వారా దేవుడు ఒక గొప్ప సత్యం చెబుతున్నాడు: 👉 ఇకమీదట రక్షణ సైనిక శక్తిలో కాదు, మెస్సీయ ద్వారా వచ్చే శాంతి రాజ్యంలో ఉంటుందని, రక్షణకై ప్రజలకు యుద్ధ సంబంధమైన ఇతరములు అవసరంలేదని, దేవుని రాజ్యం సైనిక శక్తిపై ఆధారపడదని చెప్పాడు.

    ఆయన పాలన సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు ఉండునని అతడు తెలియజేశాడు. ఇది రాజు యొక్క విశ్వవ్యాప్త రాజ్యాన్ని సూచిస్తుంది. అర్థం: ఆయన రాజ్యం ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచమంతటికి వ్యాపిస్తుందని, ఆయన సమాధానమును అనుభవించని ఏ ప్రదేశము కూడా భూమి మీద ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కాపాడటానికి తిరిగి దేవునితో సమాధానానికి తేవడానికి ఆయన వచ్చాడు. ఈ రాజ్యం యొక్క ముఖ్య లక్షణం సమాధానం. ఈ రాజ్యం ప్రేమ, క్షమ, శాంతి మీద నిలబడింది.

    ఆ రాజు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము భూమి ఈ చివరినుండి ఆ చివరి వరకు నేడు విస్తరించబడి ఉంది. ఇక భయపడనవసరం లేదు మనం దేవుని కృప క్రింద ఉన్నాం. ఆయన అసాధారణ యుద్ధముతో మనం సమాధానంతో దేవుని దగ్గరకు తిరిగి వచ్చియున్నాం. ఈ రాజును ఇప్పుడు ఇపుడు విశ్వాసముతో అంగీకరించండి.

    Application: ఇప్పుడు మన మాట్లాడుకున్న విషయాలు కేవలం యూదుల చరిత్ర మాత్రమే కాదు— మనలను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాయి.

    • జెకర్యా చెప్పినట్లుగా “రథములు, గుఱ్ఱములు, యుద్ధపు విల్లు” అన్నవి మానవ శక్తి, భద్రతకు సూచికలు. మన భద్రత ఎక్కడ ఉంది? ఈరోజు మన “రథములు” —డబ్బు, ఉద్యోగం, పరిచయాలు, టెక్నాలజీ, మన ప్రతిభ. ఇవన్నీ అవసరమే కానీ నిజమైన భద్రత వీటిలో లేదు. నిజమైన రక్షణ మన బలంలో కాదు, ఆయన సమాధానంలో ఉంది. కాబట్టి మనం మన విశ్వాసాన్ని మన వనరులపై కాకుండా దేవునిపై ఉంచుదాం.

    • అలాగే, మన జీవితంలో “యుద్ధ మనస్తత్వం” నుండి “సమాధాన మనస్తత్వం”కి మనం మారవల్సి ఉన్నాం. ఈ రోజు ప్రపంచం పోటీ, పోలిక, గెలవాలి అనే ఆలోచనతో నడుస్తోంది. కుటుంబాల్లో, పనిస్థలాల్లో, సేవలో కూడా చిన్న చిన్న గొడవలు, అహంకారం, అసూయ ఉన్నాయి. కానీ మన రాజు యుద్ధాన్ని తొలగించి సమాధానాన్ని స్థాపించాడు. కాబట్టి మనం 👉 మనం గొడవలను పెట్టెవారీగా/పెంచేవారిగా ఉన్నామా? లేక సమాధానాన్ని తెచ్చేవారిగా ఉన్నామా? అని ప్రశ్నించుకోవల్సి ఉన్నాం. మన మాటల్లో, మన నిర్ణయాల్లో, మన సంబంధాల్లో ఆయన సమాధానం ప్రతిబింబించాలి.

    • అలాగే, దేవుని రాజ్యం అందరికీ చెందినదని గుర్తించాలి. “ఎఫ్రాయిము + యెరూషలేము” అని చెప్పడం ద్వారా దేవుడు విడిపోయిన వారిని కూడా తన ప్రణాళికలో చేర్చాడు. ఈ రోజు కూడా వర్గాలు, కులాలు, భాషలు, సంఘాలు అనే భేదాలు ఉన్నాయి. కానీ దేవుని రాజ్యంలో అందరూ ఒకటే. కాబట్టి మనం ఐక్యతను నిర్మిధ్ధాం.

    • అలాగే, దేవుని ప్రణాళిక మనం ఊహించిన దానికంటే పెద్దదని గుర్తిధ్ధాం. అలాగే మనం కూడా కొన్నిసార్లు చిన్నగా ఆలోచిస్తాం—“నా కుటుంబం, నా పని, నా సమస్యలు” మాత్రమే అని. కానీ దేవుడు మన జీవితాన్ని ఒక పెద్ద ప్రణాళికలో ఒక భాగం చేసి ఉండొచ్చు. కాబట్టి మన పరిమిత దృష్టి కాకుండా దేవుని విశాల దృష్టిని నమ్ముదాం.

    • అలాగే, నిజమైన సమాధానం ఏమిటో అర్థం చేసుకొందాం. ప్రపంచం ఇచ్చే సమాధానం తాత్కాలికం—సమస్యలు లేకపోతేనే అది ఉంటుంది. కానీ ఈ రాజు ఇచ్చే సమాధానం హృదయంలో ఉంటుంది—even in problems. అది దేవునితో సంబంధం పునరుద్ధరించబడినప్పుడు వస్తుంది. కాబట్టి మనం బయట పరిస్థితులు మారాలని మాత్రమే కాదు—మన హృదయం దేవునితో సరిగా ఉండాలని కోరుకొందాం.

    అలాగే, మనం ఈ రాజ్యానికి సాక్షులుగా జీవిధ్ధాం. ఈ రాజ్యం ప్రేమ, క్షమ, శాంతి మీద నిలబడింది. కాబట్టి మన జీవితంలో: 👉 క్షమించడం నేర్చుకోవాలి, 👉 ప్రేమతో ప్రవర్తించాలి, 👉 శాంతిని పంచవల్సి ఉన్నాం. అప్పుడు మనం కేవలం ఈ సందేశాన్ని వినేవాళ్ళం గా కాకుండా —ఆ రాజ్యాన్ని అనుభవించే వాళ్ళంగా ఉంటాం.

    చివరిగా, ఒక ప్రశ్న: మీరు ఎలాంటి రాజును కోరుకొంటున్నారు? శక్తివంతమైన రాజునా? మీ కోరికలను నెరవేర్చే రాజునా? లేక పాపం నుండి రక్షించి, దేవునితో సమాధానం కలిగించే దీనుడైన రాజునా? ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును, అని యేసు పిలుస్తున్నాడు. కాబట్టి, మనం ఈ వింతైన రాజును—యేసు క్రీస్తును—మన జీవితాల్లో రాజుగా అంగీకరిద్దాము. ఆయన తగ్గింపును అనుసరిధ్ధాం. ఆయన ఇచ్చే శాంతిని స్వీకరిధ్ధాం. ఆయన ద్వారా మాత్రమే మనం దేవునితో సమాధానంలో జీవించగలం. ఇదే ఈ ప్రవచనం యొక్క సారాంశం. ఇదే మనకు దేవుడిచ్చిన శుభవార్త. ఆమెన్.

    దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంలో దానిని భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

    KURAPATI VIJAY KUMAR,
    HDFC BANK, Account no 50200096563465,
    IFSC code. HDFC0005872,
    Swift code HDFCINBB,
    JKC College Road Branch, GUNTUR 522006,
    ANDHRA PRADESH, INDIA.
    The phone pay UPI Id : 9848365150-2@ybl