మత్తయి సువార్త 1

అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, 1-17 (లూకా 3:23-38; రూతు 4:18-22; 1 దినవృత్తాం. 3:10-17)

మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం. ఇది యేసుక్రీస్తు జననం మరియు ఆయన వంశావళికి సంబంధించిన దేవుని రికార్డు. మత్తయి మొదట నుండే యేసు “దావీదు కుమారుడు” అని చూపిస్తున్నాడు. “దావీదు కుమారుడు” అనేది వాగ్దానం చేయబడిన రక్షకుడైన మెస్సీయకు ఉపయోగించిన ప్రత్యేకమైన బిరుదు.

మత్తయి యేసు నిజంగా దావీదు వంశానికి చెందినవాడని, అలాగే యేసు యొక్క చట్టబద్ధ తండ్రియైన యోసేపు కూడా దావీదు వంశస్థుడేనని నిరూపిస్తున్నాడు. దీని ద్వారా యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని స్పష్టం చేస్తున్నాడు.

పాత నిబంధన ప్రవచనాలు ఆయనను ఆ పేరుతో సూచించాయి కాబట్టే యూదులు మెస్సీయను “దావీదు కుమారుడు” అని పిలిచేవారు. మత్తయి 9:27, యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. మత్తయి 12:23, అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి. మత్తయి 21:9, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

దేవుడు అబ్రాహాము మరియు దావీదుకు ప్రత్యేకమైన వాగ్దానాలు చేశాడు. అందుకే మత్తయి ఈ ఇద్దరి పేర్లను ప్రారంభంలో పేర్కొన్నాడు. దీని ద్వారా యూదులకు దేవుని వాగ్దానాలు యేసులో నెరవేరాయని గుర్తుచేస్తున్నాడు.

మత్తయి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాలను తెలిసిన యూద క్రైస్తవుల కోసం ఈ సువార్తను వ్రాశాడు. యేసు అబ్రాహాము మరియు దావీదు వంశంలో జన్మించాడని చూపించడం ద్వారా, యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ధృవీకరిస్తున్నాడు.

మత్తయి యేసు వంశావళిని మూడు ప్రధాన భాగాలుగా విభజించాడు. ప్రతి భాగంలో 14 పేర్లు ఉన్నాయి. ఇవి ఇశ్రాయేలు చరిత్రలోని మూడు కాలాలను సూచిస్తాయి మరియు సులభంగా గుర్తుంచుకోవడానికి ఇలా ఏర్పరచబడ్డాయని భావిస్తారు.

మొదటి భాగం (2–6 వచనాలు) దేవుని ప్రత్యక్ష పరిపాలన కాలాన్ని సూచిస్తుంది (Theocracy).

V 2-6_ అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; 3యూదా తామారు నందు పెరెసును, జెరహును కనెను; పెరెసు ఎస్రోమును కనెను, 4ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; 5నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; 6యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను.

యూదులు తమ పితరుడైన అబ్రాహామును గురించి, మరియు దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాల గురించి చాల గర్వపడుతూ ఉంటారు. అబ్రాహాము వారసుల నుండి మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురుచూసారు. కాని దురదృష్టవశాత్తు, వాళ్ళ “కాన్సెప్ట్ అయిన మెస్సయ్య” శతాబ్దాలుగా వక్రీకరింపబడటం మూలాన్న వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యాన్ని బలమైన రాజ్యముగా తిరిగి నెలకొల్పి దావీదు సింహాసనము నుండి పాలించే ఒక పొలిటికల్ మెస్సయ్య కొరకు చూడటం మొదలుబెట్టారు. వారు మెస్సయ్యను రాజకీయ విమోచకుడిగా — భౌతిక శక్తితో శత్రువులను ఓడించే శక్తివంతమైన రాజుగా ఊహించారు. ఆయన ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరించి, యూదులను వాగ్దాన భూమికి తెచ్చి, యెరూషలేములో ఆలయాన్ని తిరిగి నిర్మించి, ప్రపంచానికి శాంతిని తీసుకురావాలని వారు ఆశించారు. ఈ ఆశలు ఇశ్రాయేలు యొక్క గత కీర్తిని పునఃస్థాపించాలనే తపనను ప్రతిబింబిస్తాయి. కాని ఇలాంటి మెస్సయ్యను దేవుడు వారికి వాగ్దానము చెయ్యలేదు.

మత్తయి సువార్త యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, యూదులకు దేవుని మెస్సియానిక్ వాగ్దానాలను గుర్తుచేయడం, వారి అంచనాలు తరచూ దేవుని వాగ్దానాలకు విరుద్ధంగా ఉన్నాయని చూపించడం మరియు దేవుని ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్య ఖచ్చితంగా ఈ యేసేనని వారిని ఒప్పించడం.

  1. ఈ విభాగములో నలుగురు స్త్రీలు పేర్కొనబడ్డారు, తామారు, రాహాబు, రూతు, బత్షెబా.
  2. ఎందుకని వాళ్ళు ఈ వంశావళిలో చేర్చబడ్డారు?
  3. ఎందుకని మత్తయి బత్షెబా పేరును చెప్పకుండా ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, అని చెప్పాడు?

తామారు వ్యభిచారిణిలా ప్రవర్తించిన కనానీయురాలు, ఆదికాండము 38:6-30, సంఖ్యాకాండము 26:20,21లో పేర్కొనబడింది. రాహాబు (అన్యురాలు, యెరికోలోని వ్యభిచారిణి) యెహోషువ 2:1-24; 6:17-25లో పేర్కొనబడింది. ఆమె ఇశ్రాయేలు దేవునిని గూర్చి తెలుసుకుంది. ఆమె విశ్వాసము, ఆ విశ్వాసపు ఫలాలు మన అందరి కొరకు ఉదాహరణలుగా హెబ్రీ 11:31; యాకోబు 2:25లో పేర్కొనబడ్డాయి. రూతు ఒక అన్యజాతి స్త్రీ, మోయాబీయురాలు (లోతు పెద్ద కుమార్తె తన తండ్రి అయిన లోతుతో అతనికి తెలియకుండా నెరపిన అశ్లీల సంబంధం ద్వారా వచ్చిన మోయాబియులలో ఒకరు), ఆదికాండము 19:36,37; రూతు 1-4 అధ్యాయములలో పేర్కొనబడింది. బత్షెబా హిత్తీయుడైన ఉరియా భార్య. దావీదు ఆమెను ఇష్టపడి ఆమెను తన కోసం తీసుకొన్నాడు. ఉరియాను యుద్ధంలో చంపించాడు. ఈమె 2 సమూయేలు 11, 12; 1 రాజులు 1,2 అధ్యాయాలలో పేర్కొనబడింది.   

రక్షకుడి పూర్వీకులలో ఇటువంటి తీవ్రమైన నైతిక లోపాలున్న వ్యక్తులు ఉండటం షాకింగ్ గా అనిపిస్తుందా? ఈ పేర్లను ఈ వంశవృక్షంలో రికార్డ్ చేయడానికి పరిశుద్ధాత్మ మత్తయిని ప్రేరేపించకపోతే బాగుండేదని అనుకుంటున్నారా? అసౌకర్యంగా ఉందా? అయితే దేవుడు ఈ పేర్లను బైబిల్లో ఎందుకని ఉంచాడు? బైబులు, ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి అని రోమా 3:23,11,12 లో చెబుతుంది. ఈ పాపులతో కూడిన వంశంలో యేసు జన్మించడం ఒక గొప్ప సువార్తను ప్రకటిస్తుంది: యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టే మత్తయి 9:13లో యేసు, నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పాడు. ఇది మనకు ఓదార్పును ఇస్తుంది. మన పాపాల వల్ల యేసు మనల్ని తిరస్కరించడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు. ఆయన రక్తం ప్రపంచపు పాపాల కొరకు కార్చబడింది. ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడటమే (రోమా 3:24) మెస్సయ్య రాకడ ఉద్దేశ్యమని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.

దావీదు గురించి చెప్పేటప్పుడు మత్తయి “ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను” అని ప్రత్యేకంగా చెబుతున్నాడు. దీని ద్వారా దావీదు చేసిన పాపాన్ని గుర్తుచేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు దావీదును కృపలో క్షమించి యున్నాడనే విషయాన్ని మరచిపోకూడదని, కృపలో దేవుడు తాను వాగ్దానము చేసియున్న రీతిగా పాపులైన వారినందరిని క్షమించడానికి రక్షించడానికి యేసును పంపాడని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.

  • 2-6 వచనాలలోని విశ్వాసపు వీరులు మత్తయి పాఠకులకు మనకు నేడు వేటిని గుర్తు చేస్తున్నారు?

వారి విశ్వాసం రాబోయే రక్షకుడైన క్రీస్తుపైనే ఉండేది. అలాగే మన రక్షణ కూడా యేసుక్రీస్తులోనే ఉంది.

V 7-11_ సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; 8ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; 9ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; 10హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; 11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

మత్తయి యేసుక్రీస్తుని వంశావళిని మూడు భాగములుగా విభజించాడు. మొదటి భాగం దేవుని ప్రత్యక్ష పాలన క్రింద ఉన్న కాలాన్ని సూచిస్తుంది. దీనిని సాధారణంగా “థియోక్రసీ” (Theocracy) అంటారు. ఆ సమయంలో దేవుడు ప్రవక్తలు, న్యాయాధిపతులు మరియు తన వాక్యము ద్వారా (దైవికమైన మార్గదర్శకత్వము ద్వారా) ప్రజలను నడిపించాడు. ప్రజలు దేవుని పాలన క్రింద ఉండే వాళ్ళు. ఇక్కడ విశ్వాసమే ప్రధానము. ప్రజలు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డారు.

కాని తరువాత ఇశ్రాయేలీయులు ఇతర జనముల వలె ఒక మానవ రాజును కోరుకున్నారు (monarchy). దేవుని పాలనను వద్దనుకుని ఇశ్రాయేలీయులు రాజరికపు వ్యవస్థ క్రింద ఉండటాన్ని ఇష్టపడ్డారు. ఇది ఇశ్రాయేలీయుల హృదయస్థితిని చూపిస్తుంది. వారు దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచకుండా, కనిపించే మానవ నాయకత్వాన్ని కోరుకున్నారు.

ఆ క్రమములో మాకు రాజును నియమింపుమని ఇశ్రాయేలీయులు అప్పటి ప్రవక్తయైన సమూయేలును అడిగారు. ప్రవక్తయైన సమూయేలు హర్ట్ అయ్యి ఈ విషయాన్ని దేవుడైన యెహోవా ముందు పెట్టినపుడు, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా– సమూయేలు, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు అని చెప్పిన విషయం 1 సమూయేలు 8:6,7లో ఉంది.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి: రాజరిక వ్యవస్థ పూర్తిగా దేవుని యోచనకు బయటది కాదు. దేవుడు ముందుగానే ఇశ్రాయేలుకు రాజులు ఉంటారని ధర్మశాస్త్రంలో చెప్పాడు (ద్వితీయోపదేశకాండము 17:14–20). కానీ ప్రజలు రాజును కోరిన విధానం అవిశ్వాసంతో నిండింది. వారు దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉండటం కంటే, ఇతర జనముల వలె ఉండాలని కోరుకున్నారు.

ఆయన ప్రజలు ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాని ఆయన తన ప్రజల కోరిక మేరకు వారు అడిగినట్లుగా వారికి రాజులను ఇచ్చాడు. ఆ రాజులలో ఒక రాజైన దావీదును తన వాగ్దానాన్ని మోసేవాడిగా ప్రభువు పూర్వీకుడిగా ఎన్నుకున్నాడు. ఆ లైన్ ని ఆయన ఏవిధముగా కాపాడాడో, సంరక్షించాడో, దేవుడు ఇశ్రాయేలీయుల రాజుల చరిత్రలో ఏవిధముగా జోక్యం చేసుకొన్నాడో, ఇశ్రాయేలీయులను వారి మొండితనాన్ని మరియు దేవుని చిత్తాన్ని ఎదిరించే వారి స్వభావం వీటిమధ్య దేవుడు తన చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చుకొన్నాడో జ్ఞాపకం చేసుకొండని మత్తయి ఇశ్రాయేలీయులకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.

ఇశ్రాయేలు చరిత్రలో రాజుల పాపాలు, విగ్రహారాధన, అవిధేయత కారణంగా రాజ్యం విడిపోయింది. పన్నెండు గోత్రాలలో పది గోత్రాలు ఉత్తర రాజ్యంగా విడిపోయాయి. చివరకు అవి చెరలోకి వెళ్లిపోయాయి. ఇది దేవుని వాక్యాన్ని తిరస్కరించడం ఎంత తీవ్రమైన ఫలితాలను తెస్తుందో చూపిస్తుంది.

అయితే ఈ చరిత్రలో కూడా దేవుని కృప ప్రకాశిస్తుంది. ఎందుకంటే దావీదు వంశాన్ని దేవుడు కాపాడాడు. చివరకు అదే వంశం నుండి యేసుక్రీస్తు వచ్చాడు. మనుష్యులు విఫలమైనా, దేవుని వాగ్దానం విఫలం కాదు.

ఇది మనకు ఒక హెచ్చరికను మరియు ఓదార్పును ఇస్తుంది: హెచ్చరిక ఏమిటంటే — మన స్వంత మార్గాలను దేవుని చిత్తం కంటే ఎక్కువగా కోరుకొంటే దాని ఫలితాలు బాధాకరంగా ఉంటాయి. ఓదార్పు ఏమిటంటే — మనుష్యుల పాపం మధ్యలో కూడా దేవుడు తన రక్షణ కార్యాన్ని కొనసాగించాడు. యేసుక్రీస్తు ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.

సొలొమోను వృద్ధుడైన తరువాత, అతని భార్యలు అతని హృదయాన్ని యెహోవా నుండి దూరం చేసి అన్యదేవతల వైపు త్రిప్పివేశారు, 1 రాజులు 11:4. అతడు అష్తారోతు, మిల్కోము వంటి విగ్రహ దేవతలను అనుసరించి, వాటికోసం గుళ్లు కూడా కట్టించాడు (1 రాజులు 11:5). ఇది యెహోవాకు అసహ్యమైన పని.

దీని కారణంగా రాజ్యం అతని కుమారుని చేతిలో పూర్తిగా ఉండదని, రాజ్యం చీలిపోతుందని (1 రాజులు 11:11–13) దేవుడు సొలొమోనుతో చెప్పాడు. సొలొమోను తరువాత రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది: ఉత్తర రాజ్యం — “ఇశ్రాయేలు” అని పిలువబడింది. ఇందులో పది గోత్రాలు ఉన్నాయి (ఆషేరు, దాను, ఎఫ్రాయిమ్, గాదు, ఇశ్శాఖారు, మనష్షే, నాఫ్తాలి,  షిమ్యోను, రూబేను, మరియు జెబులున్ గోత్రాలు). ఉత్తర రాజ్యంలోని రాజులు యెహోవాను విడిచిపెట్టి విగ్రహారాధనలో నడిచారు. ప్రజలు కూడా అదే మార్గంలో నడిచారు. అందువల్ల దేవుడు అస్సిరీయుల ద్వారా వారిని వారి దేశం నుండి చెదరగొట్టాడు. ఇది దేవుని తీర్పు.

దక్షిణ రాజ్యం — “యూదా” అని పిలువబడింది. ఇందులో ప్రధానంగా యూదా మరియు బెంజమిన్ గోత్రాలు ఉన్నాయి. మత్తయి యొక్క ఈ రెండవ భాగములో పేర్కొనబడిన రాజులందరూ దక్షిణ రాజ్యానికి చెందిన వారు. ఎందుకంటే మెస్సీయుడైన క్రీస్తు దావీదు వంశం ద్వారా రావలసి ఉంది.

సొలొమోను తరువాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు. అతడు కూడా తన తండ్రి చేసినట్లే విగ్రహారాధనలో నడిచాడు. దేశములో విగ్రహాలు, బలిపీఠాలు ఏర్పడ్డాయి. స్వలింగ సంపర్కులు కూడా దేశములో ఉండేవాళ్ళు. ప్రజలు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించారు. ఫలితంగా ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేముపై దాడి చేసి యెహోవా మందిరపు ఖజానాలోని వస్తువులను, రాజనగరు యొక్క ఖజానాలోని వస్తువులను తీసుకుపోయాడు (1 రాజులు 14:22–26). దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను/ ఆధిక్యతను మరియు గొప్పతనాన్ని వారు తమ పాపం వల్ల కోల్పోయారు.

తర్వాత అబీయా రెహబాము తరువాత అబీయా రాజయ్యాడు. అతడు కూడా తన తండ్రి పాపమార్గాలలోనే నడిచాడు (1 రాజులు 15:3). అతని హృదయం దేవునికి సంపూర్ణంగా అంకితం కాలేదు.

తర్వాత ఆసా ఆసా మాత్రం మంచి రాజుగా నిలిచాడు. అతడు దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు (1 రాజులు 15:11). అతడు విగ్రహాలను తొలగించాడు, ప్రజలను దేవుని వైపు మళ్లించాడు, దేశములోని దురాచారాలను తొలగించడానికి ప్రయత్నించాడు. స్వలింగ సంపర్కులను దేశములో నుండి వెళ్ల గొట్టాడు.

తర్వాత యెహోషాపాతు యెహోషాపాతు యెహోవా దృష్టికి యథార్థంగా నడిచిన రాజు. అతడు తన తండ్రియైన ఆసా మార్గంలో నడిచి దేవుని చిత్తాన్ని అనుసరించాడు, 2 దినవృత్తాంతములు 20:32. ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు అధికారులను పంపించాడు. ప్రజల ఆత్మీయ జీవితంపై పట్ల సంరక్షణను యెహోషాపాతు తీసుకోవడం గొప్ప విషయం. ఇది ఒకవైపు మాత్రమే, మరొకప్రక్క యెహోషాపాతుకు దేవుడు గొప్ప సంపదను, గౌరవాన్ని ఇచ్చినప్పటికి, ఓఫిర్ బంగారం మరియు సొలొమోను వంటి గొప్ప వ్యాపారిగా, రాజుగా, ఉంచగలిగే ప్రతిష్ట కోసం యెహోషాపాతు ఆశపడి దుర్మార్గుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసాడు, 2 దినవృత్తాంతములు 20:35-37. దేవునికి విరోధులైన వారితో కలిసినప్పుడు దాని ఫలితం నష్టం కలిగింది. అతని ఓడలు పగిలిపోయాయి.

తర్వాత యెహోరాము — యెహోరాము యూదా రాజ్యానికి రాజయ్యాడు. అతని భార్య అతల్యా — ఆమె ఉత్తర రాజ్యంలోని దుర్మార్గులైన ఆహాబు, యెజెబెలు కుమార్తె. ఈ వివాహం యూదా రాజ్యంపై చెడు ప్రభావం చూపింది. యెహోరాము ఆహాబు ఇంటి వారి చెడు మార్గాలను అనుసరించాడు. అతడు యెహోవాను విడిచిపెట్టి ప్రజలను విగ్రహారాధనలో నడిపించాడు. యెరూషలేము ప్రజలను కూడా దేవుని నుండి దూరం చేశాడు.

తరువాత అతని కుమారుడు అహజ్యా చనిపోయినప్పుడు, అతల్యా రాజ కుటుంబంలోని వారిని చంపించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇది మెస్సీయ వంశమే ఆగిపోయే ప్రమాదంలా కనిపించింది. కాని దేవుడు తన వాగ్దానాన్ని కాపాడాడు. యెహోషెబ అనే స్త్రీ — అహజ్యాకు సహోదరి — చిన్నవాడైన యోవాషును రహస్యంగా రక్షించి యెహోవా మందిరంలో ఆరు సంవత్సరాలు దాచింది (2 రాజులు 11). ఇలా దేవుడు దావీదు వంశాన్ని కాపాడాడు.

ఇది గొప్ప సత్యాన్ని చూపిస్తుంది: మనుష్యులు దేవుని యోచనను ఆపలేరు. దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చుతాడు.

అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా యెహోరాము ఇశ్రాయేలు రాజుల యొక్క చెడు నడతలను ఫాలో అయ్యాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడు. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించడమే కాకుండా యూదా వారిని విగ్రహపూజకు లోపరచాడు. యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసాడు. యెహోరాము తన పాపాల కారణంగా దేవుని తీర్పును పొందాడు. ఫలితముగా, అతడు తీవ్రమైన వ్యాధితో బాధపడి చనిపోయాడు. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు కూడా అతనికి చేయలేదు. అతడు యెవరికిని ఇష్టములేని వాడై చనిపోయాడు. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతని పాతి పెట్టారు (2 దినవృత్తాంతములు 21).

అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను అను వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేకయుండెనని 1 రాజులు 11:36 చెప్తుంది. అందుకే ఆయన దావీదు వంశాన్ని పూర్తిగా నశింపజేయలేదు.

అలాగే, యెహోరాము ఉజ్జియాకు మధ్య ముగ్గురు రాజులు ఉన్నారు: అహజ్యా, యోవాషు, అమజ్యా. మత్తయి కావాలనే ఈ ముగ్గురు రాజులను వదిలేసాడు. వీటిలో ఆల్మోస్ట్ ఒక దగ్గర మెస్సయ్యనిక్ లైన్ ఆగిపోయే పరిస్థితి.

మత్తయి తన వంశావళిలో వీరిని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. యూదుల వంశావళుల్లో కొన్ని తరాలను వదిలేయడం అసాధారణం కాదు. అతని ముఖ్య ఉద్దేశ్యం సంపూర్ణ రాజకీయ చరిత్ర ఇవ్వడం కాదు; యేసు దావీదు వంశస్థుడని చూపించడం.

ఈ వదిలివేయబడిన రాజుల చరిత్రను 2 దినవృతాంతములు 22-25 అధ్యాయాల్లో చూడగలం.

తర్వాత ఉజ్జియా — ఉజ్జియా యూదా రాజ్యానికి రాజయ్యాడు. అతడు తన తండ్రియైన అమజ్యా చేసినట్లే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. జెకర్యా అనే దేవుని జ్ఞానం కలిగిన మనిషి బ్రతికియున్నంత కాలం ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను వెదికినంత కాలం దేవుడు అతనిని అభివృద్ధి పరచాడు (2 దినవృత్తాంతములు 26:1–5).

దేవుడు అతనికి విజయాలు, బలం, కీర్తి ఇచ్చాడు. కానీ తరువాత ఉజ్జియా గర్వపడిపోయాడు. యాజకులకు మాత్రమే చెందిన పనిని తానే చేయాలని ప్రయత్నించి దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్లాడు. ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం. ఫలితంగా దేవుడు అతనిని కుష్టురోగంతో శిక్షించాడు, ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 26:1-5 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. ఇది మనకు నేర్పేది ఏమిటంటే: దేవునిని ఆశ్రయించినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. గర్వం మనిషిని పతనానికి తీసుకెళ్తుంది.

తర్వాత యోతాము —  యోతాము తన తండ్రియైన ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు (2 దినవృత్తాంతములు 27). అతడు దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రజలు మాత్రం ఇంకా చెడు మార్గాల్లోనే కొనసాగారు. ఒక మంచి నాయకుడు ఉన్నప్పటికీ ప్రజలు వ్యక్తిగతంగా దేవుని వైపు తిరగకపోతే దేశం ఆత్మీయంగా బలపడదు. ఈ విషయాలన్నీ 2 దినవృత్తాంతములు 27 అధ్యాయమందు గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి.

తర్వాత ఆహాజు — ఆహాజు చాలా దుర్మార్గమైన రాజు. అతడు ఉత్తర రాజ్యపు చెడు రాజుల మార్గంలో నడిచాడు. విగ్రహాలను చేయించాడు. అన్యదేవతలకు బలులు అర్పించాడు. తన కుమారులను కూడా అగ్నిలో బలి ఇచ్చాడు (2 దినవృత్తాంతములు 28:1–5). ఇది దేవునికి అత్యంత అసహ్యమైన పాపం. ఆహాజు యెహోవాను కోపపెట్టాడు. ఫలితంగా యూదా రాజ్యం శత్రువుల చేతిలో బాధపడింది.. ఈవిషయాలన్నీ 2 దినవృత్తాంతములు 28:1-5 లో గ్రంథస్థము చెయ్యబడి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నది: పాపం కేవలం వ్యక్తిని కాదు, కుటుంబాలను మరియు దేశాలను కూడా నాశనం చేస్తుంది. దేవునిని విడిచిపెట్టినప్పుడు ఆత్మీయ చీకటి పెరుగుతుంది.

తర్వాత హిజ్కియా — హిజ్కియా మంచి రాజు. అతడు యెహోవాను విశ్వసించాడు మరియు ప్రజలను తిరిగి దేవుని వైపు నడిపించాడు. విగ్రహారాధనను తొలగించాడు. దేవాలయ ఆరాధనను పునరుద్ధరించాడు. ఇతనిని గురించి 2 రాజులు 20:1-11 వచనాలలో చూడగలం.

తర్వాత మనష్షే — మనష్షే యూదా రాజులలో అత్యంత దుర్మార్గుడైన రాజులలో ఒకడు. అతడు యెహోవా దృష్టికి చాలా చెడుగా ప్రవర్తించాడు. తన తండ్రియైన హిజ్కియా తొలగించిన విగ్రహారాధనను మళ్లీ స్థాపించాడు. బయలు దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. నక్షత్రాలను ఆరాధించాడు. తన కుమారునిని అగ్నిగుండంలో నడిపించాడు. జ్యోతిష్యం, శకునాలు, యక్షిణిగాండ్రు, సోదెగాండ్రు వంటి దేవునికి అసహ్యమైన కార్యాలలో పాల్గొన్నాడు (2 రాజులు 21:1–18). అంతేకాక, యెహోవా మందిరంలోనే విగ్రహాన్ని నిలిపించాడు. అతడు ప్రజలను కూడా పాపంలో నడిపించాడు. యెహోవా వెళ్లగొట్టిన అన్యజనుల కంటే ఎక్కువ చెడుతనము చేయునట్లు మనష్షే ప్రజలను రేపాడని బైబిల్ చెబుతుంది.

అయితే మనష్షే జీవితంలో దేవుని కృప కూడా కనిపిస్తుంది. అష్షూరు రాజు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు. బాధలో ఉన్నప్పుడు మనష్షే తనను తాను తగ్గించుకొని యెహోవాను వేడుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన విని తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చాడు (2 దినవృత్తాంతములు 33:11–14). అప్పుడు మనష్షే నిజంగా యెహోవానే దేవుడు అని తెలుసుకున్నాడు. తరువాత అతడు విగ్రహారాధనను తొలగించడానికి ప్రయత్నించాడు.

తర్వాత ఆమోను — మనష్షే తరువాత అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు. అతడు తన తండ్రి ప్రారంభంలో చేసిన చెడు మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు (2 రాజులు 21:19–24). కాని మనష్షే చివరలో చూపిన పశ్చాత్తాపాన్ని ఆమోను చూపలేదు. అతడు తన పాపాలలోనే కొనసాగాడు.

తర్వాత యోషీయా — యోషీయా మంచి రాజు. అతడు దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు. కుడి ఎడమలకు తొలగిపోలేదు (2 రాజులు 22–23).

దేవాలయాన్ని మరమ్మతు చేయిస్తున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడింది. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు యోషీయా తన వస్త్రాలను చింపుకొని పశ్చాత్తాపపడ్డాడు. తరువాత దేశమంతట విగ్రహారాధనను తొలగించి ప్రజలను యెహోవా వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. యోషీయా జీవితం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది: నిజమైన సంస్కరణ దేవుని వాక్యంతో ప్రారంభమవుతుంది.

తర్వాత యెకొన్యా — యెకొన్యా (యెహోయాకీను అని కూడా పిలుస్తారు) చిన్న వయస్సులోనే రాజయ్యాడు. అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు (2 దినవృత్తాంతములు 36:9–10; 2 రాజులు 24:8–17). కొద్దికాలానికే బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును జయించి యెకొన్యాను బబులోనుకు చెరగా తీసుకెళ్లాడు. తరువాత అతని బంధువైన సిద్కియాను రాజుగా నియమించాడు.

కాని సిద్కియా కూడా దేవుని మాట వినలేదు. అతడు బబులోను మీద తిరుగుబాటు చేశాడు. ఫలితంగా బబులోను సైన్యం యెరూషలేమును పూర్తిగా నాశనం చేసింది. సిద్కియా కుమారులను అతని కళ్ల ఎదుట చంపారు. తరువాత అతని కన్నులు ఊడదీయబడ్డాయి. అతనిని సంకెళ్లతో బబులోనుకు తీసుకెళ్లారు. యెహోవా మందిరం కాల్చివేయబడింది. యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి. ప్రజలు చెరగా తీసుకుపోయబడ్డారు. దేవాలయపు బంగారం, వెండి మరియు విలువైన వస్తువులు దోచుకుపోయబడ్డాయి (2 రాజులు 25:1–22).

ఇది దేవుని తీర్పు ఎందుకంటే ప్రజలు మరియు రాజులు ఎన్నో సంవత్సరాలు దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారు.

ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యక్ష పాలనకంటే మానవ రాజులను కోరుకున్నారు. దేవుడు వారి కోరికను అనుమతించాడు. కానీ అనేక రాజులు దేవునిని విడిచిపెట్టి విగ్రహారాధనలో నడిచారు. ఫలితంగా: రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది. ఉత్తర రాజ్యంలోని పది గోత్రాలు చెదరగొట్టబడ్డాయి. దక్షిణ రాజ్యమూ చివరకు బబులోను చెరకు వెళ్లింది.

అయినా దేవుడు తన వాగ్దానాన్ని మరచిపోలేదు. దావీదుతో చేసిన నిబంధన కారణంగా ఆయన దావీదు వంశాన్ని పూర్తిగా నాశనం చేయలేదు. ఇది వారి గొప్పతనము వల్ల కాదు; దేవుని కనికరము వల్ల మాత్రమే.

మత్తయి ఈ చరిత్రను యూదులకు గుర్తుచేస్తూ, దేవుడు మనుష్యుల పాపం మధ్యలో కూడా తన వాగ్దానాన్ని నిలుపుకొన్నాడని, మనుష్యులు అవిధేయులైనా, దేవుడు విశ్వాసయోగ్యుడని, దేవుని కృప వలననే మెస్సీయ వంశం కాపాడబడిందనే ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు.

అందుకే మత్తయి ఈ వంశావళి ద్వారా, అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ప్రకటిస్తున్నాడు. ఈ చరిత్ర అంతా చివరకు ఆయన వైపే చూపిస్తుంది.

11యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. క్రీ.పూ. 587 లేదా 586లో బబులోను సామ్రాజ్యం యెరూషలేమును జయించి నగరాన్ని నాశనం చేసింది. యెహోవా మందిరాన్ని కాల్చివేసి, దేవాలయంలోని పవిత్ర వస్తువులను తీసుకుపోయింది. యూదులను మరియు యెరూషలేము పరిసర ప్రాంతాల ప్రజలను బబులోనుకు చెరగా తీసుకెళ్లింది. ఈ చెర జీవితం సుమారు 70 సంవత్సరాలు కొనసాగింది. ఇది దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే హెచ్చరించిన తీర్పు.

తరువాత క్రీ.పూ. 538లో పారశీక రాజైన కోరెషు (సైరస్) బబులోను సామ్రాజ్యాన్ని జయించాడు. ఆ తరువాత యూదులకు తమ స్వదేశమైన యూదాకు తిరిగి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. వారు తిరిగి వెళ్లి యెరూషలేము దేవాలయాన్ని మళ్లీ నిర్మించడం ప్రారంభించారు.

ఈ చెర సంఘటన ఇశ్రాయేలు చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఇది: దేవుని తీర్పును, అలాగే దేవుని కనికరాన్ని చూపిస్తుంది. ప్రజలు పాపం చేసినందుకు దేవుడు వారిని శిక్షించాడు. కానీ వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్లీ వారిని తిరిగి తీసుకొచ్చాడు.

మత్తయి ఈ విషయాన్ని వంశావళిలో చేర్చడం ద్వారా ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు: ఇశ్రాయేలు ఎన్నిసార్లు విఫలమైనా, దేవుని రక్షణ ప్రణాళిక ఆగలేదు. చెర మధ్యలో కూడా దేవుడు మెస్సీయ వంశాన్ని కాపాడాడు. చివరకు అదే వంశం నుండి యేసుక్రీస్తు జన్మించాడు.

12బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలు నుకనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; 13జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; 14అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; 15ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; 16యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

17ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు. ప్రజలు ఇప్పుడు hierarchy క్రింద ఉన్నారు.

మత్తయి 1:17లో మత్తయి యేసుక్రీస్తు వంశావళిని మూడు భాగాలుగా విభజించాడు: అబ్రాహాము నుండి దావీదు వరకు — 14 తరాలు, దావీదు నుండి బబులోను చెర వరకు — 14 తరాలు, బబులోను చెర నుండి క్రీస్తువరకు — 14 తరాలు.

మొదటి భాగం దేవుని ప్రత్యక్ష పాలన కాలాన్ని, రెండవ భాగం రాజుల కాలాన్ని, మూడవ భాగం చెర మరియు తరువాతి కాలాన్ని సూచిస్తుంది. ఈ చివరి కాలంలో యూదులు విదేశీయుల అధికారము మరియు వివిధ పాలనా వ్యవస్థల క్రింద జీవించారు.

ఈ మూడవ విభాగం ద్వారా మత్తయి ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తున్నాడు: యెరూషలేము నాశనం అయినా, ప్రజలు చెరలోకి వెళ్లినా, దావీదు సింహాసనం కనబడకపోయినా — దేవుడు మెస్సీయ వంశాన్ని కాపాడుతూ వచ్చాడు. చెరలోని అల్లకల్లోల పరిస్థితుల మధ్య కూడా యెహోవా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. చివరకు అదే వంశం నుండి క్రీస్తు వచ్చాడు.

షయల్తీయేలు— యెకొన్యా మరియు సిద్కియా యూదా రాజ్యపు చివరి రాజులు. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని చెరగా తీసుకెళ్లాడు. యెకొన్యా కుటుంబమంతా కూడా చెరలోకి వెళ్లిందని 2 రాజులు 24:15 చెబుతుంది.

1 దినవృత్తాంతములు 3:17 ప్రకారం యెకొన్యా కుమారులలో షయల్తీయేలు ఒకడు. చెరలో ఉన్నప్పటికీ అతడు దావీదు వంశానికి వారసుడిగా పరిగణించబడ్డాడు. ఒకవేళ యూదా రాజ్యం చెరలోకి వెళ్లకపోయి ఉంటే, షయల్తీయేలు దావీదు సింహాసనాన్ని అధిష్టించి ఉండేవాడు.

ఇందుకు ఒక కారణముంది, (మత్తయి రెండవ విభాగములో రాజైన ఆమోనును తరువాత రాజైన యెహోయాహాజును, యెహోయాకీమును వంశావళిలో చేర్చలేదు). యెహోయాకీము దేవుని వాక్యాన్ని అవమానించి యిర్మీయా గ్రంథాన్ని కాల్చివేయడంతో, యెహోవా అతని వంశంపై తీర్పు ప్రకటించి —దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అని చెప్పాడు, — యిర్మీయా 36:30. ఈ మాటలు యెహోయాకీము మనుమడైన షయల్తీయేలులో నిజమయ్యాయి. టైటిల్ తొలగించబడింది.

ఈ తీర్పు కారణంగా దావీదు రాజరిక మహిమ తగ్గిపోయింది. అయినప్పటికీ దేవుడు వంశాన్ని పూర్తిగా ఆపలేదు. రాజ్య హక్కు కనబడకపోయినా, మెస్సీయ వాగ్దానం మాత్రం కొనసాగింది.

జెరుబ్బాబెలు — యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. ఈ విషయం 1 దినవృత్తాంతములు 3:17-19 లో ఉంది.

1 దినవృత్తాంతములు 3:17–19 ప్రకారం జెరుబ్బాబెలు పెదాయా కుమారుడు అని చెప్పబడింది. కానీ మత్తయి 1:12 మరియు లూకా 3:27లో అతడు షయల్తీయేలు కుమారుడు అని ఉంది. ఇది విరోధం కాదు. ద్వితీయోప దేశ కాండము 25:5–6లో చెప్పబడిన “లేవిరేట్ వివాహ ధర్మం” ప్రకారం, ఒక సహోదరుడు సంతానం లేక మరణిస్తే, అతని సహోదరుడు అతని భార్యను వివాహం చేసుకొని పుట్టిన కుమారుడిని చనిపోయిన సహోదరుని వారసునిగా పరిగణించాలి. అందువల్ల: జెరుబ్బాబెలు సహజంగా పెదాయా కుమారుడు కావచ్చు, కానీ చట్టపరంగా షయల్తీయేలు కుమారుడిగా పరిగణించబడ్డాడు. కాబట్టి మత్తయి మరియు లూకా చెప్పినది చట్టబద్ధమైన వంశ సంబంధాన్ని సూచిస్తుంది.

ప్రవక్త అయిన హగ్గయి బబులోను చెర తరువాత యూదా ప్రజలకు నాయకుడిగా జెరుబ్బాబెలును పేర్కొన్నాడు (హగ్గయి 1:14; 2:1). అతడు దావీదు వంశానికి చెందినవాడు మరియు చెరలో ఉన్న యూదుల మధ్య “యూదా దేశపు యువరాజు”గా గుర్తింపును పొందాడు.

బబులోను చెర సుమారు 70 సంవత్సరాలు కొనసాగిన తరువాత, దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని పారసీక రాజైన కోరెషు (సైరస్) మనస్సును ప్రేరేపించాడు. అప్పుడు కోరెషు — యెరూషలేములో యెహోవాకు మందిరము కట్టవలెనని” ప్రకటించాడు, ఎజ్రా 1:1–3. ఇది దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ముందుగా చెప్పిన వాక్య నెరవేర్పు. అప్పుడు దేవుడు ప్రేరేపించిన ప్రజలతో కలిసి జెరుబ్బాబెలు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. చెరలో నుండి తిరిగి వచ్చిన యూదులకు అతడు నాయకత్వం వహించాడు. ముఖ్యంగా యెహోవా మందిరాన్ని తిరిగి నిర్మించే పనిలో అతడు ప్రధాన పాత్ర పోషించాడు.

ఎజ్రా గ్రంథం ప్రకారం, ప్రజలు మొదట బలిపీఠాన్ని తిరిగి కట్టారు, తరువాత దేవాలయ పునాది వేశారు, అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ, దేవుని సహాయంతో మందిర నిర్మాణం పూర్తయింది. హగ్గయి మరియు జెకర్యా ప్రవక్తలు ప్రజలను ప్రోత్సహించి, జెరుబ్బాబెలును బలపరిచారు.

జెరుబ్బాబెలు జీవితం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చూపిస్తుంది: దేవుడు తన ప్రజలను పూర్తిగా విడిచిపెట్టడు. చెర, శిక్ష, నాశనం వచ్చినా ఆయన వాగ్దానం నిలిచే ఉంటుంది. దావీదు వంశం బలహీనంగా కనిపించినా దేవుడు దానిని కాపాడాడు. దేవుని మందిరం మళ్లీ నిర్మించబడినట్లే, దేవుడు తన రక్షణ ప్రణాళికను కూడా కొనసాగించాడు.

మత్తయి వంశావళిలో జెరుబ్బాబెలు పేరు ఉండటం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చెర తరువాత కూడా మెస్సీయ వంశం నిలిచి ఉందని అది చూపిస్తుంది. రాజ్యం లేకపోయినా, సింహాసనం లేకపోయినా, దేవుని వాగ్దానం బ్రతికే ఉంది. చివరకు అదే వంశం నుండి యేసుక్రీస్తు జన్మించాడు — ఆయనే నిజమైన దేవాలయము, నిజమైన రాజు, తన ప్రజలను పాప చెర నుండి విడుదల చేయడానికి వచ్చిన రక్షకుడు.

అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. అబీహూదు నుండి యాకోబు వరకు చెప్పబడిన ఈ పేర్ల గురించి బైబిలులో ఎక్కువ సమాచారం ఇవ్వబడలేదు.

మత్తయి 1:13–15లో వారి పేర్లు వంశావళిలో మాత్రమే కనిపిస్తాయి. వీరి జీవిత చరిత్రలు, కార్యాలు, లేదా రాజ్యపాలన గురించి మనకు వివరాలు లేవు. అయితే ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది: దేవుని రక్షణ ప్రణాళికలో ప్రసిద్ధులైన వారే కాక, మనకు తెలియని సాధారణ వ్యక్తులు కూడా భాగమయ్యారు. చరిత్రలో మనుష్యులకు గుర్తింపు లేకపోయినా, దేవుడు వారిని మరచిపోలేదు.

ఈ తరాల ద్వారా దేవుడు నిశ్శబ్దంగా దావీదు వంశాన్ని కాపాడుతూ వచ్చాడు. రాజులు లేరు, గొప్ప రాజ్యం లేదు, ప్రవక్తల స్వరం కూడా చాలా కాలం వినిపించలేదు. అయినప్పటికీ దేవుని వాగ్దానం కొనసాగింది. చివరకు ఈ వంశం యాకోబుకు, తరువాత మరియ భర్తయైన యోసేపుకు చేరింది. యోసేపు ద్వారా యేసు దావీదు వంశానికి చట్టబద్ధమైన వారసుడిగా నిలిచాడు.

ఇది మనకు ఒక గొప్ప ఓదార్పు ఇస్తుంది: మనుష్యులకు తెలియని జీవితాలు కూడా దేవునికి విలువైనవే. దేవుడు తన వాగ్దానాన్ని తరతరాలుగా నెరవేర్చుతాడు. ఆయన కార్యం నిశ్శబ్ద కాలాల్లో కూడా ఆగిపోదు.

మత్తయి ఈ పేర్లను చేర్చడం ద్వారా చెబుతున్నది ఏమిటంటే: చెర తరువాతి చీకటి కాలాల్లో కూడా దేవుడు మెస్సీయ వంశాన్ని కాపాడుతూ వచ్చాడు. చివరకు యేసుక్రీస్తులో ఆ వాగ్దానం నెరవేరింది.

యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ మత్తయి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసు మరియ ద్వారా జన్మించినప్పటికీ, యోసేపు ఆయన చట్టబద్ధమైన తండ్రి. అందువల్ల దావీదు వంశానికి చెందిన యోసేపు యొక్క చట్టబద్ధమైన హక్కులు యేసుకు వచ్చాయి. ఈ విధంగా యేసు దావీదు సింహాసనానికి సరైన వారసుడిగా నిలిచాడు. యోసేపు యేసును తన కుమారుడిగా స్వీకరించి పెంచాడు. అందుకే ప్రజలు యేసును: “వడ్రంగి కుమారుడు” (మత్తయి 13:55), “యోసేపు కుమారుడు” (యోహాను 6:42) అని పిలిచారు. ఆయన క్రీస్తు అని పిలువబడ్డాడు. “క్రీస్తు” అనే పదానికి “అభిషిక్తుడు” అనే అర్థం. ఇది హిబ్రూ భాషలోని “మెస్సీయ” అనే పదానికి సమానం అంటే దేవునిచేత అభిషేకింపబడిన రక్షకుడు అని అర్ధం. ఇది ఆయన అధికారిక బిరుదు, ఆయన నిర్వహించబోయే ఆఫీసెస్ ని (రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా) తెలియజేస్తుంది. యేసు మూడు ప్రధాన కార్యాలను నెరవేర్చడానికి వచ్చాడు: ప్రవక్తగా — దేవుని సత్యాన్ని ప్రకటించడానికి, యాజకునిగా — పాపుల కొరకు తనను తాను బలిగా అర్పించడానికి, రాజుగా — తన ప్రజలను నిత్యంగా పరిపాలించడానికి వచ్చాడు.

ఆశ్చర్యపరచే విషయమేమిటంటే, యేసు దగ్గరకు వచ్చేటప్పటికి, రాజైన దావీదు వంశస్థుడైన యేసేపు సాధారణమైన వడ్రంగిగా ఉన్నాడు. దావీదు రాజ్య మహిమ అప్పటికే కనబడకుండా పోయింది. యూదులు ఒక శక్తివంతమైన రాజకీయ రాజును ఎదురుచూశారు. అందువల్ల సాధారణ కుటుంబంలో పెరిగిన యేసును మెస్సీయగా అంగీకరించడం వారికి కష్టమైంది. యూదులు యేసును మెస్సయ్యగా అంగీకరించకపోవడానికి ఉన్న అనేక కారణాలలో ఇది కూడా ఒకటి. కాని దేవుని ఉద్దేశ్యం రాజకీయ రాజ్యాన్ని తిరిగి స్థాపించడం కాదు. ఆయన పంపిన మెస్సీయ పాపం మరియు శాపం నుండి ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అందుకే దేవుడు దావీదు వంశాన్ని నిశ్శబ్దంగా, జాగ్రత్తగా కాపాడుతూ చివరకు యేసును లోకానికి పంపించాడు.

యేసు వంశావళిలో మనం వివిధ రకాల ప్రజలను చూస్తాము: రాజులు మరియు సామాన్యులు, ధనవంతులు మరియు పేదలు, పురుషులు మరియు స్త్రీలు, మంచి పేరున్నవారు మరియు పాపులు. ఇది ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది: దేవుని రక్షణ అందరికీ అవసరం. జాతి, స్థాయి, సంపద, విద్య, లింగం — ఇవేవీ దేవుని కృపకు అడ్డంకులు కావు. అందరూ పాపులే. అందరికీ క్షమాపణ అవసరం. ఆ క్షమాపణను ఉచితంగా ఇవ్వడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు.

మత్తయి వంశావళి అబ్రాహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి బబులోను చెర వరకు, అక్కడి నుండి క్రీస్తు వరకు దేవుడు తన వాగ్దానాన్ని ఎలా కాపాడాడో చూపిస్తుంది. ఇది మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది: మానవ చరిత్ర యాదృచ్ఛికంగా నడవదు. దేవుడు తన చిత్తం ప్రకారం చరిత్రను నడిపిస్తున్నాడు. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావు. యేసుక్రీస్తులో ఆయన రక్షణ ప్రణాళిక సంపూర్ణమైంది.

యేసుక్రీస్తు వంశావళిలో తామారు, రాహాబు, రూతు, బత్షెబ వంటి స్త్రీలు ఉండటం యూదులలో చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా వారిలో కొందరు అన్యజనులు కావడం, కొందరి జీవితాల్లో నైతిక వైఫల్యాలు ఉండటం యూదుల గర్వానికి సరిపడేది కాదు. అయినప్పటికీ మత్తయి ఈ పేర్లను దాచిపెట్టలేదు. ఎందుకంటే ఇదే నిజమైన చరిత్ర.

ఇది మత్తయి సువార్తలో తరువాత వచ్చే ఒక ముఖ్యమైన విషయానికి ముందుమాటలా పనిచేస్తుంది: యేసు మెస్సీయ గురించి యూదులు ఏర్పరచుకున్న అనేక తప్పుడు అంచనాలను సరిచేయడానికి వచ్చాడు.

యూదులు భావించినట్లు, మెస్సీయ కేవలం యూదుల రాజకీయ రాజు కాదు, బయటి ఆచారాలను మాత్రమే గౌరవించే నాయకుడు కాదు, తమ సంప్రదాయాలను సమర్థించే గురువు కూడా కాదు.

అందుకే మత్తయి సువార్తలో యేసు: సబ్బాతు గురించి వారి తప్పు అర్థాలను సరిచేసాడు, దేవునికి ఇచ్చే దశమభాగాలు, బాహ్య ఆచారాలకన్నా హృదయ పవిత్రత ముఖ్యమని చెప్పాడు, నిజమైన విధేయత దేవుని చిత్తాన్ని చేయడమేనని బోధించాడు, పరలోక రాజ్యం గురించి వారి భౌతిక ఆశలను ఖండించాడు. యేసు బోధనలు యూదుల సంప్రదాయ గర్వాన్ని మరియు స్వనీతి భావాన్ని బహిర్గతం చేశాయి.

మత్తయి యేసు వంశావళిని మూడు భాగాలుగా విభజించి ప్రతి భాగంలో 14 తరాలను పేర్కొన్నాడు: అబ్రాహాము నుండి దావీదు వరకు — 14; దావీదు నుండి బబులోను చెర వరకు — 14; బబులోను చెర నుండి క్రీస్తువరకు — 14.

బైబిల్ దీనికి ఖచ్చితమైన కారణాన్ని చెప్పటం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి; దేవుడు స్పష్టంగా చెప్పని చోట అతిగా నిర్ణయాలు చేయకూడదు.

అయితే కొందరు బైబిల్ అధ్యాపకులు ఇలా భావిస్తారు: “7” అనే సంఖ్య బైబిలులో సంపూర్ణతను సూచిస్తుంది. దేవుడు ఆరు దినాల్లో సృష్టిని చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల “14” అంటే రెండు సార్లు 7 — సంపూర్ణతకు మరింత బలమైన సూచనగా భావిస్తారు.

ఇంకొందరు “దావీదు” అనే పేరుకు హెబ్రీ అక్షరాల సంఖ్యా విలువ 14 అవుతుందని చెబుతారు. కాబట్టి మత్తయి యేసు దావీదు కుమారుడని ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి ఈ నిర్మాణాన్ని ఉపయోగించి ఉండొచ్చని చెప్తారు.

14 లో_ 7 తరాలు + 7 తరాలు = 14 తరాలు. ఒకొక్క విభాగములో 14 తరాలు అంటే  రెండు ఏడులు ఉన్నాయి. రెండు ఏడులు చొప్పున మూడు విభాగములలో కలిపి 42 తరాలు, అంటే మూడు విభాగములలో 6 ఏడులు ఉన్నాయి. అంటే 6/7. యేసు రాకతో ఏడవ “ఏడు” ప్రారంభమైంది అని కొందరు భావిస్తారు.

ఇది పాత నిబంధనలోని జూబ్లీ సంవత్సరాన్ని గుర్తుచేస్తుంది. లేవీయకాండము 25 ప్రకారం, ప్రతి 49 సంవత్సరాల తరువాత జూబ్లీ సంవత్సరం వచ్చేది. ఆ సంవత్సరంలో: బానిసలు విడుదల చేయబడేవారు, అప్పులు రద్దు చేయబడేవి, ఆస్తులు అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడేవి.

కొంతమంది అధ్యాపకులు యేసుక్రీస్తు జననం ద్వారా నిజమైన ఆత్మీయ జూబ్లీ ప్రారంభమైందని, యేసు పాప బానిసత్వం నుండి ప్రజలను విడుదల చేశాడని, దేవునితో మనుష్యులను సమాధానపరిచాడని, పరలోకపు తండ్రి ఇంటికి తిరిగి వచ్చే మార్గాన్ని తెరిచాడని తెలియ చేయడానికే మత్తయి ఇలా చెప్పాడని కొందరు చెప్తుంటారు.

ఇది అందమైన మరియు ఆత్మీయంగా ప్రోత్సహించే ఆలోచన. కానీ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి: మత్తయి స్వయంగా ఈ అర్థాన్ని స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి దీనిని ఖచ్చితమైన సిద్ధాంతంగా కాకుండా, ఒక సాధ్యమైన ఆత్మీయ సూచనగా మాత్రమే చూడాలి.

మత్తయి ప్రధాన ఉద్దేశ్యం స్పష్టంగా ఇదే: దేవుడు చరిత్రను నియంత్రిస్తూ, తరతరాలుగా దావీదు వంశాన్ని కాపాడి, చివరకు యేసుక్రీస్తులో తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.

ఏ కారణమైనా, మత్తయి చెప్పదలచుకున్న ప్రధాన విషయం స్పష్టమే: చరిత్ర యాదృచ్ఛికం కాదు. దేవుడు తన వాగ్దానాన్ని తరతరాలుగా నడిపిస్తూ చివరకు యేసుక్రీస్తులో నెరవేర్చాడు. యేసే: అబ్రాహాము సంతానం, దావీదు కుమారుడు, వాగ్దానం చేయబడిన మెస్సీయ, పాపుల రక్షకుడు.

ఇది ఆసక్తికరమైన సముచితమైన ఆలోచనే. కాని మత్తయి సూటిగా ఈ విషయాన్ని గురించి ఉద్ఘాటించడం లేదు. దేవుడు తన ప్రజల వ్యవహారాలను నిర్దేశించిన క్రమాన్ని మరియు రక్షకుడు పుట్టే వరకు దావీదు వారసులను ఆయన యెట్లు సంరక్షించి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయన కనికరాన్ని బట్టి మనం ఆశ్చెరువు నొందాలని ఈ విషయాన్ని మత్తయి మనకే వదిలేసాడు.

మత్తయి ప్రధానంగా యోసేపు వంశావళిని చూపిస్తున్నాడు. ఇది యేసు యొక్క చట్టబద్ధమైన రాజ వంశ హక్కును తెలియజేస్తుంది. యోసేపు ద్వారా యేసు దావీదు సింహాసనానికి చట్టబద్ధమైన వారసుడు.

లూకా వంశావళి మరియ వంశాన్ని సూచిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అక్కడ రాజుల పేర్లకన్నా సాధారణ వ్యక్తుల పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. వారు కూడా దావీదు వంశానికి చెందినవారే, కానీ రాజరిక వరుసలో లేరు.

అందువల్ల: యోసేపు ద్వారా యేసుకు చట్టబద్ధమైన రాజ హక్కు ఉంది, మరియ ద్వారా యేసు శారీరకంగా నిజంగా దావీదు సంతానమే. ఈ రెండూ కలిసి ఒక గొప్ప సత్యాన్ని నిర్ధారిస్తున్నాయి: అబ్రాహాముకు, దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయుడు యేసుక్రీస్తే. మత్తయి వంశావళి మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది: దేవుడు తన వాగ్దానాన్ని మరచిపోడు, చరిత్ర ఆయన చేతిలోనే ఉంది, పాపం, చెర, రాజ్యాల పతనం కూడా ఆయన ప్రణాళికను ఆపలేవు, చివరకు యేసుక్రీస్తులో దేవుని రక్షణ కార్యం సంపూర్ణమైంది.

యేసు యొక్క జన్మము 18-25

18యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకముకాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైదావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది; 21ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. 22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 23అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 24యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని 25ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

1:1–17 వచనాలలో మత్తయి యేసుక్రీస్తు యొక్క మానవ వంశావళిని వివరించాడు. యేసు అబ్రాహాము దావీదు సంతానమని చూపిస్తూ, ఆయన వాగ్దానం చేయబడిన మెస్సీయుడని నిరూపించాడు.

ఇప్పుడు 18–25 వచనాలలో మత్తయి ఒక కొత్త విషయానికి వస్తున్నాడు. “యేసుక్రీస్తు జనన విధమెట్లనగా…” అని ప్రారంభిస్తూ, యేసు యొక్క దైవికమైన ఆరంభాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాడు. అంటే: యేసు నిజ మానవుడే, కానీ ఆయన జననం సాధారణ మానవ జననం కాదని, ఆయన కన్యక అయిన మరియ ద్వారా జన్మించాడని, ఆయన గర్భధారణ పరిశుద్ధాత్మ వలన జరిగిందని చెప్తూ మత్తయి యేసు యొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని రెండింటినీ స్పష్టంగా చూపిస్తున్నాడు.

ఆ కాలంలో “ప్రధానం” అనేది నేటి నిశ్చితార్థంలా కాదు. అది ఒక గంభీరమైన చట్టబద్ధమైన బంధం. కుటుంబ సభ్యులు మరియు సాక్షుల సమక్షంలో వివాహ ఒప్పందం చేసేవారు. ఆ తరువాత వారు భార్యాభర్తలుగానే పరిగణించబడేవారు, అయినప్పటికీ వారు కలిసి నివసించరు. వివాహ వేడుక తరువాత మాత్రమే కలిసి జీవితం ప్రారంభించేవారు. ఈ ప్రధాన బంధం చాలా బలమైనది. అది, మరణం ద్వారా, లేదా అధికారిక విడాకుల ద్వారా మాత్రమే ముగిసేది. అందువల్ల ప్రధానము చేయబడిన సమయంలో ఎవరో ఒకరు మరణిస్తే, బ్రతికున్న వ్యక్తిని వితంతుడిగా/విధవరాలిగా పరిగణించేవారు.

ఈ నేపథ్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మరియ గర్భవతిగా కనబడినప్పుడు, యోసేపు చాలా కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మానవ దృష్టికి అది విశ్వాసఘాతుకంలా కనిపించింది. కానీ దేవుడు తన దూత ద్వారా యోసేపుకు ఈ శిశువు పరిశుద్ధాత్మ వలన గర్భంలో కలిగినవాడని తెలియజేశాడు.

మత్తయి యేసు కేవలం దావీదు కుమారుడు మాత్రమే కాదు; ఆయన దేవుని కుమారుడు కూడా అనే ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు.

మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, వారేకము కాకమునుపు, అంటే (వివాహమై వారిరువురు ఒకటిగా తమ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు) ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి –దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. మరియ ఆ మాటకు బహుగా తొందరపడి– ఈ శుభవచనమేమిటో అని ఆలోచించు కొనుచుండగా దూత – మరియా, భయపడకుము; దేవుని వలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియ– నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత–పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ–ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్లెను. ఈ మాటలు లూకా సువార్త 1:26-38 వచనాలలో గ్రంథస్థం చెయ్యబడి ఉన్నాయి.

పెళ్లి వేడుకకు ముందే మరియ గర్భవతిగా ఉండటం ఆమెకు చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ కాలపు యూదుల సమాజంలో ఇది తీవ్రమైన అవమానంగా పరిగణించబడేది. ప్రజలు ఆమెను అపవిత్రురాలిగా భావించే అవకాశం ఉంది. ఆమె ప్రతిష్ట, గౌరవం, భవిష్యత్తు — అన్నీ ప్రమాదంలో పడ్డాయి.

కాని మరియ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంది. ఆమె గర్భధారణకు కారణం పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ కార్యమే అని ఆమె సంపూర్ణంగా నమ్మింది. దేవదూత చెప్పిన మాటలను ఆమె విశ్వాసంతో అంగీకరించింది. ఆమెకు మానవపరంగా ఎలాంటి రక్షణ లేదు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆధారాలు లేవు. సమాజం తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, తన జీవితమే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఆమె సందేహించలేదు. ఆమె “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక” — లూకా 1:38 అని చెప్పింది.

ఈ మాటలు మరియ యొక్క గొప్ప విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె దేవుని చిత్తానికి వినయంగా లోబడింది. దేవుడు చెప్పినది నిజమని నమ్మి తనను పూర్తిగా ఆయన చిత్తానికి అప్పగించుకొంది.

మరియ పరిచర్య ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకానికి తీసుకురావడానికి ఆమెను ఎన్నుకున్నాడు. ఈ కారణంగా ఆమె స్త్రీలలో ధన్యురాలు. అయితే మరియను దేవత స్థాయికి ఎత్తకూడదు. బైబిల్ అలా బోధించటం లేదు. మరియ కూడా ఆదాము సంతానమే — రక్షణ అవసరమైన పాపినే. ఆమెకు కూడా రక్షకుడు అవసరం. అందుకే ఆమె: “నా రక్షకుడైన దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది” — లూకా 1:47 అని చెప్పింది.

కాబట్టి మరియను గౌరవించాలి, ఎందుకంటే దేవుడు ఆమెను ఒక ప్రత్యేకమైన సేవకు ఉపయోగించాడు. కానీ ఆరాధించవలసింది మరియను కాదు — ఆమె గర్భంలో ధరించిన రక్షకుడైన యేసుక్రీస్తును. దేవుని కృపచేత విశ్వాసంలో నడిచిన వినయమైన సేవకురాలిగా మరియ మనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను.” ఈ మాట యేసుక్రీస్తు జననం మానవ చరిత్రలో పూర్తిగా ప్రత్యేకమైనదని తెలియజేస్తుంది. యేసు సాధారణ మనుష్యుల వలె జన్మించలేదు. ఆయన పాప స్వభావంతో పుట్టలేదు. పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ కార్యం ద్వారా కన్య అయిన మరియకు జన్మించాడు.

ఈ అద్భుతమైన జననం ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది: నిత్యత్వములో తండ్రి చేత కనబడిన దేవుని కుమారుడు — నిజమైన దేవుడు — మన రక్షణ కొరకు నిజమైన మనిషిగా ఈ లోకములోకి వచ్చాడు. అందుకే మనం విశ్వాస ప్రమాణములో, “ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి, కన్య మరియకు జన్మించెను” అని ఒప్పుకొంటున్నాం.

యేసు జననం ప్రత్యేకమైనది ఎందుకంటే: ఆయనకు మానవ తండ్రి లేడు, ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో కలిగాడు, ఆయన పాపరహితుడుగా జన్మించాడు.

దేవుడు తన కుమారుని ఈ లోకానికి తేవటానికి కన్య అయిన మరియను ఎన్నుకున్నాడు. ఈ విధంగా యేసు నిజమైన మనిషిగా మన మధ్య జీవించాడు, కానీ అదే సమయంలో ఆయన నిజమైన దేవుడిగాను ఉన్నాడు. ఈ సత్యమే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం: ఒకే వ్యక్తిలో — ఆయన నిజమైన దేవుడుగా, నిజమైన మానవునిగా ఏకమయ్యారు. ఎందుకు? మనుష్యులను పాప శాపం నుండి విమోచించడానికి, మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, మన పాపాల కొరకు మరణించడానికి, మనకు నిత్యజీవం అనుగ్రహించడానికి. కాబట్టి కన్య జననం కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు; అది రక్షణ కార్యానికి అవసరమైన దేవుని ప్రణాళికలో ఒక భాగం.

కన్య జననం ద్వారా ఒక గొప్ప సత్యం వెల్లడైంది: ఒకే వ్యక్తియైన యేసుక్రీస్తులో నిజ దేవుడు మరియు నిజ మానవుడు కలిసియున్నారు.

  1. యేసు నిజ దేవుడు—లేఖనాలు యేసు నిజ దేవుడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయనకు దైవిక నామములు ఇవ్వబడ్డాయి, ఆయన పాపములను క్షమించాడు, ప్రకృతిపై అధికారమును చూపించాడు, మృతులను లేపాడు, ఆయనకు ఆరాధన చేయబడింది, ఆయన నిత్యుడు, సర్వశక్తిమంతుడు. అలాగే ఆయన దైవికమైన బోధలు, క్రియలు, గుణలక్షణాలు — ఇవన్నీ ఆయన నిజ దేవుడని తెలియజేస్తున్నాయి.
  2. యేసు నిజ మానవుడు— అదే సమయంలో యేసు నిజ మానవుడుగాను ఉన్నాడు. ఆయన మానవ శరీరాన్ని ధరించాడు, ఆకలి, దాహం, అలసట అనుభవించాడు, బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, శ్రమపడ్డాడు, మరణించాడు. ఆయనకు నిజమైన మానవ శరీరం మరియు ఆత్మ ఉన్నాయి. అందువల్ల ఆయన కేవలం మనిషిలా కనిపించినవాడు కాదు; నిజంగా మనిషిగా జీవించాడు —ఇవన్ని యేసు నిజ మానవుడై యున్నాడని తెలియజేస్తున్నాయి. 

ఎందుకు యేసు దేవుడుగాను మానవుడుగాను ఉండాలి?

  1. మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన మనిషిగా ఉండాలి. మనిషి పాపం చేశాడు కాబట్టి మనిషి స్థానంలో సంపూర్ణ విధేయత చూపవలసి ఉంది. యేసు నిజమైన మనిషిగా మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన పాపంలేని జీవితం గడిపాడు.
  2. మన పాపాలకు బదులుగా మరణించడానికి ఆయన మనిషిగా ఉండాలి. దేవుడు తన స్వరూపంలో మరణించడు. కాబట్టి యేసు మనిషిగా శరీరాన్ని ధరించి సిలువపై మరణించాడు. ఆయన నిజమైన మానవ మరణాన్ని అనుభవించాడు.
  3. ప్రపంచపు పాప భారాన్ని మోయడానికి ఆయన దేవుడై ఉండాలి. సాధారణ మనిషి ప్రపంచమంతటి పాపానికి పరిహారం చెల్లించలేడు. యేసు నిజమైన దేవుడు కాబట్టి: ఆయన బలి అనంతమైన విలువ కలిగినది, ఆయన మరణం సమస్త లోక పాపాలకు సరిపడిన ప్రాయశ్చిత్తము.
  4. మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన దేవుడై ఉండాలి. కేవలం దేవుడే, పాపాన్ని, మరణాన్ని, సాతానును జయించగలడు.

యేసు తన పునరుత్థానముతో మరణంపై విజయాన్ని ప్రకటించాడు. అందువల్ల యేసుక్రీస్తు నిజమైన దేవుడుగా, నిజమైన మనిషిగా, ఒకే వ్యక్తిలో ఒకే వ్యక్తిగా ఉన్నాడు.

ఇదే సువార్త యొక్క కేంద్ర సత్యం. ఆయన మన రక్షణ కొరకు దేవుని కుమారుడుగా, మనిషిగా జన్మించాడు, మన స్థానంలో జీవించాడు, మన కొరకు మరణించాడు, మనకు నిత్యజీవం అనుగ్రహించడానికి తిరిగి లేచాడు.

అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారురోమా 3:23 అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనుష్యులందరూ పాపులే. అందువల్ల ప్రతి మనిషి దేవుని తీర్పుకు పాత్రుడు. ఈ కారణంగానే రక్షకుడు అవసరమయ్యాడు. అందుకే, “కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను” — అని గలతీయులకు 4:4–5 చెప్తుంది. ధర్మశాస్త్రం క్రింద ఉన్న మనుష్యులను విమోచించడానికి యేసు మనుష్యునిగా జన్మించి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

ఆదాము అవిధేయత వలన మనుష్యులు పాపులయ్యారు: ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, — రోమా 5:19. కాబట్టి మన స్థానంలో ఒక పరిపూర్ణమైన మనిషి దేవునికి సంపూర్ణ విధేయత చూపవలసి ఉంది. అందుకే యేసు నిజమైన మనిషిగా వచ్చాడు.

హెబ్రీ 4:15 ఇలా చెప్తుంది: “సమస్త విషయములలో మనవలె శోధింపబడినను పాపములేనివాడై యుండెను.” యేసు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఒక్క పాపమూ చేయలేదు. మన స్థానంలో సంపూర్ణ విధేయత చూపించాడు. దీనినే “కార్యకారి విధేయత” (Active Obedience) అంటారు అంటే: మనము చేయలేని నీతిని యేసు మన స్థానంలో చేసి, తన నీతిని మనకు అనుగ్రహించాడు.

కాని పాపానికి శిక్ష మరణం. కాబట్టి మన విమోచన కొరకు మరణం అవసరం. కీర్తన 49:7–8 ఇలా చెప్తుంది: “ఎవడును ఏ విధముచేత నైనను తన సహోదరుని విమోచింపలేడు.” ఏ సాధారణ మనిషి మరొకరి పాపానికి పరిహారం చెల్లించలేడు. అందుకే దేవుని కుమారుడు మనిషిగా వచ్చాడు. హెబ్రీ 2:14 ప్రకారం, “ఆ పిల్లలు రక్తమాంసములుగల వారైనందున ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.” ఎందుకు? మరణము యొక్క బలముగల అపవాదిని నశింపజేయడానికి, మరణభయము చేత బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు.

బాప్తిస్మమిచ్చు యోహాను యేసును చూచి “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల”— యోహాను 1:29 అని ప్రకటించాడు. మార్కు 10:45లో యేసు స్వయంగా, “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చితిని” అని చెప్పాడు. అందుకు యేసు మన పాప భారాన్ని మోశాడు, మన స్థానంలో శిక్ష అనుభవించాడు, సిలువపై మరణించాడు. దీనినే “కర్మణ్యార్థక విధేయత” (Passive Obedience) అంటారు.

అందువల్ల యేసు, తన పరిశుద్ధ జీవితం ద్వారా మన కొరకు నీతిని సంపాదించాడు, తన సిలువ మరణం ద్వారా మన శిక్షను భరించాడు. ఇదే సువార్త యొక్క హృదయం: మనము చేయలేనిదాన్ని క్రీస్తు మన కొరకు చేసాడు.

మత్తయి 1:19, ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మత్తయి 1:19లో యోసేపు పరిస్థితి ఎంత క్లిష్టమైనదో మనం గమనించొచ్చు.

లూకా 1:26–38లో దూత మరియతో చెప్పిన విషయాలను మరియ యోసేపుకు తెలియజేసి ఉండొచ్చు. కానీ యోసేపు ఎదుర్కొన్న పరిస్థితి మానవ దృష్టికి అర్థంకాని విషయం. ఒక కన్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని నమ్మడం సాధారణ మనిషికి చాలా కష్టమైనది.

యోసేపు నీతిమంతుడు. అంటే: దేవుని ధర్మశాస్త్రాన్ని గౌరవించే వాడు, సత్యాన్ని ప్రేమించే వాడు, దేవుని ఎదుట సరిగ్గా నడవాలని కోరుకునే వాడు.

ద్వితీయోపదేశకాండము 22:23–29 ప్రకారం, నిశ్చితార్థ సమయంలో వ్యభిచారం చాలా తీవ్రమైన పాపంగా పరిగణించబడేది. కాబట్టి యోసేపు ధర్మశాస్త్రాన్ని తేలికగా తీసుకోలేడు. అయితే అదే సమయంలో అతడు కఠిన హృదయుడు కాదు. అతడు మరియను బహిరంగ అవమానానికి గురి చేయాలని కోరుకోలేదు, ప్రజల ముందు ఆమెను అపకీర్తిపాలు చేయాలని అనుకోలేదు, ఆమెను ప్రేమించిన వాడిగా ఆమె ప్రాణం మరియు గౌరవం గురించి ఆలోచించాడు.

ఇక్కడ యోసేపు హృదయంలో రెండు విషయాలు పోరాడుతున్నాయి: ధర్మశాస్త్రం పట్ల గౌరవం, మరియ పట్ల ప్రేమ మరియు కనికరం. అందుకే అతడు బహిరంగ విచారణ కాకుండా, రహస్యంగా నిశ్చితార్థాన్ని ముగించాలని ఆలోచించాడు. ఇది అతని మానవత్వాన్ని, దయను, మృదుత్వాన్ని చూపిస్తుంది. అయితే ఈ సమయంలో యోసేపు కలవరంలో, బాధలో, అయోమయంలో, విరిగిన హృదయంతో ఉన్నాడని మనం ఊహించొచ్చు.

తాను తీసుకోబోయే నిర్ణయం కూడా అతనికి భారమైనదే. మరియను దూరం చేయడం అతనికి సులభం కాదు. కానీ తనకు తెలిసిన సత్యం ప్రకారం అతడు సరైనదే చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంలో దేవుడు యోసేపును విడిచి పెట్టలేదు. అతని బలహీనత, అయోమయం మధ్య దేవదూత ద్వారా సత్యాన్ని తెలియజేశాడు.

ఇది మనకు ఒక గొప్ప ఓదార్పు ఇస్తుంది: దేవుని ప్రజలు కొన్నిసార్లు అర్థంకాని పరిస్థితుల్లో పడొచ్చు. విశ్వాసులకూ సందేహాలు, కలవరాలు, బాధలు రావచ్చు. కానీ దేవుడు తన ప్రజలను చీకటిలో వదిలిపెట్టడు. సరైన సమయంలో ఆయన తన చిత్తాన్ని వెల్లడిస్తాడు.

యోసేపు కథలో మనం: నీతి, కనికరం, వినయం, దేవుని మార్గదర్శకత్వంపై ఆధారపడటం చూడగలం. అంతకన్నా ముఖ్యంగా, మన రక్షణ కొరకు దేవుడు ప్రతి సంఘటనను తన చిత్తప్రకారం నడిపించాడనే సత్యాన్ని చూస్తాం.

20అతడు ఈ సంగతులనుగూర్చి ఆలోచించుకొనుచుండగా, దేవుడు తన కుమారుని తల్లి తరపున జోక్యం చేసుకొని, దేవదూతను యోసేపు వద్దకు పంపగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై –దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది; 21ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. నువ్వు ఆ బిడ్డకు చట్టబద్దమైన తండ్రిగా యేసు అని పేరు పెట్టాలి, అని తెలియజేశాడు, మత్తయి 1:19-21. ఇది ప్రిడిక్షన్ రూపంలో ఉన్న ఒక ఆజ్ఞ.

ముఖ్యంగా, యోసేపుకు దేవదూత ఇచ్చిన సందేశం కేవలం వ్యక్తిగత ఓదార్పు కాదు; అది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక కీలక ఘట్టం. దేవదూత కలలో కనిపించడం అనేది దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి లేదా ప్రత్యేక సందర్భాలలో భవిష్యత్తును బహిర్గతం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. దేవదూత యేసేపును “దావీదు కుమారుడవైన యోసేపూ” అని సంబోధించడం చాలా ముఖ్యమైనది.

దావీదు కుమారుడవైన యోసేపూ” అనే సంబోధన ద్వారా దేవుడు యోసేపు యొక్క దావీదీయ వంశాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇది యాదృచ్ఛికమైన మాట కాదు. మెస్సీయుడు దావీదు సంతానముగా రావలసిందే అనే వాగ్దానం నెరవేరుతోందని ఇది తెలియజేస్తుంది.

నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. యోసేపు మరియను భార్యగా స్వీకరించాలి. నీవు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి. యోసేపు బిడ్డకు “యేసు” అని పేరు పెట్టడం ద్వారా ఆయనను చట్టబద్ధంగా తన కుమారునిగా స్వీకరిస్తున్నాడు. ఈ విధంగా యేసు దావీదు వంశానికి చట్టబద్ధమైన వారసుడిగా నిలుస్తాడు. “యేసు” అనే పేరుకు — “యెహోవా రక్షిస్తాడు” — అని అర్ధం. ఇది కేవలం పేరు కాదు; అది ఆయన మిషన్‌ను ప్రకటిస్తుంది. “తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును” అనే మాట సువార్త యొక్క హృదయం. మనుష్యుల ప్రధాన సమస్య రాజకీయ బానిసత్వం కాదు; పాప బానిసత్వం. అందుకే క్రీస్తు ప్రధానంగా రోమాను ఓడించడానికి కాదు, పాపం, మరణం, అపవాది అధికారాన్ని జయించడానికి వచ్చాడు.

చాలామంది యూదులు భౌతిక రాజ్యాన్ని పునరుద్ధరించే మెస్సీయ కోసం ఎదురు చూశారు. కానీ దేవుడు పంపిన రక్షకుడు మరింత గొప్ప విమోచన తీసుకొచ్చాడు. ఆయన, దేవునితో శత్రుత్వంలో ఉన్న పాపులను సమాధానపరచాడు, ధర్మశాస్త్ర శాపం నుండి విమోచించాడు, నిత్యజీవానికి ద్వారం తెరిచాడు.

ఇక్కడ యోసేపు విశ్వాసం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అతడు తన కళ్లతో చూసింది కాక, దేవుని వాక్యాన్ని నమ్మాడు. బాహ్య పరిస్థితులు మరియపై అపనింద వేస్తున్నప్పటికీ, దేవుని ప్రకటనను విశ్వసించి ఆమెను చేర్చుకున్నాడు. దేవుని వాక్యాన్ని మానవ తర్కం కంటే పైగా ఉంచడం ద్వారా యోసేపు నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడో చూపించాడు.

అలాగే, ఈ భాగం మనకు ఒక గొప్ప ఓదార్పు ఇస్తుంది: దేవుడు తన రక్షణ కార్యాన్ని నిశ్శబ్దంగా, సాధారణ మనుష్యుల జీవితాల ద్వారా నెరవేర్చుతాడు. ఒక వినయమైన కన్య, ఒక సాధారణ వడ్రంగి, ఒక చిన్న పట్టణం — వీటి ద్వారా దేవుడు లోక రక్షకుడిని పంపించాడు. ఇది రక్షణ పూర్తిగా దేవుని కృపవల్లనే జరుగుతుందని తెలియజేస్తుంది, మానవ మహిమవల్ల కాదు.

ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును” అనే మాట ప్రతి విశ్వాసికి వ్యక్తిగతమైన శుభవార్త. యేసు కేవలం ఒక బోధకుడు కాదు, ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు — ఆయన రక్షకుడు. ఆయన మన పాపభారాన్ని మోశాడు, మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, సిలువపై మరణించాడు, మరణాన్ని జయించి లేచాడు. అందువల్ల ఆయనయందు విశ్వాసం ఉంచిన ప్రతి పాపికి క్షమాపణ, నీతి, నిత్యజీవం కలుగుతాయి.

22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 23అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

ఇదంతయు జరిగెను” అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. యేసు జననం యాదృచ్ఛిక సంఘటన కాదు. అది దేవుని నిత్య ప్రణాళికలో భాగం. దేవుడు శతాబ్దాల క్రితమే ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన మాట ఇప్పుడు చరిత్రలో నెరవేరుతోంది. ఈ విధంగా మత్తయి యూదులకు స్పష్టంగా “మీరు ఎదురు చూసిన మెస్సీయ వచ్చాడు” అని చెప్తున్నాడు. యెషయా 7:14లోని ప్రవచనం, “ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును; ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు.” ఈ ప్రవచనం సాధారణ మానవ జననం గురించి కాదు. కన్యకు జన్మించడం అనే అద్భుతం దేవుని ప్రత్యేక కార్యమని తెలియజేస్తోంది. ఇది యేసు పాప స్వభావంతో జన్మించిన సాధారణ మనిషి కాదని, పరిశుద్ధాత్మ వలన గర్భధారణ పొందిన పరిశుద్ధ రక్షకుడని తెలియజేస్తోంది.

ఇమ్మానుయేలు” అనే పేరులో సువార్త యొక్క మహిమ దాగి ఉంది: దేవుడు దూరంగా ఉన్న దేవుడు మాత్రమే కాదు, తన ప్రజలను విడిచిపెట్టిన దేవుడు కాదు, మన మధ్యకు వచ్చిన దేవుడు. యోహాను 1:14లో, “ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను” అనే మాట ఇదే సత్యాన్ని తెలియజేస్తోంది. దేవుని కుమారుడు మానవ స్వభావాన్ని ధరించి మన లోకంలో ప్రవేశించాడు. ఇది కేవలం దేవుడు మనుష్యులను చూసేందుకు వచ్చినట్టు కాదు; మన రక్షణ కొరకు మన స్థితిలోకి దిగి వచ్చినట్టు.

ఇమ్మానుయేలు” అనే పేరు యేసు యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది, “యేసు” అనే పేరు ఆయన కార్యాన్ని తెలియజేస్తుంది. “ఇమ్మానుయేలు” — ఆయన ఎవరు? దేవుడు మనకు తోడు. “యేసు” — ఆయన ఏమి చేస్తాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు.

ఇక్కడ ఒక గొప్ప ఓదార్పు కూడా ఉంది. పాపం కారణంగా మనుష్యులు దేవునికి దూరమయ్యారు. కానీ క్రీస్తులో దేవుడు మన దగ్గరకు వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు: దేవుని ప్రత్యక్షత, దేవుని కృప యొక్క అవతరణ, పాపులకు సమాధాన సందేశం.

అందువల్ల క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సత్యం ఇదే: దేవుడు మన రక్షణ కొరకు మనుష్యుడయ్యాడు. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు; విశ్వాసుల ఓదార్పు. ఎందుకంటే “దేవుడు మనకు తోడు” అంటే: మన బలహీనతలలో తోడు, శోధనలలో తోడు, బాధలలో తోడు, మరణంలో కూడా తోడు.

చివరికి, క్రీస్తులో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదని, తన వాగ్దానాన్ని మరువలేదని, తన కృపను సంపూర్ణంగా నెరవేర్చాడని మత్తయి ప్రకటిస్తున్నాడు.

ఈ సత్యాన్ని ఇతర లేఖన భాగాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి:

యెషయా 9:6ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యోహాను 1:1ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

1 తిమోతి 3:16నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.

24యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, తన భార్యను చేర్చుకొని 25ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

యేసేపు దగ్గరకు దూత తెచ్చిన మాటలు అత్యుత్తమమైన ప్రకటనగా చెప్పొచ్చు. మరియ నమ్మకత్వాన్ని బట్టి యోసేపుకున్న సందేహాలన్ని తొలగిపోయాయి. వాటి స్థానములో, వాగ్దానము చెయ్యబడిన మెస్సయ్య, లోక విమోచకుడైన దేవుని కుమారుని సంరక్షణను తీసుకొనే అవకాశము అతనికి ఇవ్వబడియున్నదనే అద్భుతమైన శుభవార్తను యేసేపు అందుకున్నాడు. దేవదూత ద్వారా వచ్చిన ప్రకటన యోసేపు యొక్క సందేహాలను తొలగించి, అతనికి దేవుని రక్షణ ప్రణాళికలో తన స్థానాన్ని తెలియజేసింది.

మత్తయి స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే: యోసేపు దేవదూతను నమ్మాడు, ఆలస్యం చేయకుండా విధేయత చూపించాడు, మరియను తన భార్యగా స్వీకరించాడు, ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు.

ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను” అనే మత్తయి 1:25 వాక్యంపై క్రైస్తవ లోకంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇది చర్చ్ చరిత్రలో చాలాకాలంగా చర్చించబడిన అంశం.

కాథలిక్కులు మరియను “బ్లెస్డ్ వర్జిన్” అని చెప్తూ, ఆమె యేసుకు జన్మనిచ్చిన తరువాత తన జీవితాంతం కన్యగానే ఉండి పోయిందని వాళ్ళు బోధిస్తారు. అనేక లూథరన్ చర్చి, రిఫార్మ్డ్ చర్చిస్ మరియు ఇతర ప్రొటెస్టంట్ సంప్రదాయాలలో, మరియను “కన్య” అని సూచించినప్పుడు, యేసు జననం తరువాత మరియ యోసేపులు సాధారణ దాంపత్య జీవితం గడిపి ఉండవచ్చని యేసు తర్వాత, మరియ యేసేపులకు పిల్లలు ఉండొచ్చని వాళ్ళు భావిస్తారు.

ఈ భిన్నాభిప్రాయాలకు కారణం, క్రొత్తనిబంధనలో ప్రభువుయొక్క “సోదరులు” మరియు “సహోదరీలు” అని ప్రస్తావించ బడిన దాదాపు పది సందర్భాలు ఉన్నాయి (మత్తయి 12:46;  13:55; మార్కు 3:31-34; మార్కు 6:3; లూకా 8:19–20; యోహాను 2:12, 7:3,5,10; అపొస్తుల కార్యములు 1:14; 1 కొరింథీయులకు 9:5). “సోదరులు” మరియు “సహోదరీలు” (గ్రీకు: అడెల్ఫోస్/అడెల్ఫ్) అనే పదానికి బైబిల్లో విస్తృతమైన అర్థం ఉంది. “సోదరులు” మరియు “సహోదరీలు” అనే పదం ఎల్లప్పుడూ ఒకే భూసంబంధమైన తలితండ్రులకు జన్మించిన పిల్లలకు మాత్రమే వర్తించదు. కొన్నిసార్లు ఇది బంధువులు లేదా దగ్గరి బంధువుల పిల్లలకు కూడా వర్తిస్తుంది. మరియ యేసేపులకు యేసుతో పాటు ఇతర కుమారులు మరియు కుమార్తెలు ఉన్నారా లేదా అనేది నిర్ధారించడం కష్టం. ఇది సువార్త యొక్క కేంద్ర సత్యాన్ని నిర్ణయించే విషయం కాదు. కాబట్టి ఇది ఒక సమస్య కాదు భిన్నాభిప్రాయాలు మాత్రమే అని గుర్తుంచుకోండి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే: యేసు కన్యకు జన్మించాడు, పరిశుద్ధాత్మ వలన గర్భధారణ పొందాడు, నిజ దేవుడు మరియు నిజ మనిషిగా లోకంలోకి వచ్చాడు.

అలాగే, యోసేపు పాత్రను తక్కువగా అంచనా వేయకూడదు. అతడు నిశ్శబ్ద విశ్వాసి, విధేయుడైన సంరక్షకుడు, దేవుని వాక్యాన్ని నమ్మిన నీతిమంతుడు. దేవుడు తన కుమారుని భౌతిక సంరక్షణ బాధ్యతను అతనికి అప్పగించాడు. ఇది యోసేపుకు గొప్ప గౌరవం మరియు గొప్ప బాధ్యత.

మత్తయి మొదటి అధ్యాయం ప్రకటించే మహిమగల సువార్త ఏమిటంటే, యేసుక్రీస్తు, అబ్రాహాము సంతానం, దావీదు చట్టబద్ధమైన వారసుడు, కన్య మరియకు జన్మించినవాడు, పరిశుద్ధాత్మ వలన గర్భధారణ పొందిన దేవుని కుమారుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన మెస్సీయుడు.

Note: నాలుగు మరియన్ సిద్ధాంతాలు రోమన్ క్యాథలిక్ చర్చి బోధనలో చాలా ముఖ్యమైనవి. అయితే, సాంప్రదాయ లూథరన్ మరియు సాధారణ ప్రొటెస్టంట్ దృక్కోణం నుండి వీటిని పరిశీలించినప్పుడు, “ఈ బోధనలను పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా బోధిస్తున్నదా?” అన్నదే ప్రధాన ప్రశ్న.

సోలా స్క్రిప్టూరా (Sola Scriptura) ప్రకారం, విశ్వాసం మరియు బోధకు తుది అధికారము దేవుని వాక్యమే. అందువల్ల ప్రతి సిద్ధాంతాన్ని లేఖనాల వెలుగులో పరీక్షించాలి.

కాథలిక్ చర్చి యొక్క నాలుగు మరియన్ సిద్ధాంతాలు:

1. దేవుని తల్లిగా మరియ దైవిక మాతృత్వం: మరియ “దేవుని తల్లి” (మదర్ అఫ్ గాడ్) అనే ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒకే వ్యక్తిలో నిజ దేవుడు, నిజ మానవుడు.

మరియ యేసు యొక్క మానవ స్వభావానికి మాత్రమే తల్లి కాదు; ఆమె జన్మనిచ్చిన వ్యక్తి దేవుని కుమారుడే. ఆ అర్థంలో, ముఖ్యంగా యేసు ఒకే వ్యక్తి అని చెప్పడానికి “దేవుని తల్లి” అనే పదాన్ని చారిత్రక క్రైస్తవ సంఘం ఉపయోగించింది. కాని దీనిని తప్పుగా అర్థం చేసుకొని, మరియ దేవునికి మూలం, త్రిత్వానికి తల్లి, లేదా దైవ స్వభావానికి ఆరంభం అని అనుకోవడం తప్పు.

    లూకా 1:43లో ఎలిజబెత్: “నా ప్రభువు తల్లి” అని మరియను సంబోధిస్తుంది. కాబట్టి ఈ పదాన్ని సరైన క్రీస్తు శాస్త్ర పరిమితిలో ఉపయోగిస్తే సమస్య లేదు/కాదు. కానీ మరియను అతిగా ఘనపరచడానికి ఇది ఉపయోగిస్తే మాత్రం అది ప్రమాదకరం.

    2. “ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్” — మరియ జన్మపాపం లేకుండా పుట్టిందా? ఈ సిద్ధాంతం 1854లో Pope Pius IX ద్వారా అధికారికంగా ప్రకటించబడింది.

    దీని ప్రకారము, యేసు తల్లి అయిన మరియ జన్మపాపము లేకుండా నీతిమంతురాలిగా జన్మించబడినదని చెప్పబడింది. దీని అర్థం ఆమె ఆదాము అవిధేయత ఫలితంగా వచ్చిన జన్మపాపము లేకుండా పుట్టింది మరియు తద్వారా ఆమె జీవితాంతం వ్యక్తిగత పాపం నుండి విముక్తి పొందింది. ఈ ప్రత్యేకత దేవుని తల్లిగా ఆమె పాత్రకు అవసరమైన తయారీగా పరిగణించబడుతుంది, ఇది ఆమె పరిశుద్దాత్మను మరియు దేవుని కృపను పూర్తిగా స్వీకరించడానికి వీలు కల్పించింది అని చెప్తుంది.

    కాని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా, “అందరును పాపము చేసిరి” (రోమా 3:23) అని చెప్తుంది. మరియ కూడా రక్షకుడు అవసరమైన పాపినే అని లూకా 1:47లో, “నా రక్షకుడైన దేవుని యందు” అని ఆమె చెప్పడం ద్వారా తెలుస్తోంది.

    బైబిల్ ఎక్కడా, మరియ జన్మపాపం లేకుండా పుట్టిందని, ఆమె జీవితాంతం పాపరహితురాలని బోధించదు.

    యేసుక్రీస్తు మాత్రమే పాపరహితుడు (హెబ్రీ 4:15). అందువల్ల ఈ సిద్ధాంతానికి స్పష్టమైన లేఖన ఆధారం లేదు.

    3. శాశ్వత కన్యత్వం (Perpetual Virginity): ఈ విషయంపై చరిత్రలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాథలిక్కులు మరియను “బ్లెస్డ్ వర్జిన్” అని చెప్తూ, ఆమె యేసుకు జన్మనిచ్చిన తరువాత తన జీవితాంతం కన్యగానే ఉండిపోయిందని నమ్ముతారు. ఇది దేవుని పట్ల మరియ యొక్క పూర్తి అంకితభావాన్ని మరియు మెస్సీయ తల్లిగా ఆమె ప్రత్యేక పాత్రను నొక్కి చెప్తుంది.

    మత్తయి 1:25, “ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను” అని చెప్తుంది. అలాగే యేసు యొక్క “సోదరులు” మరియు “సహోదరీలు” గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించబడింది. వీరు సహజ సహోదరులా? బంధువులా? అనే ప్రశ్నపై క్రైస్తవుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ దీనిని పూర్తిగా వివరిస్తుంది అని చెప్పడం కష్టం. కాబట్టి, మరియ యేసు తరువాత కూడా కన్యగానే ఉందని ఖచ్చితంగా చెప్పలేం, అలాగే ఆమెకు ఇతర పిల్లలు ఖచ్చితంగా ఉన్నారని కూడా సంపూర్ణ నిర్ధారణతో చెప్పడం కష్టం. ఇది సువార్త యొక్క కేంద్ర సిద్ధాంతం కాదు.

    4. మరియ శరీరంతో స్వర్గానికి ఎత్తబడిందా? (Assumption of Mary): ఈ సిద్ధాంతం 1950లో Pope Pius XII ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ఈ సిద్ధాంతం, ఆమె భూసంబంధమైన జీవిత ముగింపులో, మరియ శరీరం మరియు ఆత్మతో స్వర్గానికి తీసుకెళ్లబడిందని చెప్తుంది.

    కాని పరిశుద్ధ గ్రంథంలో, మరియ మరణం గురించి, ఆమె సమాధి గురించి, లేదా ఆమె శరీరంతో స్వర్గానికి తీసుకుపోయబడిన విషయం గురించి ఏ స్పష్టమైన బోధన లేదు. ఎలీయా, హనోకు వంటి వ్యక్తుల విషయంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ మరియ విషయంలో అలాంటి ప్రకటన లేదు. అందువల్ల ఈ సిద్ధాంతం అపొస్తలిక బోధన ఆధారంగా కాక, తరువాతి సంఘ సంప్రదాయ అభివృద్ధిగా కనిపిస్తుంది.

    ముఖ్యమైన విషయం మరియను గౌరవించాలి: ఆమె విశ్వాసవంతురాలు, దేవుని కృపచేత ఎన్నుకోబడిన సేవకురాలు, రక్షకుని తల్లి.

    కాని ఆమెను: మధ్యవర్తిగా, కృపల పంపిణీదారుగా, లేదా దాదాపు దేవత్వ స్థాయికి ఎత్తడం లేఖనాలకు మించినది.

    1 తిమోతి 2:5 స్పష్టంగా “దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే — మనుష్యుడైన క్రీస్తుయేసు” మాత్రమేనని చెప్తుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్రం మరియ కాదు — యేసుక్రీస్తు.

    మరియ కూడా స్వయంగా: “ఆయన చెప్పినదంతయు చేయుడి” (యోహాను 2:5) అని చెప్తూ ప్రజలను తనవైపుకు కాదు, క్రీస్తువైపుకు తిప్పింది.

    దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

    KURAPATI VIJAY KUMAR,
    HDFC BANK, Account no 50200096563465,
    IFSC code. HDFC0005872,
    Swift code HDFCINBB,
    JKC College Road Branch, GUNTUR 522006,
    ANDHRA PRADESH, INDIA.
    The phone pay UPI Id : 9848365150-2@ybl