ఆస్తిక పరిణామ సిధ్ధాంతాన్ని అంగీకరించడంలో వేదాంతపరమైన సమస్యలు ఏమిటి?

ఆస్తిక పరిణామ సిద్ధాంతం అంటే దేవుడు జీవులను నేరుగా సృష్టించకుండా, పరిణామ ప్రక్రియ (Evolution) ద్వారా అభివృద్ధి చెందేలా చేశాడని నమ్మడం. సహజ ప్రక్రియలు దైవికంగా నడిపించబడ్డాయని సూచించడం ద్వారా ఆధునిక పరిణామ శాస్త్రాన్ని బైబిల్ విశ్వాసంతో కలపడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఈ అభిప్రాయాన్ని కొంతమంది క్రైస్తవులు, ముఖ్యంగా విద్యాధికులలో చాలా మంది అంగీకరిస్తున్నారు. అయితే సాంప్రదాయ క్రైస్తవ సిద్ధాంతం యొక్క లెన్స్ ద్వారా పరిశీలించినప్పుడు ఇది అనేక ముఖ్యమైన వేదాంత సమస్యలను లేవనెత్తుతుంది.

దేవుని గొప్ప లక్షణాలలో సర్వశక్తిమంతత్వము (ఊహించలేని అనంతమైన ఆయన శక్తిని) సర్వాంతర్యామి (ఒకే టైములో అంతటను ఉండటం) సర్వమును యెఱుగుట (జరుగుతున్న జరగబోవుతున్న ప్రతి విషయము ఆయనకు ముందే తెలిసి ఉండటం) సమస్తమును చూడగలగటం అనే లక్షణాలు మరియు ఆయన గుణగణాలు శాస్త్రీయముగా మనుష్యులమైన మనకు అర్ధం కాని విషయాలు, మన సైన్స్ శాస్త్రీయముగా నిరూపించ లేని విషయాలు. కాబట్టే వీటిని అర్ధం చేసుకోవడంలో మనుష్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవునిని అర్ధం చేసుకోవడమంటే నీటిలో కొట్టుకు పొతూ ఉన్నప్పుడు నీటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలాంటిది. సహజ వివరణలను ఉపయోగించి సహజ దృగ్విషయాలను పరిశోధించడానికే సైన్స్ పరిమితం అనే విషయాన్ని మనుష్యులు ఎరిగియున్నప్పటికిని అతిశయించటం ఎంతవరకు సబబో చెప్పండి.

హేతుబద్ధంగా పరిణామ సిధ్ధాంతాన్ని చూడడమంటే, దేవుడు జీవులను సృష్టించేందుకు అత్యంత సుదీర్ఘమైన బాధాకరమైన వాటి మనుగడకు పరిణామ ప్రక్రియను ఉపయోగించుకొనియున్నాడేమో, సైన్స్ కూడా ఈ సృష్టి ఉనికి లోనికి రావడానికి కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అని చెప్తూ ఉంది కదా, మరి ఈ విషయాన్ని క్రైస్తవులుగా మనం నమ్మితే తప్పేంటి అని మీలో కొందరు ప్రశ్నించొచ్చు.

దేవునికి the slow process of evolution and the “survival of the fittest” (నెమ్మదిగా జరిగే పరిణామ ప్రక్రియ పోరాటంలో అన్నింటిని తట్టుకొని దాటుకొంటూ ముందుకెళ్తున్న బలమైన జీవులు) అనే క్రూరమైన పద్ధతి అవసరం లేదు అంటే జీవులు కాలక్రమేణా జన్యుపరంగా ప్రవర్తనలో మార్పు చెందుతూ పరిస్థితులకు తగ్గట్లుగా రూపాంతరం చెందుతూ మరింత సంక్లిష్టంగా అవి పెరిగేకొద్దీ, అవి వనరుల కోసం పోటీ పడుతూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడ కొరకు పోటీ సాగిస్తూ ఇప్పటి స్థాయికి చేరుకొన్న క్రూరమైన పద్ధతిని దేవుడు ఎన్నుకోలేదనే విషయాన్ని బైబులు చెప్తూవుంది.

డార్వినియన్ పరిణామం అనేది మనిషి జంతువు అంటే కోతినుండి నెమ్మదిగా మానసికముగా అభివృద్ధి చెంది ఉద్భవించాడని చెప్తుంది. అయితే ఇప్పటివరకు ఎవ్వరు దీనిని నిరూపించలేకపోయారు. ఈ పరిణామ క్రమములో ఎన్నో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. ఒకవేళ డార్వినియన్ పరిణామ సిధ్ధాంతము (Evolution theory) అనేది నిజమైతే మనిషి నెమ్మదిగా మానసికముగా అభివృద్ధి చెందిన ఒక జంతువు మాత్రమే.      

కొందరు చెప్తున్నట్లుగా దేవుడు కోట్ల సంవత్సరాలలో విశ్వాన్ని అందులోని వాటిని సృష్టించడానికి పరిణామ ప్రక్రియను ఉపయోగించాడనే చెప్పడంలో ఒప్పుకోవడంలో సీరియస్ థియోలాజికల్ ప్రొబ్లెమ్స్ ఎన్నో ఉన్నాయి. బాధాకరమైన విషయమేమిటంటే క్రైస్తవత్వములోని అనేక తెగలు మరియు చర్చిలు పరిణామము (Evolution) అనే ఈ సిద్ధాంతాన్ని అంగీకరించటం నిజముగా విచారించదగిన విషయం.

పరిణామములో (Evolutionలో) ఉన్న థియోలాజికల్ ప్రొబ్లెమ్స్ ఏమిటంటే, ఇది బైబులుతో విభేదిస్తూ ఉంది. ఎలా విభేదిస్తూ ఉందో వివరంగా చెప్తాను:

మొదటిగా, బైబిల్ దేవుడు తన వాక్యముతో సృష్టిని ఉనికిలోకి తెచ్చాడని బోధిస్తుంది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను, కీర్తనలు 33:6,9. అట్లే యెషయా 45:12, భూమిని కలుగజేసిన వాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని అని చెప్తూ ఉండగా, మనం పరిణామ సిధ్ధాంతాన్ని (Evolution theoryని) నమ్మినట్లయితే దేవుని మాటలను తృణీకరిస్తూ ఉన్నట్లేగా. ఎందుకంటే పరిణామ సిద్ధాంతం ప్రకారం జీవజాలం కోట్ల సంవత్సరాల పాటు క్రమంగా అభివృద్ధి చెందిందని చెప్తుంది. జ్ఙాని సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సృష్టిని ఆరు రోజులలో అంటే 144 గంటలలో చేసాడని బైబులు చెప్తూ ఉంటే, పరిణామ సిధ్ధాంతము దేవుని జ్ఙానాన్ని, సర్వశక్తిమంతత్వాన్ని తగ్గిస్తూ ఈ సృష్టిని చెయ్యడానికి దేవుడు కోట్ల సంవత్సరాలను తీసుకున్నాడని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి ఈ స్థాయికి రావడానికి దేవుడు అందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తూ మార్పులు చేస్తూ వచ్చిన ఒక మామూలు ఆవిష్కర్తగా ఆయనను గురించి చెప్తుంది. దీనివల్ల బైబిల్‌లోని సృష్టి వృత్తాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న వస్తుంది.

అట్లే దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొనిన ఏడవ దినమును పరిశుద్ధముగా ఆచరింపుము అనే దేవుని ఆజ్ఞకు విలువలేదని అర్ధమే లేదని పరిణామ సిధ్ధాంతము (Evolution theory) తృణీకరిస్తూ ఉంది, ఒప్పుకొందామా?

బైబులు ప్రకారము మొక్కలు కీటకాల కంటే ముందు పుట్టాయి. పరిణామ సిధ్ధాంతము ప్రకారము మొక్కలు పుట్టిన తరువాత లక్షల సంవత్సరాలలో కీటకాలు పుట్టుకొచ్చాయి. మరి ఈ రెండింటి మధ్యనున్న లక్షల సంవత్సరాలలో మొక్కలు కీటకాలు అందించే పరాగ సంపర్కం లేకుండా ఎలా జీవించాయి? అనే ప్రశ్నను Evolution theory వివరించడం లేదు.

అలాగే ఈ పరిణామ సిధ్ధాంతము (Evolution theory) ఆదికాండము మొదటి అధ్యాయాలలో చెప్పబడిన సృష్టి వృత్తాంతం, మన మూలాల యొక్క నిజమైన Account కాదని ఆదాము హవ్వలు నిజం కాదని మనిషి కోతి నుండి అభివృద్ధి చెందాడని చెప్తూ ఉంది.

ఆదాము హవ్వలు దేవుని జ్ఞానములో పరిపూర్ణమైన నీతిలో, పరిశుద్ధతలో, దేవుని స్వభావము యొక్క సహజ శాస్త్రీయ జ్ఞానముతో ఆయన పోలికలో సృజింపబడ్డారని, మరణము లేనివారిగా ఉన్నారని ఈ స్థితిలో వాళ్ళు సాతానుచే శోధింపబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా బైబులు చెప్తూ “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను”అని (రోమా 5:12) తెలియజేస్తుంది. బైబిల్ మరణాన్ని “పాపం యొక్క జీతంగా” (రోమా ​​​​6:23) చెప్తూ కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని 1 కొరింథీయులు 15:26లో చెప్తూ ఉంటే మనుష్యులు ఉనికిలోకి రావడానికి ముందే లక్షలాది సంవత్సరాలకు ముందే ఈ సృష్టిలో పరాన్నజీవులు, మాంసాహారులు, వ్యాధి మరియు మరణం ఉన్నాయని పరిణామ సిధ్ధాంతము (Evolution theory) చెప్తుంది.

దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెనని, ఆదికాండము 1:31 చెప్తుంది అంటే బాధ మరియు మరణం లేని ప్రపంచం ఉందని చెప్తుంది. ఇది ఆదికాండము 2లోని ఆదాము హవ్వల చారిత్రకత వృత్తాంతాన్ని నేరుగా సవాలు చేస్తుంది. బైబిల్ ప్రకారం మరణం పాపం తరువాత ప్రపంచంలోకి వచ్చింది (రోమా 5:12; 6:23). కానీ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనుష్యులు ఉనికిలోకి రావడానికి ముందే లక్షలాది సంవత్సరాల పాటు జంతువుల మరణం, పోరాటం, వ్యాధి మరియు జీవుల నాశనం కొనసాగాయి. అప్పుడు మరణం పాప ఫలితమా, లేక సృష్టి ప్రక్రియలో భాగమా అనే వేదాంత ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పాపానికి చాలా కాలం ముందు నుండే మరణం ఉంటే, మంచి మరియు పరిశుద్దుడైన దేవుడు బాధా, నొప్పి, పోటీ మరియు మరణం ఆధారంగా సృష్టి పద్ధతిని ఎందుకు ఉపయోగించాడు? అనే ప్రశ్నను లేవనెత్తుతు పరిణామ సిధ్ధాంతము పైన పేర్కొనిన లేఖన భాగాలను తృణీకరిస్తుంది.

మానవుడు దేవుని స్వరూపంలో ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని బైబిల్ బోధిస్తుంది (ఆదికాండము 1:26-27). అయితే పరిణామ సిద్ధాంతం మనిషిని క్రమంగా అభివృద్ధి చెందిన జీవిగా వివరిస్తుంది. దీనివల్ల మానవుని ప్రత్యేకత, నైతిక బాధ్యత, మరియు ఆత్మీయ స్వభావం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి.

పరిణామ సిద్ధాంతం చాలాసార్లు ఆదాము మరియు హవ్వలను చారిత్రక వ్యక్తులుగా కాకుండా ప్రతీకలుగా చూడటానికి దారితీస్తుంది. కానీ యేసు మరియు అపొస్తలులు వారిని నిజమైన వ్యక్తులుగా ప్రస్తావించారు (మత్తయి 19:4-5; రోమా 5:12-19). ఆదాము నిజమైన వ్యక్తి కాకపోతే, పాపం ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది అనే ప్రశ్నకు సమాధానం క్లిష్టమవుతుంది.

ఆదాము హవ్వలు నిజం కానప్పుడు మొదటి పాపానికి వారిని మనం నిందించలేము. పాపం లోకము లోనికి ఎలా ప్రవేశించిందనే ప్రశ్నకు ఈ పరిణామ ప్రక్రియలో ఎటువంటి జవాబు లేదు. పరిణామ సిధ్ధాంతము ప్రకారము మనిషి దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్న ఒక జంతువు కాబట్టి నిజముగా మనలో పాపాలు ఉంటే మన పాపాలకు మనం జవాబుదారిగా ఉండనక్కర లేదు, ఎందుకంటే అప్పుడు పాపమనేది జీవులలో ఉన్న ఒక లోపము అవుతుంది. ఆ లోపానికి మనిషి బాధ్యత వహించనక్కర లేదు. అప్పుడు పాపి అనే సమస్యే లేదు. మనఃసాక్షియే లేదు. మరణాన్ని నిర్వచించాల్సి వస్తే దేవుని గొప్ప సృష్టి సాధనాలలో ఒకటిగా, మంచిదిగా అవసరమైన విషయంగా నిర్వచించాల్సి ఉంది.

క్రైస్తవ సువార్త మొత్తం పతనం (Fall), పాపం, మరియు విమోచన (Redemption) మీద ఆధారపడి ఉంది. బైబిల్ ప్రకారం ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, అలాగే ఒక మనుష్యుడైన క్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. ఆదాము చారిత్రక వాస్తవం కాకపోతే, క్రీస్తు చేసిన విమోచన కార్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న లేవనెత్తబడుతుంది.

మరణం పాపానికి శిక్ష అని మనం చెల్లించవలసిన పాపానికి శిక్ష చెల్లించడానికే యేసు సిలువపై మరణించాడని బైబిల్ చెప్తూ ఉంది. రక్షణ ప్రణాళిక మానవులను నిత్యజీవం లోనికి తిరిగి తీసుకురావడానికి రూపొందించబడింది. పరిణామ సిధ్ధాంతము (Evolution theory) ప్రకారం ఆదామే నిజం కాకపోతే, క్రీస్తు లేనే లేడు రక్షణే లేదు కదండి.

పాతనిబంధన మరియు క్రొత్తనిబంధన రెండింటి రచయితలు సృష్టి వృత్తాంతాన్ని ఖచ్చితమైన చరిత్రగా స్పష్టంగా అంగీకరించారు: దావీదు (కీర్తన 33:6,9 లో; నెహెమ్యా (నెహెమ్యా 9:6 లో; యెషయా 45:18 లో), పౌలు (కొలొస్సయులు 1:15-17 లో), యేసు (మత్తయి 19:4 లో) ఆదాము హవ్వలను గురించి ప్రస్తావిస్తూ, “సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెనని” వారిని గురించి తెలియజేస్తూ ఉంటే మనమేమో (పరిణామ సిధ్ధాంతాన్ని) Evolution theoryని అంగీకరిస్తూ పరిణామ సిధ్ధాంతాన్ని (Evolution theoryని) నమ్ముతూ  తప్పేంటి అని అడుగుతున్నాం. కరెక్టేనంటారా, ఆలోచించండి.

ఆదికాండము యొక్క ప్రారంభ అధ్యాయాలు చారిత్రక రికార్డుగా నమ్మదగినవి కాకపోతే, మిగిలిన లేఖనాలను మనం ఎలా అర్థం చేసుకోగలం? నమ్మగలం? ఆస్తిక పరిణామ సిధ్ధాంతం బైబిల్ అధికారాన్ని ప్రశ్నిస్తుంది. వివాహం, సబ్బాత్ మరియు మానవ గుర్తింపుతో సహా ఆదికాండములో ఉన్న కీలక సిద్ధాంతాలపై సందేహాన్ని కలిగిస్తుంది. మనం బైబిల్ Creation account యొక్క ఖచ్చితత్వాన్ని తోసిపుచ్చినట్లయితే, లేఖనాల యొక్క ఇతర భాగాల విషయములోను యేసు మరియు ఇతర బైబిల్ రచయితలు చెప్పిన వాటి విషయములో ఇది నిజమా ఇలా జరిగేందుకు ఆస్కారముందా అని ప్రశ్నించుకొంటూ ఇలా కాకపోయి ఉండొచ్చు అని ఒక ముగింపుకు వచ్చి లేఖనాలపై మనలను మనం న్యాయమూర్తులుగా ఉంచుకొనే ప్రమాదముంది.

దేవుడు మానవులకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆదాము హవ్వలు దేవునికి లోబడాలా లేదా అనే విషయములో దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. Evolution theory, ఫ్రీ విల్ అనేది ఒక భ్రమ అని చెప్తూ మనం ఎంచుకొనే choices కేవలం మన జన్యువులు లేదా మన చుట్టుపక్కల వాతావరణం ద్వారా నిర్ణయించబడిన Actions లేదా Behaviors మాత్రమే నిర్ణయిస్తాయని చెప్తూవుంది.

బైబిలుకు దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు అని బైబులు చెప్తూవుంటే Evolution theory  బైబిలును తిరస్కరిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాలలోని ప్రతి అధ్యాయాన్ని ప్రతి మాటను దేవుని మాటలుగా మనం విశ్వసించకపోతే, అశాస్త్రీయమైన Evolution లేఖనాలలోని అద్భుతాలు, యేసు పునరుత్థానం మరియు సువార్త వంటి చాలా విషయాలలో సందేహాలను లేవనెత్తుతూ ఉంటే విశ్వాసులమైన మనం కొన్ని లేఖన భాగాలను సందేహిస్తూ వాటిని తృణీకరిస్తూ క్రైస్తవులుగా మనలను మనం పిలుచుకొందామా? 

ఆస్తిక పరిణామవాదులు తరచుగా పరిణామం దేవునిచే “నిర్దేశం” చేయబడిందని చెబుతారు, కాని దీనిని శాస్త్రీయంగా ప్రదర్శించడం కష్టం. ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని, సర్వశక్తిమంతత్వాన్ని మరియు ఆయన ఉద్దేశ్యాన్ని గురించి ఫిలసాఫికల్ ప్రశ్నలను లేవనెత్తుతూ, దేవుడు ఒక తెలివైన డిజైనర్ అనే బైబిల్ చిత్రాన్ని సవాలు చేస్తుంది. ఆయన యాదృచ్ఛికంగా ఈ సృష్టిని సృష్టించలేదు, లేదా ఈ సృష్టిని సృష్టించడానికి దీర్ఘ యుగాలను తీసుకోలేదు. ఆయన తన మాట ద్వారా ఈ సృష్టిని 6 రోజులలో సృష్టించాడని బైబులు చెప్తుంది.

విజ్జులైన మీరు ఆలోచించండి. క్రైస్తవుడిగా ఉండడం అంటే బైబిల్ను దేవుని ప్రామాణికమైన, నమ్మదగిన వాక్యమని, క్రీస్తు మన సృష్టికర్త మరియు రక్షకుడని విశ్వసించడం. మనం దేవుని పోలికలో దేవునిచే సృజింపబడినవారం తప్ప ఒక కోతి నుండి కోట్ల సంవత్సరాలలో జన్యుపరంగా, ప్రవర్తనలో మార్పు చెందుతూ పరిస్థితులకు తగ్గట్లుగా రూపాంతరం చెందుతు వనరుల కోసం పోటీ పడుతూ పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడకొరకు పోటీ సాగిస్తూ ఇప్పటి స్థాయికి చేరుకొన్న మానసికముగా అభివృద్ధి చెందిన ఒక జంతువు మాత్రము కాదు. నమ్మండి.

నిజానికి, మానవులు ఎప్పటి నుండి తమ ప్రతి రూపాలను కలిగి ఉన్నారు? నైతిక బాధ్యత ఎప్పటి నుండి ప్రారంభమైంది? మానవుల ఆధ్యాత్మిక ప్రత్యేకతను, గౌరవాన్ని దెబ్బతీయకుండా వీటికి సమాధానం ఇవ్వడానికి ఆస్తిక పరిణామం కష్టపడుతోంది.

యేసు ఆదాము హవ్వలు, నోవహు మరియు సృష్టి వృత్తాంతాన్ని నిజమైన చరిత్రగా పేర్కొన్నాడు (ఉదా. మత్తయి 19:4–5; లూకా 17:26–29). ఈ కథలు పురాణాలు లేదా చిహ్నాలు అయితే, యేసు అబద్ధమైన దాన్ని నమ్మాడని లేదా మానవ తప్పిదానికి అనుగుణంగా ఉన్నాడని సూచిస్తుంది. ఇది ఆయన దైవిక అధికారాన్ని ఆయన మాటల విశ్వసనీయతను బలహీనపరుస్తుంది.

కొత్త నిబంధన రచయితలు కూడా ఆదికాండాన్ని చారిత్రకంగా స్థిరమైనదిగా పరిగణిస్తారు. దాని చారిత్రక విశ్వసనీయతను తిరస్కరించడం ఆదికాండాన్ని మాత్రమే కాకుండా, నిజమైన పాపం, నిజమైన పతనం మరియు నిజమైన విమోచనపై ఆధారపడిన సువార్త పునాదిని కూడా ప్రభావితం చేస్తుంది.

Theistic evolution theory ని నమ్మడంలో Theistic evolution theory ని అంగీకరించడంలో ఎన్నో థియోలాజికల్ ప్రొబ్లెమ్స్ ఉన్నాయి, విజ్జులైన మీరు ఆలోచించండి. ఆస్తిక పరిణామం విశ్వాసం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఇది లోతైన వేదాంత సవాళ్లను అందిస్తుంది. ఇది ఆదాము హవ్వల చారిత్రక వాస్తవికతను ప్రశ్నిస్తుంది, మరణం యొక్క మూలాన్ని పునర్నిర్వచిస్తుంది, లేఖనాల అధికారాన్ని బలహీనపరుస్తుంది, దేవుని పాత్ర గురించి ఆందోళనలను లేవనెత్తుతుంది, మానవత్వం యొక్క ప్రత్యేకతను అస్పష్టం చేస్తుంది మరియు యేసు మరియు అపొస్తలుల బోధనలతో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఇవి చిన్న విభేదాలు కావు. కాని సృష్టి, పతనం మరియు విమోచన యొక్క క్రైస్తవ అవగాహనను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలు. ఈ కారణాల వల్ల, చాలా మంది వేదాంతవేత్తలు మరియు విశ్వాసులు ఆస్తిక పరిణామాన్ని తిరస్కరిస్తున్నారు.

సంప్రదాయ లూథరన్ మరియు ఇతర సాంప్రదాయ క్రైస్తవ వేదాంతవేత్తలు ఈ కారణాల వల్ల ఆస్తిక పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించడంలో జాగ్రత్త వహిస్తారు. వారి అభిప్రాయం ప్రకారం, ఇది సృష్టి, పాపం, మరణం, ఆదాము, క్రీస్తు, మరియు విమోచన గురించి బైబిల్ బోధించే ముఖ్యమైన సిద్ధాంతాలపై ప్రభావం చూపవచ్చు.

అందువల్ల ఈ చర్చ కేవలం శాస్త్రం గురించి మాత్రమే కాదు. ఇది సృష్టి, పతనం, రక్షణ, మరియు యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన విమోచన కార్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రాథమిక క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన విషయం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl