అంశము: యాకోబు–ఏశావుల కథలో వాళ్లిద్దరూ, ఇస్సాకు–రిబ్కాలు కూడా చెల్లించిన వెల ఎంతో మీకు తెలుసా?

ఏశావు జేష్ఠత్వమును అమ్ముకోవడం

ఆదికాండము 25:21-34_21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె– ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగవెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– 23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. 25మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. 26తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు. 27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 28ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను. 29ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి 30–నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. 31అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా 32ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను 33యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా 34యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అట్లే ఆదికాండము 27:1-46 వచనాలలో యాకోబు ఇస్సాకును దీవెనల విషయములో మోసగించడాన్ని ఎలా అర్ధం చేసుకొందాం?

  1. ఏశావు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తుంది?
  2. యాకోబు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తుంది?
  3. ఇస్సాకుకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని? రిబ్కాకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని?
  4. వీరి ఇష్టాలు త్రీవ్రమైన ఒక సమస్యకు కారణమయ్యాయి. ఎలా?
  5. జేష్ఠత్వముతో ఏయే విషయాలు ముడిపడున్నాయి?
  6. ఏశావుకు జేష్ఠత్వము దానితో ముడిపడియున్న విషయాలను గురించి తెలుసా?
  7. ఏశావు ఏ పరిస్థితులలో తన జేష్ఠత్వాన్ని తృణీకరించాడు?
  8. ఏశావు బ్రష్టుడు వ్యభిచారి అని చెప్పబడింది కదా ఆ మాటలకు అర్ధమేమి?
  9. యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకన్నాడు గదా. ఏశావు ఇలా ఎందుకన్నాడు?
  10. ఏశావు దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను తెలిసే అమ్ముకొన్నాడని ఎలా చెప్పగలం?
  11. సహోదరుడు ఆకలిగొని ఆహారాన్ని అడిగితే ఆ ఆహారాన్ని యాకోబు అమ్మడం అనేది మెచ్చుకోదగిన విషయమా? ఆహారాన్ని అమ్మడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
  12. ఈ విషయములో యాకోబులో మెచ్చుకోదగిన అంశము ఏంటి?
  13. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఏశావు నుండి పొందుకొన్నాడు. దానిని ఎలా నిర్ధారించుకున్నాడు?  
  14. ఏశావు ఏ విధముగా తన స్వీయ చిత్తములో  దైవిక మార్గము నుండి తొలగిపోయాడు?
  15. ఇస్సాకు నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం?
  16. ఇస్సాకు ఏశావును దీవించదలచానని అతనితో చెప్పడం రిబ్కా విని  ఆమె ఏమి చేసింది?
  17. ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలు ఏంటి? ఈ దీవెనలు ఏశావుకు ఇస్సాకు ఇవ్వవలసినవా ?
  18. ఇస్సాకు ఎందుకని వణికాడు?
  19. జరిగిన దానిలో ఏశావు దేవుని హస్తాన్ని ఎందుకని చూడలేక పోయాడు?
  20. ఇస్సాకు కుటుంబంలోని నలుగురు అధర్మముగా ప్రవర్తించడాన్ని బట్టి వాళ్ళు చెల్లించిన వెల ఏంటి?
  21. దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో నిత్యరక్షణకు కొందరు నిత్యత్వములో కృపలో ఏర్పరచబడ్డారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడ్డారని చెప్పొచ్చు. అలాగే మఱొకప్రక్క కొందరు ఉగ్రత కొరకు ఏర్పరచబడ లేదని అంటే నరకానికి ముందుగానే నిర్ణయింపబడలేదని మనం చెప్పొచ్చు. ఈ మాట కరెక్ట్ ఆ లేక తప్పా?    

యాకోబు, ఏశావుల కథ (ఆదికాండము 25–36) ప్రధానంగా ఆదికాండము 25–36 అధ్యాయాలలో కనిపిస్తుంది. బైబిలులో దేవుని సార్వభౌమ ఎంపికను స్పష్టంగా చూపించే సంఘటనలలో ఈ కథ ఒకటి. ఇస్సాకు, రిబ్కాలకు కవల కుమారులు పుట్టారు. వారిలో ఏశావు మొదట జన్మించాడు, యాకోబు తరువాత జన్మించాడు. సాధారణంగా మొదటి కుమారుడికే జేష్ఠత్వ హక్కు, కుటుంబ నాయకత్వం, మరియు నిబంధన ఆశీర్వాదం దక్కాలి. కానీ దేవుడు మొదట జన్మించిన ఏశావును కాకుండా, దేవుడు చిన్నవాడైన యాకోబును ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు?

దీనికి మొదటి కారణం దేవుని సార్వభౌమ సంకల్పం. కవలలు ఇంకా పుట్టకముందే దేవుడు రిబ్కాతో, “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” (ఆదికాండము 25:23) అని చెప్పాడు. అంటే, దేవుని నిర్ణయం వారి జన్మక్రమం లేదా వారి పనుల మీద ఆధారపడలేదు. అది పూర్తిగా ఆయన చిత్తం ప్రకారమే జరిగింది.

అపొస్తలుడైన పౌలు రోమా 9:10–16లో ఈ ఆలోచనను విస్తరిస్తూ ఇలా వ్రాశాడు: రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది. కాబట్టి యేమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు– ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను, ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును. అంటే, పిల్లలు ఇంకా పుట్టకముందే, వారు మంచి గాని చెడు గాని ఏమీ చేయకముందే దేవుడు యాకోబును ఎంచుకున్నాడు. దీని ద్వారా రక్షణ, దేవుని ఆశీర్వాదం మన పనుల వల్ల కాదు; దేవుని కృప మరియు పిలుపు వల్లనే లభిస్తుందని బైబిల్ బోధిస్తుంది.

దేవుని ఎంపిక మానవ యోగ్యత పై ఆధారపడి ఉండదు. దైవిక ఎన్నిక యొక్క చర్య—దేవుని సార్వభౌమ ఎంపిక ద్వారా జరుగుతుంది. దేవుని ఎన్నిక/ ఉద్దేశ్యం క్రియల ద్వారా కాదు, పిలిచిన వ్యక్తి ద్వారా జరుగుతుందని రిబ్కాకు చెప్పబడింది.

ఆ కాలపు సంస్కృతి ప్రకారం మొదటి కుమారుడికే కుటుంబ నాయకత్వం, వారసత్వం, నిబంధన ఆశీర్వాదాలు దక్కాలి. ఆ ప్రకారం చూస్తే ఏశావే సహజమైన ఎంపిక. కానీ దేవుడు యాకోబును ఎంచుకున్నాడు. దేవుడు యాకోబును ఎంచుకోవడం ద్వారా తన కార్యాలు మానవ సంప్రదాయాలకు లేదా అంచనాలకు పరిమితం కావని చూపించాడు. తద్వారా దేవుడు మానవ సంప్రదాయాలను అనుసరించేవాడు కాదని, తన విమోచన ప్రణాళికను తన చిత్తప్రకారమే నెరవేర్చుతాడని తెలుస్తుంది.అంతేకాదు, రాబోయే మెస్సీయా వంశం కూడా యాకోబు ద్వారా కొనసాగాలని దేవుడు ముందే నిర్ణయించాడు. ఇది యాకోబు గొప్పవాడు కాబట్టి కాదు; దేవుడు అలా కోరుకున్నాడు కాబట్టి.

మలాకీ 1:2-3లో దేవుడు, “నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని” అని చెప్పాడు. ఈ మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ “ద్వేషించుట” అంటే వ్యక్తిగత ద్వేషం కాదు; “తక్కువగా ప్రేమించడం” లేదా “ఎంపిక చేయకపోవడం” అనే భావంలో ఉపయోగించబడింది. అంటే దేవుడు తన విమోచన ప్రణాళికలో యాకోబును ఎన్నుకున్నాడు, ఏశావును కాదు. ద్వేషం యొక్క అర్థాన్ని ఒకరు తప్పుగా అర్ధం చేసుకొంటే, వాళ్ళు దేవుని ప్రేమను కూడా ప్రశ్నార్థకం చేస్తారు.

నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని” (మలాకీ 1:2-3) అనే వాక్యంలోని “ద్వేషించుట” అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. దీనిని దేవుడు ఏశావుపట్ల కోపం, పగ లేదా ప్రేమలేమితో ఉన్నాడని అర్థం చేసుకుంటే, అది బైబిలు బోధించే దేవుని స్వభావానికి విరుద్ధమవుతుంది. ఎందుకంటే అదే బైబిలు “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” (యోహాను 3:16) అని స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఇక్కడ “ద్వేషించుట” అంటే ఎన్నుకోకపోవడం, తక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, లేదా దేవుని విమోచన ప్రణాళికలో యాకోబును ఎంచుకుని ఏశావును ఆ స్థానానికి ఎన్నుకోకపోవడం అనే భావంలో అర్థం చేసుకోవాలి. ఇది వ్యక్తిగత ద్వేషాన్ని కాకుండా, దేవుని సార్వభౌమ ఎంపికను సూచిస్తుంది. అదే సమయంలో, దేవుడు పాపాన్ని ద్వేషించినప్పటికీ, పాపులను రక్షించడానికి తన కుమారుడిని ఇచ్చేంతగా ప్రేమించాడు. అందువల్ల, ఈ రెండు వాక్యాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు; సరిగా అర్థం చేసుకుంటే అవి దేవుని న్యాయాన్ని, కృపను మరియు ప్రేమను సమతుల్యంగా వెల్లడిస్తాయి.

అయితే బైబిల్ మరో సత్యాన్ని కూడా బోధిస్తుంది. దేవుడు ప్రేమగలవాడు, అలాగే పరిశుద్ధుడు మరియు న్యాయవంతుడు. ఆయన పాపాన్ని అసహ్యించుకుంటాడు, అయితే పాపులను రక్షించాలని కోరుకుంటాడు. కీర్తన 5:5లో పాపాన్ని చేసే వారిని దేవుడు అసహ్యించుకుంటాడని చెప్పబడింది. అదే సమయంలో యెహెజ్కేలు 33:11లో, “దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” అని దేవుడు ప్రకటించాడు. రోమీయులు 5:8 ప్రకారం, “మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు.” కాబట్టి దేవుడు పాపాన్ని ద్వేషించినప్పటికీ, పాపులను ప్రేమించి వారి రక్షణ కోసం తన కుమారుడిని ఇచ్చాడు.

కాబట్టి యాకోబు ఎంపిక పూర్తిగా దేవుని కృప వల్ల జరిగింది. అదే సమయంలో, ఏశావు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా తన జేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని తక్కువగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఏశావు చేసిన ఆ నిర్ణయాలు ఏమిటి, వాటి వల్ల అతడు చెల్లించిన వెల ఎంత అనే విషయాన్ని పరిశీలిద్దాం.

ఆదికాండము 25:27 ప్రకారం, ఏశావు మరియు యాకోబు పెద్దవారైన తరువాత వారి స్వభావాల్లో స్పష్టమైన తేడా కనిపించింది. ఏశావు వేటలో నేర్పరియై, అడవుల్లో సంచరిస్తూ జీవించే అరణ్యవాసిగా ఉండేవాడు. వేటలో ఉండే సాహసం, ఉత్సాహం, ప్రమాదం అతనికి ఎంతో ఇష్టం. అందువల్ల అతడు ఎక్కువ సమయం అడవుల్లో గడుపుతూ సాహసోపేతమైన జీవితాన్ని ఆనందించేవాడు. మరోవైపు, యాకోబు ప్రశాంత స్వభావం కలిగినవాడై గుడారాల్లో నివసించేవాడు. ఏశావు వేటాడి తెచ్చిన మాంసం ఇస్సాకుకు ఎంతో ఇష్టమైనందున, అలాగే తనలో లేని సాహసగుణాన్ని కుమారుడైన ఏశావులో చూసినందున, ఇస్సాకు అతనిపై ప్రత్యేకమైన ప్రేమను చూపించాడు.

మరోవైపు, యాకోబు నెమ్మదస్తుడు. ఏశావులా సాహసాలు, ప్రమాదాలు కోరుకునేవాడు కాదు. అతడు గుడారాల్లో ఉండి గొర్రెల కాపరిగా జీవించడాన్ని ఇష్టపడేవాడు. తన తాత అబ్రాహాము, తండ్రి ఇస్సాకుల మాదిరిగానే ఇంటి పట్టున ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకునేవాడు. దేవుని విషయాలపై ఆసక్తి కలిగి, కుటుంబ జీవితాన్ని ఇష్టపడే స్వభావం అతనిలో కనిపిస్తుంది. అందువల్ల తల్లియైన రిబ్కా సహజంగానే యాకోబును ఎక్కువగా ప్రేమించింది.

ఇఇస్సాకు తన పిల్లలకు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను, తన కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలను, దేవునితో తమకున్న ప్రత్యేక సంబంధాన్ని తప్పకుండా బోధించి ఉంటాడు. అలాగే, కవలలు పుట్టకముందే “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని దేవుడు చెప్పిన మాటను రిబ్కా యాకోబుతో పంచుకుని ఉండవచ్చు.

అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది. ఇస్సాకు ఏశావును, రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించడం వల్ల కుటుంబంలో పక్షపాతం ఏర్పడింది. ఇస్సాకు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఏశావును ఆశీర్వదించడానికి ప్రయత్నించగా, రిబ్కా యాకోబును ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ కుటుంబ పక్షపాతం దేవుని విమోచన ప్రణాళికలో మానవ జోక్యానికి దారితీసిన ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఈ పక్షపాతమే తరువాత తీవ్రమైన విభేదాలకు దారితీసింది. అంతేకాక, దేవుడు యాకోబు ద్వారా మెస్సీయాను తీసుకురావాలనే తన ప్రణాళికను మనుషులు తమ స్వంత మార్గాల్లో నెరవేర్చాలని ప్రయత్నించే పరిస్థితిని కూడా ఇది సృష్టించింది. దీంతో కుటుంబంలో మోసం, విభేదాలు, బాధలు చోటుచేసుకున్నాయి. 

యూదుల సంప్రదాయంలో జేష్ఠత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జేష్ఠుడిగా జన్మించినవాడు ప్రత్యేకమైన హక్కులు, బాధ్యతలు పొందేవాడు. ద్వితీయోపదేశకాండము 21:17 ప్రకారం, అతడు వారసత్వంలో రెట్టింపు భాగానికి అర్హుడు. ఆదికాండము 27:29 ప్రకారం, తండ్రి తరువాత కుటుంబ నాయకత్వం, అధికారం మరియు గౌరవం జేష్ఠునికే చెందుతాయి. అతడు కుటుంబానికి నాయకుడిగా ఉండి, దేవుని భయభక్తుల్లో తన ఇంటివారిని నడిపించాల్సి ఉండేది. అంతేకాక, అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన నిబంధన వాగ్దానాలు కూడా జేష్ఠత్వంతో ముడిపడి ఉండేవి. కాబట్టి జేష్ఠత్వం కేవలం ఆస్తి గురించి మాత్రమే కాదు; అది ఆధ్యాత్మిక బాధ్యతలు మరియు దేవుని ఆశీర్వాదాలకు సంబంధించిన గొప్ప స్థానం.

అయితే, ఈ గొప్ప హక్కులన్నీ తెలిసినా, ఏశావు తన జేష్ఠత్వాన్ని విలువైనదిగా భావించలేదు. దేవుడు తనకు బహుమానంగా ఇచ్చిన ఈ ప్రత్యేక స్థానాన్ని అతడు తేలికగా తీసుకున్నాడు. మరోవైపు, యాకోబుకు కూడా జేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత బాగా తెలుసు. అందుకే దేవుని వాగ్దానాలు నెరవేరాలని అతడు కోరుకున్నాడు. అయితే, వాటి కోసం దేవుని సమయాన్ని నమ్మి ఎదురుచూడకుండా, తన స్వంత మార్గంలో వాటిని పొందడానికి ప్రయత్నించడం అతని బలహీనతగా మారింది. ఇది ఇద్దరు సహోదరుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను మనకు చూపిస్తుంది.

ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. ఈ రోజుకు కూడా సిరియా ఐగుప్తులో ఈ వంటకం వాళ్లకు ఫేవరెట్ డిష్.

యాకోబు, “నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము” అని అడిగినప్పుడు, ఏశావు “నేను చావబోవుచున్నాను గదా; జ్యేష్ఠత్వము నాకెందుకు?” అని జవాబిచ్చాడు (ఆదికాండము 25:32). నిజానికి ఏశావు ఆకలితో చనిపోయే పరిస్థితిలో లేడు. ఇస్సాకు చాలా ధనవంతుడు; అతని ఇంట్లో సేవకులు, సమృద్ధిగా ఆహారం ఉండేవి. కావాలంటే సేవకులతో భోజనం చేయించుకోవచ్చు, లేదా తన తల్లిదండ్రుల ద్వారా ఆహారం తెప్పించుకోవచ్చు. కాబట్టి ఏశావు ఆకలితో చనిపోయే పరిస్థితి అసలు లేదు. ఇది ఏశావు తన ఆకలిని అతిశయోక్తిగా చెప్పిన సందర్భం. అతని మాటలు నిజమైన అవసరాన్ని కాకుండా, అతని నిర్లక్ష్య మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి.

ఏశావుకు జ్యేష్ఠత్వంతో వచ్చే హక్కులు, ఆశీర్వాదాలు బాగా తెలుసు. అయినప్పటికీ, వాటికి అతడు విలువ ఇవ్వలేదు. అతని దృష్టి దేవుని వాగ్దానాలపై కాదు, ఆ క్షణంలో తన ఆకలిని తీర్చుకోవడంపైనే ఉంది. దేవుడు అబ్రాహాము మరియు ఇస్సాకులకు చేసిన నిబంధన వాగ్దానాలు అతనికి పెద్దగా విలువైనవిగా అనిపించలేదు. అతడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను తక్కువగా అంచనా వేశాడు. అందుకే, “జ్యేష్ఠత్వము నాకెందుకు?” అని అన్నాడు. ఒక తాత్కాలిక భోజనం కోసం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను తక్కువ చేసి చూశాడు. తాత్కాలిక శారీరక అవసరాన్ని తీర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను అతడు అమ్ముకున్నాడు.

అయితే యాకోబు ప్రవర్తన కూడా పూర్తిగా పూర్తిగా సమర్థించదగినది కాదు. ఆకలితో ఉన్న తన సహోదరునికి ఆహారం ఇవ్వాల్సిన చోట, అతడు ఆ పరిస్థితిని తన ప్రయోజనానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు ముందే “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని వాగ్దానం చేసినప్పటికీ, ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుందో యాకోబుకు తెలియదు. దేవుని సమయాన్ని ఎదురు చూడకుండా, తన తెలివితో దేవుని ప్రణాళిక నెరవేర్చాలని ప్రయత్నించాడు. ఇది దేవుని శక్తి, సమయం మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవడాన్ని చూపిస్తుంది. అందువల్ల ఈ సంఘటనలో ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తక్కువ చేసి చూడగా, యాకోబు కూడా దేవుని వాగ్దానాన్ని తన స్వంత మార్గంలో సాధించడానికి ప్రయత్నించడం ద్వారా తప్పు చేశాడు.

యాకోబు చేసిన విధానం సరైనది కాకపోయినా, ఆత్మీయ విషయాల విలువను గుర్తించిన అతని మనసు మాత్రం ప్రశంసించదగినది. జ్యేష్ఠత్వం కేవలం ఆస్తి లేదా గౌరవం మాత్రమే కాదు; అది దేవుని నిబంధన వాగ్దానాలు మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో ముడిపడి ఉందని యాకోబు అర్థం చేసుకున్నాడు. అందుకే అతడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోరాడు. ఆకలితో ఉన్న సమయంలో ఏశావు తన హక్కును అమ్మడానికి సిద్ధపడినా, తరువాత మనస్సు మార్చుకోవచ్చని యాకోబు భావించాడు. అందువల్ల అతడు ఏశావుతో ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణం ద్వారా ఏశావు దేవునిని సాక్షిగా పెట్టుకొని తన జ్యేష్ఠత్వ హక్కును యాకోబుకు అప్పగించాడు. ప్రమాణం చెయ్యడమంటే, ఏశావు దేవునిని సాక్షిగా పిలిచి ఆయన తనకు ఇచ్చిన జేష్ఠత్వపు హక్కులను ఆయన ఎదుటే యాకోబుకు బదిలీచెయ్యడం. ఇది కూడా ఏశావును భయపెట్టలేదు. ఇక్కడ ఏశావు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అతని ఆలోచన అంతా ఆ క్షణంలో తన ఆకలి తీర్చుకోవడంపైనే ఉంది. అందుకే బైబిల్, “అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయెను” అని చెబుతుంది. ఈ చిన్న వాక్యం ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఎంత తక్కువగా చూశాడో తెలియజేస్తుంది. దేవుడు ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కంటే, తాత్కాలిక శారీరక అవసరానికే అతను ఎక్కువ విలువ ఇచ్చాడు. ఈ శరీర సంబంధమైన ఆలోచనే అతనిని దేవుని వాగ్దానాలను కోల్పోయే స్థితికి తీసుకువెళ్లింది.

అందుకే ఏశావు బైబిలులో ఒక హెచ్చరికగా నిలిచిపోయాడు. హెబ్రీయులకు 12:16-17లో విశ్వాసులను హెచ్చరిస్తూ, “ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి వాడు ఎవడును ఉండకూడదు” అని చెబుతుంది. తరువాత ఏశావు ఆశీర్వాదం కోసం కన్నీళ్లతో వెదికినా, అప్పటికే అవకాశం కోల్పోయాడు. తన గత నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం అతనికి దొరకలేదు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది—తాత్కాలిక సుఖాల కోసం దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలను ఎన్నడూ తక్కువ చేసి చూడకూడదు. ఇది దేవుని వరాలను నిర్లక్ష్యం చేయడం ఎంత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో మనకు గుర్తుచేస్తుంది.

ఈ లోకంలో ఒక పూట భోజనం కోసం అంత గొప్ప వెల చెల్లించిన వ్యక్తి ఎవరైనా ఉంటే, అతడు ఏశావే. తాత్కాలిక ఆకలిని తీర్చుకోవడానికి దేవుడు తనకు ఇచ్చిన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. దానితో పాటు వచ్చే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు, దేవుని నిబంధన వాగ్దానాలు, కుటుంబ నాయకత్వం వంటి గొప్ప ఆధిక్యతలను అతడు తక్కువగా చూశాడు. అందుకే హెబ్రీయులకు 12:16 అతన్ని “భ్రష్టుడు” మరియు “వ్యభిచారి” అని పిలుస్తుంది. ఇక్కడ “భ్రష్టుడు” అంటే దేవుని పరిశుద్ధమైన వరాలను నిర్లక్ష్యం చేసే వ్యక్తి. “వ్యభిచారి” అంటే చిన్న తాత్కాలిక లాభం కోసం దేవుడు ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని వదులుకున్న వ్యక్తి. ముఖ్యంగా, ఈ నిర్ణయం ఏశావు స్వయంగా తీసుకున్నది. అతన్ని ఎవరూ బలవంతం చేయలేదు. కాబట్టి తన ఎంపికకు బాధ్యత కూడా అతనిదే.

మరోవైపు, యాకోబుకు అనేక లోపాలు ఉన్నప్పటికీ, దేవుని ఆశీర్వాదాల విలువ అతనికి తెలుసు. దేవుడు వాగ్దానం చేసిన దీవెనలను పొందాలని అతడు కోరుకున్నాడు. అయితే వాటిని పొందడానికి తన స్వంత మార్గాలను ఆశ్రయించడం అతని తప్పు. అయినప్పటికీ, ఈ ఇద్దరు సహోదరుల జీవితాలను పోల్చితే ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఏశావు దేవుని ఆశీర్వాదాలను తృణీకరించాడు; యాకోబు వాటిని విలువైనవిగా భావించి కోరుకున్నాడు. దేవుని ఎంపిక వెనుక ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఇదీ ఒకటి.

ఆదికాండము 26:34-35 ప్రకారం, ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో హిత్తీయులైన యహూదీతు, బాశెమతు అనే ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఈ నిర్ణయం అతని స్వభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇస్సాకు అతనిని ఎంతో ప్రేమించినప్పటికీ, ఏశావు తన తల్లిదండ్రుల మనసును గౌరవించలేదు. వారి ఇష్టానికి విరుద్ధంగా, కనానీయులైన అవిశ్వాసి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలు ఇస్సాకు, రిబ్కాలకు తీవ్రమైన మనోవేదన కలిగించాయి. అంతకంటే ముఖ్యంగా, ఈ చర్య ద్వారా ఏశావు దేవుని నిబంధన వాగ్దానాలను, తన కుటుంబానికి ఉన్న ప్రత్యేక పిలుపును తక్కువగా చూసినట్లు తెలుస్తుంది. అతడు వివాహం చేసుకున్న హిత్తీయులు యెహోవాను ఆరాధించని ప్రజలు. అలాంటి కుటుంబంలో దేవుని భయభక్తులు, ఆయన వాగ్దానాల పట్ల విశ్వాసం కొనసాగడం చాలా కష్టం. ఈ నిర్ణయం ద్వారా ఏశావు దేవుని మార్గాన్ని కాకుండా తన స్వంత ఇష్టాన్ని అనుసరించాడని స్పష్టమవుతుంది.

ఇప్పుడు ఆదికాండము 27:4లో ఇస్సాకు, “నేను చనిపోకముందే నిన్ను ఆశీర్వదించునట్లు నాకు ఇష్టమైన భోజనం చేసి తీసుకురా” అని ఏశావుతో చెప్పడం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎందుకంటే, “పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని దేవుడు ముందే రిబ్కాకు ప్రకటించాడు. ఈ విషయం ఇస్సాకుకు కూడా తెలిసి ఉండే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు, దేవుడు ఎంచుకున్న యాకోబును పక్కనబెట్టి, ఇస్సాకు ఏశావును ఎందుకు ఆశీర్వదించాలని ప్రయత్నించాడు?

ఆదికాండము 27వ అధ్యాయం ఇస్సాకు కుటుంబంలోని బలహీనతలను మన ముందుంచుతుంది. వృద్ధాప్యం వల్ల ఇస్సాకు తన మరణం సమీపించిందని భావించాడు. అందుకే చనిపోకముందే తన అభిమాన కుమారుడైన ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వాలని నిర్ణయించాడు. అందుకోసం, “నాకు ఇష్టమైన భోజనం చేసి తీసుకురా; నేను నిన్ను ఆశీర్వదిస్తాను” అని ఏశావుతో చెప్పాడు. అయితే ఈ నిర్ణయం దేవుడు ముందే ప్రకటించిన తన చిత్తానికి విరుద్ధమైనది. కాబట్టి ఇస్సాకు చేసిన ఈ చర్యను సమర్థించలేం.

బహుశా, తాను ఏశావును ఆశీర్వదించినా దేవుని ప్రణాళిక చివరికి నెరవేరుతుందనే భావనతో ఇస్సాకు తనను తాను సమర్థించుకొని ఉండవచ్చు. కానీ తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ఏశావులోని తీవ్రమైన లోపాలను అతడు పట్టించుకోలేదు. ఏశావు ఇప్పటికే అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా దేవుని నిబంధన పట్ల నిర్లక్ష్యాన్ని చూపించాడు. అయినప్పటికీ, ఇస్సాకు అతనికే ఆశీర్వాదం ఇవ్వాలని ప్రయత్నించాడు. ఇది దేవుని చిత్తం కంటే తన స్వంత అభిప్రాయాన్ని ముందుకు పెట్టిన తప్పు నిర్ణయం.

ఈ పాపంలో ఏశావు కూడా భాగస్వామి అయ్యాడు. ఎందుకంటే, అతడు ఇప్పటికే తన జ్యేష్ఠత్వ హక్కును యాకోబుకు ప్రమాణంతో అమ్మేశాడు. ఇప్పుడు తండ్రి ద్వారా ఆ ఆశీర్వాదాన్ని తిరిగి పొందాలని అంగీకరించడం అంటే, తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. అందువల్ల ఈ సంఘటనలో ఇస్సాకు, ఏశావు ఇద్దరూ దేవుని చిత్తాన్ని పక్కనబెట్టి తమ స్వంత కోరికలను అనుసరించారు.

రిబ్కా, ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలను విని చాలా భయపడింది. పితరులు ఆశీర్వదించేటప్పుడు వారు దేవుని ప్రతినిధులుగా మాట్లాడతారని ఆమెకు తెలుసు. అయితే దేవుడు ముందుగానే యాకోబునే ఎన్నుకున్నాడని తెలిసినా, ఇస్సాకు తన ఇష్టప్రకారం ఏశావును దీవించాలనుకోవడం ఆమెను కలవరపరిచింది. ఏశావు వేట నుండి తిరిగి వచ్చేలోపు ఏదో చేయకపోతే, యాకోబు ఆశీర్వాదాన్ని శాశ్వతంగా కోల్పోతాడని ఆమె భావించింది. అయితే ఈ పరిస్థితిలో తాను చేయబోయేది సరైనదా, తప్పా అనే విషయాన్ని ఆమె ఆలోచించలేదు.

రిబ్కాకు తన భర్త దేవుని సంకల్పానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని తెలుసు. దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరాలని ఆమె కోరుకుంది. కానీ దేవుని సమయాన్ని నమ్మి ఎదురు చూడకుండా, తన తెలివితో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆమె మోసానికి పాల్పడింది. తన వంట నైపుణ్యాన్ని ఉపయోగించి మేకమాంసాన్ని అడవి జంతువు మాంసంలా తయారు చేసింది. అలాగే, చూపు మందగించిన ఇస్సాకును మోసగించేందుకు యాకోబును కూడా ఒప్పించింది. ఆమె ఉద్దేశం దేవునికి మహిమ తేవడం కాదు; తనకు ఇష్టమైన కుమారుడు యాకోబు ఆశీర్వాదం పొందాలని కోరుకోవడమే. అందువల్ల, మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ, దాన్ని సాధించడానికి ఆమె ఎంచుకున్న మార్గం తప్పైంది.

యాకోబు, “అమ్మా, నాన్నకు ఈ విషయం తెలిసిపోతే నా మీదికి ఆశీర్వాదం కాకుండా శాపమే వస్తుంది” అని చెప్పడం సముచితమైన ఆందోళనే. తండ్రిని మోసం చేయడం ఎంత తీవ్రమైన విషయమో అతనికి తెలుసు. కానీ రిబ్కా వెంటనే, “నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక” అని చెప్పి యాకోబుకు ధైర్యం చెప్పింది. ఆమె మాటలను నమ్మి, యాకోబు ఉద్దేశపూర్వకంగా తన తండ్రిని మోసం చేశాడు. ఈ సందర్భంలో అతడు కూడా ఏశావులా వేషం వేసుకొని మోసానికి పాల్పడ్డాడు. ఒకవేళ ఇస్సాకు ఈ మోసాన్ని గుర్తించి ఉంటే, యాకోబు తీవ్రమైన శాపానికి, కుటుంబం నుండి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండేది. ఈ సంఘటన దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి మానవ మోసం, అబద్ధం అవసరం లేదని, దేవుని చిత్తాన్ని మనుషులు తమ స్వంత మార్గాల్లో నెరవేర్చాలని ప్రయత్నించినప్పుడు దాని పరిణామాలు ఎంత తీవ్రముగా ఉంటాయో మనకు బోధిస్తుంది.

ఇస్సాకు తికమకపడినా తన కుటుంబసభ్యులు తనను మోసగిస్తారని అనుకోలేదు. ఏశావు అనుకోని యాకోబును దీవించాడు: ఆదికాండము 27;27-29_ ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక. ఈ మాటలలో మెస్సియానిక్ ఆశీర్వాదం గురించి ఏమీ లేదు కాని ఇస్సాకు ఏశావు అని ఊహించుకొంటున్న కొడుకుపై ప్రకటించిన భౌతికమైన ఆశీర్వాదాలను గురించి తెలియజేస్తుంది. ఈ దీవెన ఓకే. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించు వారు శపింపబడుదురు. నిన్ను దీవించు వారు దీవింపబడుదురు గాక. ఈ రెండవ భాగం దేవుడు యాకోబుకు ఉద్దేశించిన నిబంధన ఆశీర్వాదానికి సంబంధించినది. ఇస్సాకు దానిని ఏశావుకు ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, దేవుని చిత్తం ప్రకారం అది యాకోబుకే దక్కింది.

అయితే యాకోబుకు ఈ ఆశీర్వాదం లభించింది అతని మోసం వల్ల కాదు, దేవుడు ముందుగానే నిర్ణయించిన ఉద్దేశ్యం వల్ల. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. అయినప్పటికీ, రిబ్కా మరియు యాకోబు చేసిన మోసం సమర్థించదగినది కాదు. వారి పాపాన్ని దేవుడు ఉపయోగించినా, అది పాపమే; దేవుడు పాపాన్ని ఎన్నడూ సమర్థించడు.

తరువాత ఏశావు ఇస్సాకు వద్దకు వచ్చి, “నా తండ్రి, నన్ను దీవించుము” అని అడిగాడు. అప్పుడు ఇస్సాకు, “నీవు ఎవరవు?” అని ప్రశ్నించగా, ఏశావు, “నేను నీ జ్యేష్ఠ కుమారుడనైన ఏశావును” అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇస్సాకు మిక్కిలి గడగడ వణికాడు (ఆది. 27:33).

ఇస్సాకు ఎందుకు వణికాడు? మొదటిగా, తాను మోసపోయానని గ్రహించి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అంతకంటే ముఖ్యంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏశావును ఆశీర్వదించాలని తాను ప్రయత్నించినప్పటికీ, దేవుడు తన ప్రణాళికను నెరవేర్చి, ఆ ఆశీర్వాదం యాకోబుకు చేరేలా చేశాడని అతడు గ్రహించాడు. దేవుడు తన వ్యవహారంలో జోక్యం చేసుకొని, తన సంకల్పాన్ని నెరవేర్చాడని తెలుసుకున్నప్పుడు, అది దేవుని మందలింపుగా ఇస్సాకుకు అనిపించింది. దేవుడు చేసిన దాన్ని తాను మార్చలేనని, తన శక్తి అక్కడ ఏమాత్రం పనిచేయదని అతడు అర్థం చేసుకున్నాడు.

అందుకే ఇస్సాకు ఏశావుతో, “నా కుమారుడా, నీకు నేను ఏమి చేయగలను?” అని అన్నాడు. అప్పటికే ప్రధాన ఆశీర్వాదం యాకోబుకు ఇవ్వబడింది. కాబట్టి ఇస్సాకు దేవుని ఆత్మ ప్రేరణతో ఏశావు మరియు అతని సంతతికి భవిష్యత్తులో జరిగే విషయాలను ప్రవచించాడు గానీ, యాకోబుకు ఇచ్చిన నిబంధన ఆశీర్వాదాన్ని తిరిగి ఏశావుకు ఇవ్వలేకపోయాడు.

అయితే ఏశావు ఈ సంఘటనలో దేవుని హస్తాన్ని చూడలేకపోయాడు. తన జీవితంలో జరిగిన దానికి తానే బాధ్యుడని గుర్తించకుండా, తన కోపాన్ని యాకోబుపై మళ్లించాడు. కోపం అతని ఆలోచనను మూసివేసింది. ఫలితంగా, అతడు యాకోబుపై పగ పెంచుకొని, తండ్రి మరణించిన తరువాత అతనిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఏశావు యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడని రిబ్కాకు తెలిసింది. వెంటనే ఆమె యాకోబును ఉత్తరాన సుమారు ఐదు వందల మైళ్ల దూరంలో ఉన్న హారానులో తన సోదరుడు లాబాను ఇంటికి పంపించింది. “కొన్నాళ్లు అక్కడ ఉండు; తరువాత నేను నిన్ను తిరిగి పిలిపిస్తాను” అని చెప్పి అతనిని పంపింది.

అయితే రిబ్కా కుతంత్రాలు, యాకోబు చెప్పిన అబద్ధాలు దేవునికి మహిమను తేలేదు. దేవుని వాగ్దానాలను నెరవేర్చే విషయంలో వారు దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచారని వారి క్రియలు చూపించలేదు. కొందరు, దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాన్ని పొందడానికి అతడు చేసిన ప్రయత్నం తప్పు కాదని వాదిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి—దేవుని ఉద్దేశ్యాలు మనుషుల మోసం లేదా అబద్ధం లేకుండానే తప్పకుండా నెరవేరుతాయి.

ఈ సంఘటనలో ఇస్సాకు కుటుంబంలోని నలుగురు సభ్యులు తమ తమ తప్పుల వల్ల బాధను అనుభవించారు. రిబ్కా, “కొన్నాళ్లు” అని అనుకొంది కానీ దేవుడు దానిని ఇరవై సంవత్సరాలుగా మార్చాడు. ఆమె ఎంతో ప్రేమించిన కుమారుడు యాకోబు తిరిగి వచ్చేలోపే రిబ్కా మరణించింది. యాకోబు ఆశీర్వాదం పొందినా, ఇంటిని విడిచి చేతికర్రతో మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. హారానులో ఇరవై సంవత్సరాలు దేవుడు అతనికి కఠినమైన శిక్షణ ఇచ్చాడు.

ఇస్సాకు కూడా తీవ్రమైన బాధను అనుభవించాడు. తాను ఎంతో ప్రేమించిన ఏశావు దేవుని దృష్టిలో భ్రష్టుడిగా నిలవడం అతనికి వేదన కలిగించి ఉండవచ్చు. మరోవైపు, తన స్వంత నిర్ణయాల వల్ల దేవుని ఆశీర్వాదాలను కోల్పోయిన ఏశావు కూడా తరువాత తీవ్రంగా కుమిలిపోయాడు. చివరకు ఇస్సాకు తన ఇద్దరు కుమారులను కోల్పోయినట్లే అయ్యాడు—ఒకడు దూరదేశానికి వెళ్లిపోయాడు, మరొకడు కోపంతో కుటుంబానికి దూరమయ్యాడు.

అందుకే యాకోబు ఫరోతో మాట్లాడుతూ, “నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి” (ఆదికాండము 47:9) అని చెప్పాడు. దేవుని కృప అతని జీవితంలో ఉన్నప్పటికీ, తన స్వంత తప్పుడు నిర్ణయాల వల్ల కలిగిన బాధను అతడు చాలా సంవత్సరాలు అనుభవించాడు.

దేవుడు ఏశావుకు బదులుగా యాకోబును ఎన్నుకోవడం మానవ యోగ్యత, జన్మహక్కు లేదా సాంస్కృతిక సంప్రదాయాలపై ఆధారపడలేదు. అది పూర్తిగా ఆయన సార్వభౌమ సంకల్పం ప్రకారమే జరిగింది. యాకోబు అపరిపూర్ణుడు, మోసపూరితంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నప్పటికీ, అతడు దేవుని ఆశీర్వాదాన్ని విలువైనదిగా భావించి దానిని కోరుకున్నాడు. అందువల్ల దేవుడు అతనిని క్రీస్తు రాబోయే నిబంధన వంశంలో కీలక వ్యక్తిగా ఉపయోగించాడు.

మరోవైపు, ఏశావు దేవుడు ఇచ్చిన ఆధ్యాత్మిక ఆధిక్యతను, ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేశాడు. అతని జీవితంలోని నిర్ణయాలు తన స్వంత బాధ్యతను, హృదయ స్వభావాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ కథ ద్వారా, దేవుని ఉద్దేశాలు మనుషుల అంచనాలకు భిన్నంగా ఉండవచ్చని, కానీ అవి ఎల్లప్పుడూ న్యాయమైనవని లేఖనం బోధిస్తుంది. అలాగే, దేవుడు తన కృపను మరియు విమోచన ప్రణాళికను ఎవరి ద్వారా నెరవేర్చాలో తన సార్వభౌమాధికారంతో ఎంచుకుంటాడనే గొప్ప సత్యాన్ని ఈ సంఘటన వెల్లడిస్తుంది.

దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో, కొందరు నిత్యరక్షణ కొరకు కృపలో ఏర్పరచబడ్డారని లేదా రక్షణకు ముందుగానే నిర్ణయించబడ్డారని లేఖనాలు బోధిస్తాయి. అయితే, అదే సమయంలో కొందరు నరకానికి ముందుగానే నిర్ణయించబడ్డారని బైబిల్ ఎక్కడా బోధించదు. ఏశావు–యాకోబుల కథ కూడా దేవుడు ఏశావును నిత్యనాశనానికి ఎంచుకున్నాడని చెప్పదు.

దేవుని చిత్తం ఏమిటో లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాయి. 2 పేతురు 3:9 ప్రకారం, దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుకొనుచున్నాడు.” అలాగే 1 తిమోతి 2:4 ప్రకారం, “మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని ఆయన కోరుకొనుచున్నాడు.” ఈ వచనాలు దేవుని ప్రేమ మరియు రక్షణ చిత్తం సమస్త మానవులకూ వర్తిస్తుందని స్పష్టంగా బోధిస్తున్నాయి.

యేసుక్రీస్తు లోకమంతటి పాపాల కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. అందువల్ల ప్రతి ఒక్కరికీ రక్షణ ద్వారం తెరవబడింది. ఏశావు కూడా రక్షించే విశ్వాసాన్ని కలిగి ఉంటే రక్షింపబడేవాడు. ఇదే సత్యం ప్రతి మనిషికి వర్తిస్తుంది. “యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.”

అందువల్ల, కృపలో ఏర్పరచబడటం (Election by Grace) మరియు దేవుని సార్వత్రిక రక్షణ చిత్తం (Universal Will of Grace) రెండూ లేఖనాలు బోధించే సత్యాలే. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఏశావు–యాకోబుల కథ ఎంతో సహాయపడుతుంది. ఈ కథ ద్వారా దేవుని సార్వభౌమ కృపను, అలాగే ప్రతి మనిషి పట్ల ఆయనకున్న రక్షణ చిత్తాన్ని మరింత స్పష్టంగా గ్రహించవచ్చు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl