యేసుని దేహాన్ని ఎత్తుకొని వెళ్ళారా?
యేసుని శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్లారు అనే అబద్ధంలోని అసంబద్దతలు (రోమన్ సైనికుల తరుపున ఆలోచిద్దాము)
మత్తయి 28:11-15_ వారు వెళ్లుచుండగా కావలి వారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడిన యెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందర కలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి.
రోమన్ సైనికులు పిలాతుకు బదులుగా ప్రధాన యాజకులకు ఈ విషయాలను ఎందుకని నివేదించారు? మత్తయి ప్రకారం, సమాధి వద్ద కాపలా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి “జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.”
మత్తయి 27:65లో పిలాతు ప్రధాన యాజకులతో, “కావలివారున్నారు గదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో” చెప్పాడు. కాబట్టి సమాధి భద్రత విషయంలో ప్రధాన యాజకులకు ప్రత్యక్షమైన ఆసక్తి మరియు బాధ్యత ఉన్నట్లు తెలుస్తుంది. అందువల్ల సైనికులు తమకు అప్పగించబడిన బాధ్యతలో జరిగిన అసాధారణ సంఘటనను ప్రధాన యాజకులకు తెలియజేయడం సహజమే.
ముఖ్యమైన విషయం ఏమిటంటే—సైనికులు సాధారణంగా ఒక శవం కనిపించకుండా పోయిందని మాత్రమే చెప్పలేదు. వారు “జరిగిన సంగతులన్నిటినీ” చెప్పారు. (మత్తయి 28:2–4లో మనకు భూకంపం, దేవదూత ప్రత్యక్షత, రాయి దొర్లించబడటం, సైనికులు భయంతో వణికి చచ్చినవారివలె కావడం వంటి అన్ని విషయాలు చెప్పారు). ఇది సాధారణ సమాధి దోపిడీ కథ కాదు.
ప్రధాన యాజకుల కోరిక మేరకు యేసుని సమాధి వద్ద కాపలాగా ఉన్న సైనికులు పునరుత్థానం గురించిన మొదటి వార్తను యెరూషలేముకు తీసుకు వచ్చారు. జరిగిన విషయాలు ఆయన పునరుత్థానం గురించిన ప్రవచనం నిజమైందని ప్రధాన యాజకులకు చెప్పడానికి సరిపోతాయి.
ప్రధాన యాజకులకు వచ్చిన వార్త చాలా తీవ్రమైనది. ప్రధాన యాజకులు మరియు పెద్దలు యేసును సిలువ వేయించడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది. వారు యేసు తన పునరుత్థానం గురించి ముందుగానే చెప్పిన మాటలను కూడా విని ఉండవచ్చు. మత్తయి 27:63లో వారు పిలాతు దగ్గరకు వెళ్లి, “ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడుదినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది” అని యేసు చెప్పిన మాటలను ప్రస్తావించారు. అందుకే వారు సమాధికి కాపలా పెట్టించారు. ఇప్పుడు అదే సమాధి ఖాళీగా ఉంది.
వారికి ఇది అత్యంత అసౌకర్యకరమైన పరిస్థితి. యేసు నిజంగా మృతులలో నుండి లేచాడని అంగీకరిస్తే, వారు యేసు గురించి తమ తీర్పును తిరిగి పరిశీలించాల్సి వస్తుంది.
సైనికుల నివేదిక ప్రధాన యాజకులకు చాలా చిరాకు తెప్పించింది. వారు తమ విజయం గురించి చాలా ఖచ్చితంగా ఉన్నారు, ఇప్పుడు ఇది! ఏమి చేయాలి? వాళ్ళు ఎంత జాగ్రత్త వహించినప్పటికీ, యేసు దేహం సమాధిలో లేదు. నిజానికి ఆయనను చంపడానికి వాళ్ళెంతగానో కష్టపడ్డారు. ఆయన దేహము సమాధిలో పెట్టబడక ముందు వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు – ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు. యేసుని బరియల్ లో వాళ్ళు ఉన్నారు, యేసుని సమాధిని రాతితో మూసివేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ సమాధికి పిలాతు ఆజ్ఞతో కావలి పెట్టారు. కాని యేసుని దేహము సమాధిలో లేదు. అక్కడ ఖాళీ సమాధి తప్ప. ఆయన మళ్లీ బ్రతికించబడ్డాడని స్త్రీలు శిష్యులచే ధృవీకరింపబడటాన్ని కూడా యూదా మతపెద్దలు విని ఉండొచ్చు.
యేసు సిలువపై మరణించిన తర్వాత సమాధి నుండి బయటకు వచ్చాడనే వార్త ప్రజలలో వ్యాపించినట్లయితే, వారి స్వంత ప్రతిష్ట, కీర్తి దెబ్బతింటుంది. పరిస్థితులు ఖచ్చితంగా మరింత ప్రతికూలంగా మారతాయి. పునరుత్థానుడైన మెస్సీయ చాలా చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాడు. సమాధి ఖాళీగా ఉందని, యేసు మృతులలో నుండి లేచాడని ఎవరూ ఖండించడంలేదు. ఈ సందిగ్ధంలో, యేసు మరణంలో హస్తం ఉన్న వారందరికీ ఖాళీ సమాధి గురించి తెలియజేయబడింది. మహాసభ సన్హెడ్రిన్ కూడుకొంది. త్వరితంగా సమావేశమైన అనేక మంది సభ్యులు ఈ పరిస్థితి యొక్క కొత్త పరిణామాలపై చర్చించారు. ప్రధాన యాజకుల జీవితంలో ప్రాముఖ్యమైన క్షణాలు ఉన్నాయి అనుకొంటే అవి ఇవే. వారికి వచ్చిన వార్త యేసు దైవత్వమును గురించి తెలియజేస్తుంది. ఆయన సమాధి నుండి విజయవంతంగా బయటకు వచ్చి తద్వారా అతని మెస్సీయత్వాన్ని స్పష్టంగా నిరూపించుకొన్నాడు కాబట్టి ఆయనను మెస్సీయగా అంగీకరించాలా? వారు ఆయన మరణానికి పట్టుబట్టి తప్పు చేశారని ఒప్పుకోవాలా? ఇప్పుడు తమ నాయకత్వాన్ని వదులుకుని, ప్రతిదీ పునరుత్థానమైన ప్రభువుకు అప్పగించాలా? లేదా వారు తమ వ్యతిరేకతను కొనసాగించాలా? వారి హృదయాలను మరింత కఠినతరం చేసుకుంటారా? పునరుత్థానం చేయబడిన మెస్సీయకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారా? ఇప్పుడు తమ స్వజనులకు, పిలాతుకు, లోకానికి యేమని జవాబు చెప్పాలి? ఎలా చెప్తే బాగుంటుంది?
నిజానికి సైనికులు తెచ్చిన వార్త, ఆ పాపులకు కృప యొక్క చివరి అవకాశాన్ని అందించింది. కాని వారందరూ ఏకగ్రీవంగా ఆ కృపను తిరస్కరించారు. క్రీస్తును గురించి ఏమీ తెలుసుకోకూడదని నిశ్చయించుకున్నారు. వారు పూర్తిగా మొండిగా మారారు. వాళ్ళు సత్యాన్ని పరిశీలించడానికి బదులుగా వారు ఒక కథను తయారు చేశారు. ఇక్కడ మత్తయి 28:12–13లో చాలా ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. ప్రధాన యాజకులు మరియు పెద్దలు “ఆలోచన చేసి” సైనికులకు చాలా డబ్బు ఇచ్చి “మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడి” అని చెప్పమన్నారు.
నిజానికి, మొదటిగా ప్రధానయాజకులు లేదా యూదా మతపెద్దలు శిష్యులను స్త్రీలను పిలిచి ఈ విషయమై ఎంక్వయిరీ చెయ్యాలి, చేశారా, లేదే. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి కనీసం ఎలాంటి ప్రయత్నము చెయ్యకుండా యూదా మతపెద్దలు చాలా తర్జనభర్జన తర్వాత వాళ్ళు సైనికులకు లంచం ఇచ్చి అబద్ద సాక్ష్యము పలుకకూడదు అనే యెహోవా ఆజ్ఞను మీరుతూ, అబద్ధం చెప్పడానికి వారిని ప్రేరేపించి ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయనను ఎత్తికొనిపోయిరనే అబద్దాన్ని ప్రాచుర్యము లోనికి తేవాలనే అభిప్రాయానికి వచ్చారు. సమాధి వద్ద జరిగిన నిజమైన సంఘటనల గురించి వారి నోళ్లను మూసివేయడానికి మరియు ఒక కల్పనను భర్తీ చేయడానికి, సత్యాన్ని దాచి అబద్దాన్ని ప్రాచుర్యము లోనికి తేవడానికి ఆ అబద్దాన్ని ధృవీకరించడానికి సైనికులకు చాలా పెద్ద మొత్తములో లంచం ఇవ్వబడింది. పెద్ద మొత్తంలో డబ్బు సులభంగా సమకూర్చబడింది. అనర్హమైన పనులకు సులభంగా స్పాన్సర్లు దొరుకుతారు.
యూదా మతపెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములోని అసంబద్ధతలను ఒక్కసారి పరిశీలిధ్ధాం:
1. యేసుని సమాధి వద్ద ఉంచబడిన రోమన్ సైనికులు యేసు దేహాన్ని కాపాడే ఉద్దేశ్యంతో అక్కడ ఉంచబడ్డారు. వాళ్ళు శిక్షితులైన సైనికులు. రోమన్ రూల్స్ ప్రకారం సైనికులు కాపలా ఉన్నప్పుడు (డ్యూటీలో) నిద్రపోతే శిక్ష మరణమే. మరి యేసు లేచి వెళ్ళిపోతున్నప్పుడు సైనికులందరు నిద్రపోతూ ఉన్నారా? తమ విధి నిర్వహణలో సైనికులు నిద్రపోయినందుకు వారిని ఎందుకని జవాబుదారీగా ఉంచలేదు? వారిలో ఏ ఒక్కరికి కూడా మెలకువ రాకుండా సమాధి మీద రాయిని దొర్లించడం సాధ్యమేనా? సైనికులు “నిద్రలో” ఉంటే, శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించారని వాళ్లకు ఎలా తెలుసు. ఒకవేళ సైనికులు “మేల్కొని ఉంటే,” వాళ్ళు శిష్యులను ఎందుకని ఆపలేదు, పట్టుకోలేదు. సైనికులు వాళ్లకు ఎందుకని భయపడ్డారు? తరువాతైనా శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించినట్లు ఎందుకని వాళ్ళు రుజువు చెయ్యలేదు? ఆ దిశగా వాళ్ళు కనీసం ప్రయత్నించను కూడా లేదు ఎందుకని? ప్రధానయాజకులు లేదా మహాసభ సన్హెడ్రిన్ వారు శిష్యులను పిలిచి ఎంక్వయిరీ చెయ్యను కూడా లేదు, ఎందుకని? ఈ రెండు అవకాశాలలో ఏదీ ఆ కథను బలపరచదు.
2. ఇక్కడ రోమన్ సైనికుల బాధ్యతను కూడా పరిగణించాలి. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా చెప్పాలి. రోమన్ సైన్యంలో కాపలా విధి చాలా తీవ్రమైన బాధ్యత. అయితే మత్తయి ఎంతమంది సైనికులు అక్కడ ఉన్నారో చెప్పలేదు. అయితే సంఖ్య ఎంత ఉన్నా, ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది: కాపలాదారుల సమక్షంలో శిష్యులు వచ్చి సమాధిని తెరిచి యేసు దేహాన్ని తీసుకెళ్లారని ఎలా నమ్మాలి?
శిష్యులు నిజంగా దేహాన్ని దొంగిలించి ఉంటే, వారు కాపలాదారులతో ఘర్షణకు దిగాల్సి వచ్చేది. అలాంటి ఘర్షణ గురించి మత్తయి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.
ఇంకా ముఖ్యంగా, ప్రధాన యాజకులు సైనికులపై నేరం మోపకుండా వారికి డబ్బు ఇచ్చి ఒక కథ చెప్పమని ఎందుకు చెప్పారు? ఎందుకంటే వారికి నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవడం కంటే ప్రజల ముందు ఒక వివరణను నిలబెట్టడం ముఖ్యమైపోయింది.
3. శిష్యులు సమాధిపై ఉన్న ముద్రను పగలగొట్టి యేసు శరీరాన్ని దొంగిలించి ఉంటే, ఈ దుష్కార్యానికి వారిని ఎందుకు శిక్షించలేదు? దొంగిలించబడిన శరీరాన్ని సమాధికి తిరిగి తీసుకురావాలని వారిని ఎందుకు బలవంతం చేయలేదు?
“శిష్యులు దేహాన్ని దొంగిలించారు” అనే కథలో శిష్యులు యేసు దేహాన్ని దొంగిలించారని అనుకుందాం. అయితే వారు దానిని ఎందుకు చేశారు? శిష్యులు యేసు పునరుత్థానం గురించి అబద్ధాన్ని సృష్టించడానికి దేహాన్ని దొంగిలించారని అనుకుంటే, వారు ఒక భారీ ప్రమాదాన్ని స్వీకరించారు. రోమన్ సైనికుల దృష్ట్యా శిష్యులు శరీరాన్ని దొంగిలించడానికి ధైర్యం చేయడం అంటే మరణాన్ని ఆహ్వానించడం కాదా?
అదీ కాక, తరువాత వారు యేసు పునరుత్థానాన్ని ప్రకటించారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో అపొస్తలులు యేసు పునరుత్థానాన్ని బహిరంగంగా ప్రకటించినట్లు చూస్తాము. ఒకవేళ వారు నిజంగానే దేహాన్ని దొంగిలించి ఉంటే, తాము తెలిసి చేసిన మోసానికి జీవితాంతం సాక్షులుగా నిలబడినట్లవుతుంది. కానీ వారు ప్రకటించిన సందేశం ఇదే: “దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను.”
4. సమాధులను దోచుకొనే దొంగలు ఒకవేళ యేసుని సమాధిని తెరచి యేసుని ఎత్తుకొనిపోయి ఉంటే ఆయనను అలాగే ఎత్తుకొనిపోయి ఉండేవాళ్ళు తప్ప ఆయన దేహమును చుట్టిన నారబట్టను పూర్తిగా విప్పేసి వాటిని చక్కగా మడిచి (అది కూడా నేను తిరిగి వత్తును అనే అర్ధములో) ఆయన నగ్నదేహాన్ని ఎత్తుకొనిపోయారా? లేదా ఆయనకు మరొక బట్టను చుట్టి ఎత్తుకొని పోయి ఇంకెక్కడన్న పాతిపెట్టారా?
సమాధిలో కనిపించిన నారబట్టలు కూడా ప్రశ్నను లేవనెత్తుతాయి. యోహాను 20:6–7లో పేతురు సమాధిలోకి ప్రవేశించినప్పుడు యేసు దేహాన్ని చుట్టిన నారబట్టలు అక్కడ కనిపించాయని, తలకు చుట్టిన రుమాలు కూడా ప్రత్యేకంగా చుట్టి ఉన్నాయని చెబుతుంది. ఇది దేహం తొందరగా దొంగిలించబడిందనే వివరణకు సహజంగా సరిపోదు.
ఒక దొంగ సమాధిలోకి చొరబడి, కాపలాదారుల నుండి తప్పించుకుని, దేహాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే, దేహం చుట్టిన వస్త్రాలను విప్పి, వాటిని అక్కడే సక్రమంగా ఉంచి వెళ్లడం ఎందుకు? ఇది కనీసం పరిశీలించాల్సిన ముఖ్యమైన ఆధారం.
5. ప్రధాన యాజకులు శిష్యులను ఎందుకు విచారించలేదు? ఇది కూడా గమనించదగిన విషయం. వారి వాదన ప్రకారం శిష్యులే యేసు దేహాన్ని దొంగిలించారు. అయితే అలా అయితే శిష్యులను విచారించవచ్చు. వారిని అరెస్టు చేయవచ్చు. యేసు దేహం ఎక్కడ ఉందో అడగవచ్చు. కానీ మత్తయి 28లో మనకు కనిపించేది ఏమిటి? సైనికులకు డబ్బు ఇవ్వడం మరియు ఒక కథ చెప్పమని ఆదేశించడం. ఇది సత్యాన్ని పరిశోధించే చర్య కంటే, ఒక వివరణను ప్రజల్లో ప్రచారం చేసే చర్యగా కనిపిస్తుంది.
6. ఇది లంచం ద్వారా సత్యాన్ని దాచే ప్రయత్నం. మత్తయి స్పష్టంగా చెబుతున్నాడు: “ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి…” ఇది చాలా ముఖ్యమైన విషయం. వారికి సత్యం తెలియదు కాబట్టి కథను సృష్టించలేదు. వారికి సత్యాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేకపోవడంతో, సత్యానికి బదులుగా ఒక కథను ప్రచారం చేయడానికి డబ్బు ఉపయోగించారు. ఇది కేవలం చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ఇది మనిషి పాప స్వభావాన్ని కూడా చూపిస్తుంది.
మనిషి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా, తన పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే, సత్యాన్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు.
యేసు పునరుత్థానం వారికి పశ్చాత్తాపానికి పిలుపుగా ఉండవచ్చు. కానీ వారు పశ్చాత్తాపపడటానికి బదులుగా అబద్ధాన్ని ఎంచుకున్నారు.
యూదా మత పెద్దలు ప్రాచుర్యము లోనికి తెచ్చిన అబద్ధంలో క్లిష్టమైన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఖాళీ సమాధి. యూదా మతపెద్దలేమో యేసుని శిష్యులు యేసుని దేహాన్ని ఎత్తుకు పోయారని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా చూపెడుతున్నారు. ఇదేమో అందరికి అందుబాటులో వాస్తవంలో కనబడుతూ ఉంది. ఇక్కడ యేసుని శిష్యులు అంటే అపొస్తలులు, అరిమతియా యేసేపు, నీకొదేములాంటి అత్యంత ధనవంతులు, ప్రభావశీలురు, ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు యేసుకు రహస్య అనుచరులుగా ఉన్నారు. ఇలా చాలామంది శిష్యులు యేసుకు ఉన్నారు అనే విషయం మరచిపోకండి. వీరిలో ఎవరన్నా కావొచ్చనే ఉధ్దేశ్యము ఈ అబద్ధంలో ఉంది.
రెండవది యేసుని పునరుత్థానము. అపొస్తలులు యేసును దగ్గరగా వెంబడించిన స్త్రీలలో కొందరు యేసు లేచాడని తాము ప్రత్యక్షంగా చూశామని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా వాళ్ళు కూడా చూపెడుతున్నారు. మరి యేసు లేచినట్లైతే ఆయన అందరికి ఎందుకని తన్నుతాను ప్రత్యక్షపర్చుకోలేదు. ఈ రెండిటిని కలిపి అర్ధం చేసుకోవడమే వాళ్ళు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములో ఉన్న చిక్కు ప్రశ్న.
అసలు ప్రశ్న: యేసు నిజంగా మృతులలోనుండి లేచాడా? కొత్త నిబంధన దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది—అవును, యేసు నిజంగా మృతులలోనుండి లేచాడు. ఆయన నిజంగా మరణించాడు, నిజంగా సమాధిలో ఉంచబడ్డాడు, ఆయన సమాధి ఖాళీగా కనబడింది, మరియు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తరువాత అపొస్తలులు యేసు పునరుత్థానాన్ని ధైర్యంగా ప్రకటించారు. పునరుత్థానం కేవలం క్రైస్తవ విశ్వాసంలోని ఒక సంఘటన కాదు; అది క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర సత్యం. అపొస్తలుడైన పౌలు, “క్రీస్తు లేపబడకపోయినయెడల మీ విశ్వాసము వ్యర్థము; మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు” అని 1 కొరింథీయులకు 15:17లో చెబుతున్నాడు. అంటే క్రీస్తు పునరుత్థానం లేకపోతే మన విశ్వాసానికి, మన రక్షణకు, మన నిరీక్షణకు పునాది ఉండదు. అయితే క్రీస్తు నిజంగా మరణించి, మృతులలోనుండి లేచాడు కాబట్టి మనకు రక్షణపై నిశ్చయమైన నిరీక్షణ ఉంది. క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయాడు; మన నీతీకరణ కొరకు లేచాడు; ఇప్పుడు జీవిస్తున్న క్రీస్తు ద్వారా మనకు నిత్యజీవ నిరీక్షణ కలిగింది.
“శిష్యులు యేసు దేహాన్ని దొంగిలించారు” అనే కథను మత్తయి స్వయంగా మనకు చెప్పడం లేదు. ఆ కథ ఎలా తయారు చేయబడిందో మత్తయి మనకు చెబుతున్నాడు.
ప్రధాన యాజకులు మరియు పెద్దలు సత్యాన్ని అంగీకరించడానికి బదులుగా సైనికులకు డబ్బు ఇచ్చి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయించారు.
అయితే మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. మనిషి తన పాపాన్ని సమర్థించుకోవడానికి సత్యాన్ని తిరస్కరించవచ్చు. కానీ సత్యం మారదు.
క్రీస్తు నిజంగా మృతులలోనుండి లేచాడు. అందుకే మన నిరీక్షణ మన భావాల మీద, మన పనుల మీద, లేదా మన బలహీనమైన విశ్వాసం మీద ఆధారపడలేదు.
మన నిరీక్షణ సిలువపై మన పాపాల కోసం మరణించి, మూడవ దినమున మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తుపైనే ఉంది.
కాబట్టి పునరుత్థానుడైన క్రీస్తును నమ్ముదాం, ఆయన వాక్యాన్ని పట్టుకొందాం, ఆయన క్షమాపణలో జీవిద్దాం, మరియు ఆయన మనకు ఇచ్చిన నిత్యజీవ నిరీక్షణను ఇతరులకు ప్రకటిద్దాం.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
