నీకొదేము ఎవరు?
- నీకొదేము రిలీజియస్ ప్రొఫెషన్ ఏంటి?
- ఆనాటి సమాజములో నీకొదేము అఫిషియల్ పోసిషన్ ఏంటి?
- సన్హెడ్రిన్ లో ఒక సభ్యునిగా ఉండాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి?
- టాల్ముడిస్ట్‌లు నీకొదేమును గురించి యేమని చెప్పారు?
- యోహాను నీకొదేమును గురించి ఎందుకని తన సువార్తలో పేర్కొన్నాడు?
- నీకొదేము యేసు దగ్గరకు రాత్రిపూట రహస్యంగా ఎందుకని వచ్చాడు?
- యేసుపట్ల నీకొదేముకు ఉన్న అభిప్రాయము ఏంటి?
- నీకొదేము ఒంటరిగా యేసుని యొద్దకు వచ్చాడా లేదా అతనితో పాటు ఎవరన్నా వచ్చారా?
- నీకొదేము రాకడ వెనుక ఉన్న ఉదేశ్యము ఏమై ఉండొచ్చు?
- బోధకుడా అనే సంబోధన వెనుక నీకొదేము ఉదేశ్యము ఏమై ఉండొచ్చు?
- ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పడంలో యేసుని ఉదేశ్యము ఏంటి?
- వారి సంభాషణలో ఉన్న ప్రాముఖ్యమైన సిద్ధాంతములు ఏంటి?
- యోహాను 7:45-53లో నీకొదేము యేసు కొరకు బహిరంగముగా ఏం చేసాడు?
- యోహాను 19:39లో నీకొదేము యేసు కొరకు బహిరంగముగా ఏం చేసాడు?
యోహాను 3:1,2 యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి– బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
నికోదేము యూదులలో అత్యంత కఠిన వర్గమైన పరిసయ్యులలో ఒకడు. అతనికి లేఖనాలు బాగా తెలుసు మరియు మోషే ధర్మశాస్త్రాన్ని అంకితభావంతో పాటించడానికి కట్టుబడిన వాడు. చాలామంది పరిసయ్యులు యేసును వ్యతిరేకించినప్పటికీ, అతడు యేసును గౌరవించాడు. నికోదేము ఒక గౌరవనీయమైన మత నాయకుడు. అతడు యెరూషలేములోని యూదుల పరిపాలక మండలి అయిన మహా సన్హెడ్రిన్లో (ఒక సుప్రీంకోర్టు వంటిది) కూడా సభ్యుడు. అటువంటి పదవిని చేపట్టాలంటే, అతడు విద్యావంతుడై, ధనవంతుడై, మరియు అత్యంత గౌరవనీయుడై ఉండాలి. యేసు అతని ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అతన్ని “ఇశ్రాయేలు బోధకుడు” (యోహాను 3:10) అని కూడా పిలిచాడు. అతడు తన సహచరులచే కూడా గౌరవించబడ్డాడు.
నీకొదేము సహోదరుడైన జోసెఫ్ బెన్ గురియన్ రోమన్ జ్యూయిష్ హిస్టోరియాన్ మరియు పేరెన్నికగన్న మిలట్రీ లీడర్. నీకొదేము కుటుంబం సమాజంలో ప్రభావవంతమైన ధనిక కుటుంబంగా పేరుగాంచింది. టాల్ముడిక్ రచనల ప్రకారం, అతడు యెరూషలేములో ఉన్న ముగ్గురు అత్యధిక ధనవంతులలో ఒకడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అతడి ఐశ్వర్యానికి ఉదాహరణగా, అతడు తన కుమార్తెకు ఇచ్చిన కట్నం వివరాలు, సుగంధ ద్రవ్యాల కోసం ఖర్చు చేయబడిన బంగారు దీనారాల వివరాలు చెప్పబడతాయి. యేసు సమాధి కోసం అతను తీసుకువచ్చిన ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో కూడా అతని సంపద కనిపిస్తుంది (యోహాను 19:39-40).
ఇంతటి ప్రభావవంతమైన, సంపన్నుడైన వ్యక్తి – యేసును వ్యక్తిగతంగా కలుసుకుని, సంభాషించడానికి రావడం విశేషం. ఇతనిని యేసుని సందర్శించిన వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చెప్పొచ్చు.
సాధారణ ప్రజలు మాత్రమే యేసును విశ్వసించలేదని, విద్యావంతులు, ధనవంతులు మరియు ఉన్నత స్థాయి నాయకులు కూడా ఆయనను మెస్సీయగా గుర్తించారని చూపించడానికి యోహాను తన సువార్తలో నీకొదేమును గురించి ప్రస్తావించాడు.
యూదా నాయకులు యేసును నిశితంగా గమనిస్తున్నందున నీకొదేము రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చాడు. యేసు అద్భుతాలు చేసినప్పటికీ చాలా మంది అధికారులు ఆయనపై అనుమానం వ్యక్తం చేసినందున అతడు విమర్శలకు భయపడి లేదా ఆయనతో వ్యక్తిగత సంభాషణను కోరుకుని ఆయన దగ్గరకి వచ్చి ఉండొచ్చు.
నీకొదేము రాత్రిపూట యేసును రహస్యంగా కలవడానికి పలు కారణాలు ఉండొచ్చని పండితుల అభిప్రాయం:
1. సన్హెడ్రిన్ తరపున ప్రతినిధిగా నీకొదేము నియమింపబడి ఉండొచ్చు. యేసు చెప్పేది వినడానికి బహిరంగంగా ఆయనను తమ వద్దకు ఆహ్వానించడానికి బదులుగా పరిసయ్యులు ఆయన పట్ల తమకుగల అభిప్రాయాలను రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకొని రాత్రిపూట తమ అధిపతుల్లో ఒకరిని యేసుని భోధలలో ఉన్న పరమార్ధాన్ని ప్రశ్న జవాబుల రూపములో తెలుసుకోవడానికి యేసు వద్దకు రహస్యముగా పంపించి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.
2. యేసు పట్ల పరిసయ్యులకు ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని, నీకొదేము స్వయంగా భయంతో రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చి ఉండొచ్చని మరికొందరి అభిప్రాయం.
3. నీకొదేము మాటలను బట్టి, యేసు బోధలకు, అద్భుతాలకు ముగ్ధుడై అతడు సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో యేసు దగ్గరికి వచ్చి ఉండొచ్చని మరికొందరి అభిప్రాయం.
సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో అంటే,
- వారి పాఠశాలల్లో చదువుకోని, వారి అధికారంతో పంపబడని, వడ్రంగి మూలం ఉన్న ఒక వ్యక్తి, వారి వ్యవస్థల్లో చేర్చని సిద్ధాంతాలను బోధిస్తూ, వారిని వారి వ్యవస్థను సవాలు చేస్తూ, చేస్తూ ఉన్న అద్భుతాలను బట్టి సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో, అతడు యేసుతో స్వేచ్ఛగా ఒంటరిగా మాట్లాడటానికి వచ్చి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.
- మనుష్యులు కొత్త మతాన్ని సులభముగా స్వీకరించడం మనలను ఆశ్చర్యపరచదు. కొంతమంది వచ్చిన ప్రతి భోదకుని వెంట పోతూ ఉంటారు కాబట్టి. నీకొదేము అలా కాదు. జుడాయిజం దేవునికి చెందినదని, జుడాయిజం మెస్సీయను ప్రవచించిందని అతనికి తెలుసు, దానితో క్రీస్తు సరిపోలటం లేదు. కాని యేసు చేసే అద్భుతాలు ఆయన మిషన్‌ను ప్రమాణీకరిస్తున్నాయి. కాబట్టి ఆయనను అంగీకరించే ముందు సత్యమేంటో ఆయన ద్వారానే తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో, అతడు యేసుతో స్వేచ్ఛగా ఒంటరిగా మాట్లాడటానికి వచ్చి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.
- పాత నిబంధన యొక్క వాస్తవికతలో దాని పరిపూర్ణతను నెరవేర్పును యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని ఎన్నోవిశిష్టమైన రుజువులతో నిరూపిస్తూ ఉండడాన్ని బట్టి ఆయన నుండే సత్యాన్ని వ్యక్తిగతముగా అతడు తెలుసుకోవాలనుకొని వచ్చి ఉండొచ్చని కొందరి అభిప్రాయం.
నీకొదేము యేసుని వద్దకు రాత్రిపూట రావడానికి ఇంకా ఏవన్నా కారణాలు ఉండొచ్చా:
- యేసు పగటిపూట ప్రజలకు బోధించడం మరియు సేవ చేయడంలో బిజీగా ఉంటాడు. నీకొదేము కూడా పగలంతా తన పనిలో బిజీనే. కాబట్టి నీకొదేము ఆయనకు అంతరాయం కలిగించకుండా ఉండటానికి అతడు రాత్రిని ఎన్నుకొని ఉండొచ్చు.
- పరిసయ్యులు మరియు ప్రధాన యాజకులతో యేసుకు ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు అతడు రాత్రిపూట యేసు దగ్గరకు వచ్చి ఉండొచ్చు.
- మరికొందరు అతడు యేసుతో బహిరంగంగా కనిపించడానికి భయపడ్డాడని లేదా సిగ్గుపడ్డాడని కాబట్టే రాత్రిపూట రహస్యంగా యేసుని దగ్గరకు వచ్చియుండొచ్చు అని చెప్తారు.
అట్లే దేవుడు నీకు తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పడం దేవుని నుండి వచ్చిన ఈ బోధకుడు మెస్సయ్య అను తన నమ్మికను ధృవీకరించుకోవడానికే నీకొదేము యేసు దగ్గరకు రాత్రిపూట రహస్యంగా వచ్చాడని స్పష్టముగా అర్ధమవుతుంది.
నీకొదేము ఒంటరిగా యేసుని యొద్దకు వచ్చాడా లేదా అతనితో పాటు ఎవరన్నా వచ్చారా అనే ప్రశ్నకు యూదుల నియమావళి ప్రకారం ఈ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లడమంటే అది ఎన్నో అనుమానాలకు తావిస్తోంది కాబట్టి నీకొదేము ఒంటరిగా యేసుని దగ్గరకు వచ్చి ఉండడు.
నీకొదేము రాకడ వెనుక ఉన్న ఉద్దేశ్యము:
- యూదుల అధికారిగా ఇతడు రాజకీయాల గురించి మాట్లాడటానికి రాలేదు. అతడు తన ఆత్మ మరియు మోక్షం గురించి మాట్లాడటానికి వచ్చాడు.
- యేసు నిజంగా ఎవరో మరియు ఆయన బోధలేమిటో అర్థం చేసుకోవాలనుకున్నాడు. యోహాను 3:3-21లోని వారి సంభాషణ నుండి ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతూ ఉంది.
- ఇతడు ఒక సత్యాన్వేషి వలె తెగువను చూపుతూ యేసుని యొద్దకు వచ్చాడు. ఇతడు భయపడి క్రీస్తు దగ్గరకు వచ్చి ఉంటే యేసు ఇతనిని మందలించి ఉండేవాడు. సమస్తము తెలిసిన యేసుకు నీకొదేము హృదయములో ఏ ఆలోచన ఉందొ తెలియదా?
- నీకొదేము మెస్సయ్య విషయములో అతనికున్న కన్ఫ్యూషన్ తొలగించుకోవడానికి వచ్చాడు. యేసే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న రాజా? అలాగైతే, ఎవరైనా దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించగలరు? ఇది అతని హృదయంలో ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతో లోతైనది.
ఆ క్రమములోనే నీకొదేము ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము అంటే నేనును నాతో పాటు వచ్చిన వీళ్ళు కూడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నమ్ముతున్నారు అని అర్థం. చాలా మంది పరిసయ్యులు యేసును వ్యతిరేకించినప్పటికీ, కొందరు ఆయన దేవుని నుండి వచ్చిన వాడని నమ్మారు, అయినప్పటికీ వారు ఆ విషయాన్ని బహిరంగంగా వ్యక్తపర్చలేదు.
యేసును “బోధకుడా” అని పిలవడం గొప్ప గౌరవానికి చిహ్నం. ఇది గౌరవప్రదమైన మత పెద్దలకు మాత్రమే ఉపయోగించే బిరుదు. యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని ఎన్నో విశిష్టమైన రుజువులతో నిరూపితమవుతూ ఉండడాన్ని బట్టి యూదుల అధికారిగా యూదుల సన్హెడ్రిన్ సభలో సభ్యునిగా యూదులకు భోధకుడైన నీకొదేము యేసును “బోధకుడా” అని గౌరవముతో సంబోధించడం అతడు యేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇది అతడు ఆయనను ఎంతగా గౌరవించాడో తెలియజేస్తుంది.
నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని పిలవడం ద్వారా, సత్యాన్ని బోధించడానికి మరియు జీవన విధానాన్ని చూపించడానికి యేసుకు అధికారం ఉందని నీకొదేము అంగీకరించాడు. ఆయన మాటలను వినడానికి, నేర్చుకోవడానికి తన సంసిద్ధతను వ్యక్తపర్చాడు.
దేవుడతనికి తోడైయుంటేనే గాని ఎవరూ అలాంటి అద్భుతాలు చేయలేరని అతడు చెప్పినప్పుడు, ఈ అద్భుతాలు దేవుని ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని నీకొదేము అర్థం. ఆ అద్భుతాలు అతడు దేవుని నుండి వచ్చాడనడానికి రుజువులు. దేవుడు మాత్రమే అలాంటి పనులు చేయగలడు కాబట్టి, యేసు చేసిన అద్భుతాలు ఆయన నిజంగా దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడని తెలియజేస్తున్నాయని నీకొదేము ఆయనతో చెప్పాడు.
యేసు నీకొదేముతో రిడిల్స్ రూపములో సంభాషణను ప్రారంభించి సంక్షిప్తముగా, మారుమనస్సు నొంది బాప్తిస్మము పుచ్చుకొనుము, దేవునిరాజ్యము సమీపించియున్నది అందుకై ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అనేకమంది యూదులు మెస్సీయ రాజకీయ మరియు ప్రాపంచిక “స్వర్ణయుగం” తీసుకువస్తాడని ఆశించారు. వారు తమ పాపం లేదా దేవుని దయ కోసం వారి అవసరంపై కాకుండా భూసంబంధమైన విజయంపై దృష్టి పెట్టారు. ఈ స్వర్ణయుగం అనెడి కల వారిని వారి ఆత్మీయ జీవితాలలో గ్రుడ్డివారినిగా చేసింది. వాళ్ళు దేవుని కుమారుడు కృపాసత్య సంపూర్ణునిగా వారి మధ్యలోనికి వచ్చియున్నను వాళ్ళు గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. సిమియోను వంటి కొందరు మాత్రమే తమ పాపాల నుండి తమను రక్షించేవాని కోసం ఎదురు చూస్తున్నారు.
కాబట్టే నీకొదేము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, వారి సంభాషణలో, యేసు యూదుల ప్రాపంచికతను ప్రస్తావిస్తూ, మీరు మీ ప్రస్తుత నైతిక స్థితిలో దేవుని రాజ్యమును గురించి దాని విశిష్టతను గురించి ఆలోచించలేరు. మీరు అంతర్గతంగా మారితే తప్ప మీరు ఎప్పటికి దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. మీరు కొత్తగా జీవించడం ప్రారంభించాలి అంటే మీ నైతిక హృదయంలో మార్పు అవసరం. అంతరంగములో ప్రక్షాళన దైవిక ప్రభావం యొక్క అంతర్గత అనుభవం లేకుండా ఒకడు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం అసాధ్యం అని చెప్పాడు.
దేవుని రాజ్యం అంటే దేవుని పాలన. అందులో ప్రవేశించడం అంటే ఆయన అధికారం కిందకు రావడం. ఈ రాజ్యం నీతిమంతుడు మరియు దయగల దేవునిచే పాలించబడుతుంది మరియు అది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ పాలన సార్వత్రికమైనది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్త జన్మ ఉండాలి తప్ప ఎవరూ తమ స్వంత ప్రయత్నంతో అందులోకి ప్రవేశించలేరు. ఒక వ్యక్తి కొత్తగా మారాలి – దేవుని ద్వారా అంతరంగం లో మారాలి.
ఈ సంభాషణ మనకు ముఖ్య సత్యాలను బోధిస్తుంది: రక్షణకై దేవుడు మాత్రమే పని చేస్తాడు.మనం ఆత్మ ద్వారా మళ్లీ పుట్టాలి. యేసు తన త్యాగం ద్వారా మనలను రక్షించడానికి వచ్చాడు. దేవుడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు మరియు ప్రజలను తన వద్దకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. యేసుపై విశ్వాసం శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. కానీ ఆయనను తిరస్కరించడం ఒక వ్యక్తిని దేవుని తీర్పు క్రింద వదిలివేస్తుంది.
నీకొదేమును గురించి యోహాను 7వ అధ్యాయము కూడా కొన్ని విషయాలను తెలియజేస్తుంది. యేసు గురించి ఏమి చెయ్యాలి అని సన్హెడ్రిన్ సభ వారు ఆలోచిస్తు యేసుని బంధించి తెమ్మని ప్రధాన యాజకులు పరిసయ్యులు బంట్రౌతులను పంపగా, ఆ బంట్రౌతులు ప్రధానయాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు –ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోసపోతిరా? అధికారులలోగాని పరిసయ్యులలోగాని యెవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు– నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి అని యోహాను 7:45-53లో ఉంది చూడండి. నీకొదేము తనను తాను యేసుకు అనుచరుడిగా ఇంకా బహిరంగంగా ప్రకటించుకోకపోయినా, నీకొదేము యేసును సమర్థిస్తూ, న్యాయమైన విచారణ లేకుండా ఒక వ్యక్తిని ఖండించడానికి వారి ధర్మశాస్త్రం అనుమతిస్తుందా అని సభను ప్రశ్నించాడు. నీకొదేము యేసు తరపున లేఖనానుసారముగా (నిర్గమకాండము 23, ద్వితీయోపదేశకాండం 1:16) స్టాండ్ తీసుకోవడం కౌన్సిల్‌లోని మిగిలిన వారు నీకొదేము మాటలను నిర్మొహమాటంగా తోసిపుచ్చటం తద్వారా నీకొదేము శిష్యత్వపు నిందను భరించడం మనం చూడొచ్చు. నీకొదేము యేసు విషయంలో మౌనంగా ఉండలేక పోయాడు.
తర్వాత నీకొదేమును గురించి యోహాను 19:39లో ఉంది చూడండి. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను అని చెప్తుంది.
యేసు సమాధిలో నీకొదేము మరియు అరిమతియ యేసేపు వేర్వేరు పాత్రలను కలిగి ఉన్నారు. యేసును పాతిపెట్టడానికి యేసేపు అనుమతి అడిగాడు, నీకొదేము ఆయన శరీరాన్ని సిద్ధం చేయడానికి సుగంధ ద్రవ్యాలు తెచ్చాడు. చాలా మంది శిష్యులు భయపడి పారిపోయిన సమయంలో, నీకొదేము ధైర్యంగా యేసును గౌరవించడానికి బహిరంగంగా ముందుకు వచ్చాడు.
నికోదేము గురించి మనకు పెద్దగా తెలియదు. యోహాను సువార్త మనకు కొన్ని విషయాలు మాత్రమే చెబుతుంది: యేసు దేవుని నుండి వచ్చాడని అతడు నమ్మాడు, రాత్రిపూట ఆయనను దర్శించాడు, సభ ముందు ఆయన పక్షాన మాట్లాడాడు, మరియు ఆయన దేహాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. యేసు సమాధి తర్వాత నీకొదేమును గురించి బైబిల్ మౌనంగా ఉంది. కాబట్టి అతనిని గురించి ఏమి తెలియదు.
ఈ కొన్ని వివరాలతోనే, నికోదేములో ఒక శక్తివంతమైన మార్పు కనబడుతుంది. అతడు మొదట జిజ్ఞాసతో, అన్వేషణతో ఉన్న ఒక మత నాయకుడిగా ప్రారంభమయ్యాడు. కాలక్రమేణా, అతని ప్రశ్నల నుండి యేసును సమర్థించడం వరకు, చివరకు ఆయనను బహిరంగంగా గౌరవించడం వరకు ఎదిగాడు. అతని కథ పెరుగుతున్న విశ్వాసాన్ని చూపిస్తుంది.
కొత్త నిబంధనలో, నీకొదేము వలె శక్తివంతమైన పరివర్తనను కొన్ని పాత్రలు మాత్రమే స్పష్టంగా చూపిస్తాయి. మత నాయకుడు, సత్య అన్వేషకుడు మరియు చివరికి క్రీస్తు అనుచరుడు అయిన నీకొదేము యోహాను సువార్తలో నిజాయితీగల ప్రశ్నలతో యేసును సమీపించే, వారికి గురుతుగా కనిపిస్తాడు. అతని సందర్శన లోతైన ఆధ్యాత్మిక ఆకలిని ప్రతిబింబిస్తుంది.
ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. మొదటిది, మతపరమైన లేదా విద్యావంతులుగా ఉండటం ఎవరినీ రక్షించదు-ప్రతి వ్యక్తికి క్రీస్తు ద్వారా కొత్త జీవితం అవసరం. రెండవది, విశ్వాసం తరచుగా అంచెలంచెలుగా పెరుగుతుంది. ఆయనను వెతకండి, ఆయనను నమ్మండి, ధైర్యంగా వ్యవహరించండి. మూడవది, దేవుడు తనను హృదయపూర్వకంగా వెతుకుతున్న వారిని లోతైన సత్యంలోకి నడిపిస్తాడు.
అన్వయింపుగా, క్రీస్తును గౌరవించడం గొప్ప విషయమే, కాని క్రీస్తును ఒప్పుకోవడం మాత్రమే సరిపోదు. ఒకడు రక్షింపబడాలంటే ఆధ్యాత్మిక మార్పులేకుండా ఆత్మమూలముగా జన్మించకుండా ఒకడు రక్షింపబడలేడు. ఒక వ్యక్తి యేసును ఒప్పుకోవడానికి రావడమంటే అతడి ఒప్పుకోలును తెలియజేయడమంటే అందుకు తెగువ ధైర్యం కావాల్సి ఉంది, త్యాగం చెయ్యాల్సి ఉంటుంది, వెలను చెల్లించాల్సి ఉంటుంది, పోరాటాలు పేస్ చెయ్యాల్సి ఉంటుంది, అన్నింటికీ మించి కిరీటాన్ని గెల్చుకోవాల్సి ఉంటుంది. ఆ కిరీటాన్ని గెల్చుకొనేందుకు దేవుడు మిమ్మును బలపరచును గాక.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
